సాక్షి, హైదరాబాద్: కమిషన్‌లో పనిచేస్తున్న వ్యక్తులే పేపర్ల లీకేజీకి పాల్పడతారని ఊహించలేకపోయినట్లు టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డి సిట్ అధికారుల విచారణలో పేర్కొన్నారు. ఇప్పటివరకు తమ దృష్టికి వచ్చిన దాని ప్రకారం ప్రవీణ్, రాజశేఖర్, రమేష్, షమీమ్‌లపై గతంలో ఎలాంటి ఆరోపణలు లేవని... ఈ నేపథ్యంలో ఇలాంటి లీకేజీ జరుగుతుందని ఊహించలేదని వివరణ ఇచ్చారు.
టీఎస్‌పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ స్కాంను దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు సోమవారం కమిషన్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి వాంగ్మూలం నమోదు చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవి కావడంతో చైర్మన్‌కు నోటీసులు పంపకుండా స్వయంగా టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి అధికారులు వెళ్లారు.
సిట్ చీఫ్‌గా ఉన్న అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో సీసీఎస్ ఏసీపీ కె.నర్సింగ్‌రావుతో కూడిన బృందం టీఎస్‌పీఎస్సీకి వెళ్లి మూడు గంటలకుపైగా చైర్మన్‌ను ప్రశ్నించింది.
ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్ కుమార్, రాజశేఖర్‌రెడ్డి నుంచి స్వా«ధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లను అధికారులు తమ వెంట తీసుకువెళ్లారు. ప్రధానంగా టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల తయారీ, వాటి భద్రత తదితర అంశాలపైనే జనార్దన్‌రెడ్డిని విచారించారు.
పర్యవేక్షణ బాధ్యత నాదే: చైర్మన్
ప్రశ్నపత్రాల తయారీ, భద్రత పర్యవేక్షణ తనదేనని విచారణ సందర్భంగా చైర్మన్ పోలీసులకు తెలిపారు. ప్రతి పరీక్షకు సంబంధించి ప్రశ్నపత్రాల తయారీకి సెట్టర్స్‌గా పిలిచే నిపుణుల సహాయం తీసుకుంటామని, వారినే వ్యక్తిగతంగా కాన్ఫిడెన్షియల్ విభాగానికి ఆహ్వానిస్తామని వివరించారు. అక్కడకు వచ్చే వరకు ఒక సెట్టర్ విషయం మరొకరికి తెలియకుండా జాగ్రత్తలు ఉంటాయన్నారు.
వారు రూపొందించిన ప్రశ్నపత్రం కాపీలను కస్టోడియన్ శంకరలక్ష్మి కంప్యూటర్‌లో భద్రపరుస్తారని, ఓ డిజిటల్ కాపీని సెక్షన్‌లోని లాకర్‌లో ఉంచడం ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ అని జనార్దన్‌రెడ్డి సిట్ అధికారులకు తెలియజేశారు. తనతోపాటు కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారులే ప్రశ్నపత్రం తయారీలో ప్రత్యక్షంగా పాల్గొంటారని ఆయన వివరించారు.
లీకేజీ వ్యవహారంలో కస్టోడియన్ నిర్లక్ష్యం సహా వివిధ అంశాలపై అంతర్గత విచారణ కూడా జరుగుతోందని, అది పూర్తయ్యాక వెలుగులోకి వచ్చే వివరాల ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చైర్మన్ పేర్కొన్నారని తెలిసింది. వాంగ్మూల పత్రాలపై ఆయన సంతకాలు తీసుకున్న దర్యాప్తు అధికారులు వాటిని కోర్టులో దాఖలు చేయనున్నారు.
పరీక్షలు రాసిన ఉద్యోగులపైనా ఆరా
పరీక్షలకు హాజరైన టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల్లో ఎందరు అనుమతి పొందారనే అంశాన్నీ సిట్ సేకరిస్తోంది. కమిషన్ ఉద్యోగులు, సభ్యులకు బంధువులు, స్నేహితులు, కుటుంబీకుల్లో ఎవరైనా టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రాశారా? వారి పరిస్థితి ఏంటి? తదితర వివరాల పైనా దృష్టి పెట్టి దర్యాప్తు చేస్తోంది.
కమిషన్ కార్యాలయానికి వెళ్లిన సిట్ అధికారులు కాన్ఫిడెన్షియల్ సెక్షన్, కస్టోడియన్ ఛాంబర్‌తో పాటు ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి, రమేష్, షమీమ్‌లు కూర్చునే సీట్ల వద్దా తనిఖీలు చేశారు. అక్కడ నుంచి కొన్ని రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
భద్రత పెంచాలని సూచించాం..
మా దర్యాప్తులో టీఎస్‌పీఎస్సీలో ఉన్న అనేక లోపాలను గుర్తించాం. ల్యాన్‌లో మార్పుచేర్పులు, యాక్సస్ కంట్రోల్, త్రీ స్టెప్ వెరిఫికేషన్ ఇలా అనేక ఆవశ్యకతలను చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లాం. సైబర్ ఆడిట్ సిఫార్సుల ప్రకారం భద్రత పెంచాలని సూచించాం.
– ఓ ఉన్నతాధికారి
సిబ్బందే లీక్ చేస్తారని ఊహించలేదు
Published Tue, Apr 4 2023 4:33 AM | Last Updated on Tue, Apr 4 2023 4:34 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment