సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకం పనుల ఆలస్యంపై ఓ సర్పంచ్ కుమారుడిని ప్రశ్నించడంతోనే తిరుపతయ్య తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పరీక్ష పేపర్ల లీకేజీ స్కామ్‌లో భాగస్వామి అయ్యాడని తెలుస్తోంది. ఇతడితో పాటు ఇద్దరు అభ్యర్థులను అరెస్టు చేసిన సిట్ అధికారులు వీరిని తమ కస్టడీలోకి తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క లీకేజీ కేసులో జైలుకు వెళ్లిన టీఎస్‌పీఎస్సీ మాజీ ఉద్యోగులు షమీమ్, సురేశ్, రమేశ్‌లను పోలీసులు బుధవారం తమ కస్టడీలోకి తీసుకున్నారు.
టీఎస్‌పీఎస్సీ కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన ప్రవీణ్ కుమార్ నుంచి రేణుక, ఆమె భర్త డాక్యాలకు ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాలు అందిన విషయం తెలిసిందే. వీటిని విక్రయించడానికి ఈ భార్యాభర్తలు ఏర్పాటు చేసుకున్న దళారుల్లో తమ స్వగ్రామమైన మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం మన్సూర్‌పల్లి తండాకు చెందిన కేతావత్ రాజేశ్వర్ అలియాస్ రాజు ఒకరు. రాజేశ్వర్ తల్లి మన్సూర్‌పల్లి తండాకు సర్పంచ్‌గా పని చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆ తండాకు సంబంధించిన అభివృద్ధి పనులను రాజేశ్వర్ పర్యవేక్షించేవాడు. సల్కర్‌పేట గ్రామానికి చెందిన తిరుపతయ్య ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. ఇతడు ఎనిమిదేళ్లుగా గండీడ్ మండలంలో పని చేస్తున్నాడు. దీంతో తిరుపతయ్య, రాజేశ్వర్ మధ్య పరిచయాలు ఉన్నాయి. మన్సూర్‌పల్లి తండాలో జరిగే ఓ అభివృద్ధి పనిని తిరుపతయ్య పర్యవేక్షిస్తున్నాడు.
అది నిర్ణీత సమయానికి పూర్తికాకపోవడంతో ఆలస్యానికి కారణం ఏమిటంటూ రాజేశ్వర్‌ను ప్రశ్నించాడు. అప్పటికే ఏఈ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల వేటలో ఉన్న రాజేశ్వర్ అదే విషయం తిరుపతయ్యకు చెప్పి, ఆ బిజీలో ఉండటంతో అభివృద్ధి పనిని పర్యవేక్షించడం సాధ్యం కాలేదని, ఎవరైనా అభ్యర్థులు ఉంటే తీసుకురావాలని సూచించాడు.
ప్రశ్నపత్రం విక్రయించగా వచ్చిన సొమ్ములో కమీషన్ ఇస్తానని చెప్పాడు. దీనికి అంగీకరించిన తిరుపతయ్య.. ఉపాధి హామీ పథకంలో పరిచయమైన రాజేంద్రకుమార్, ప్రశాంత్‌ను సంప్రదించాడు. వీరిని రాజేశ్వర్ వద్దకు తీసుకువెళ్లి, డాక్యా ద్వారా కర్మన్‌ఘాట్‌లోని ఓ లాడ్జి వద్ద ప్రశ్నపత్రం ఇప్పించాడు. వీరి నుంచి అడ్వాన్సుగా రూ.8 లక్షలు తీసుకున్నట్లు తెలిసింది.
కస్టడీకోసం కోర్టులో సిట్ పిటిషన్
ఈ కేసులో వీరిని మరింత లోతుగా ప్రశ్నించడంతో పాటు నగదు రికవరీ కోసం తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిట్ పోలీసులు బుధవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు ప్రకారం గ్రూప్–1 ప్రిలిమ్స్ పేపర్ ప్రవీణ్, రాజశేఖర్‌ల ద్వారా ఈ ముగ్గురితో పాటు రాజశేఖర్ సమీప బంధువు ప్రశాంత్‌రెడ్డి వద్దకు మాత్రమే వెళ్లింది. రమేశ్, సురేశ్‌లకు ప్రవీణ్ ఇవ్వగా.. షమీమ్‌తో పాటు ప్రశాంత్‌రెడ్డిలకు రాజశేఖర్ ఇచ్చాడు.
అయితే ఆ పేపర్ ఈ ఐదుగురితో పాటు ఇంకా ఎవరికైనా చేరిందా? అనే కోణంలో సిట్ వీరిని ప్రశ్నించనుంది. సిట్ అధికారులు గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షల్లో 100కు పైగా మార్కులు సాధించిన 121 మందిని ప్రశ్నించడం కొనసాగిస్తున్నారు. బుధవారం నాటికి 84 మందిని ప్రశ్నించారు. కాగా, ఏఈ ప్రశ్నపత్రం మాదిరిగా గ్రూప్–1 పేపర్ వ్యవహరంలో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని ఓ అధికారి వ్యాఖ్యానించారు.
పని పూర్తి చేయమంటే 'పేపర్ అమ్మమన్నాడు'!
Published Thu, Mar 30 2023 1:45 AM | Last Updated on Thu, Mar 30 2023 1:45 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment