సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షల నిర్వహణపై తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటివరకు రద్దు చేసిన పరీక్షలు, వాయిదా వేసిన పరీక్షల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో ఇదివరకే నిర్వహించిన నాలుగు పరీక్షలు రద్దు కాగా... మరో రెండు పరీక్షలను చివరి నిమిషంలో వాయిదా వేసింది.
ఈ పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు ఎలాంటి విధానాలను అనుసరించాలనే అంశంపై ఇప్పటికే పలు రకాల సమీక్షలు నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకుంది. అతి త్వరలో ఈ పరీక్షల తేదీలను ప్రకటించేందుకు సన్నద్ధమవుతోంది. కాగా పరీక్షల నిర్వహణ విషయంలో సమూల మార్పులు చేయనున్నట్లు కమిషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
హాల్ టికెట్లు మొదలు..
టీఎస్‌పీఎస్సీ ఇప్పటివరకు ఏడు అర్హత పరీక్షలను నిర్వహించింది. ప్రశ్నపత్రాల లీకేజీతో గతేడాది అక్టోబర్‌లో నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసిన కమిషన్... వరుసగా ఏఈఈ, డీఏఓ, ఏఈ అర్హత పరీక్షలను కూడా రద్దు చేసింది. ఈ నెల 12న జరగాల్సిన టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్షను వాయిదా వేయగా... ఈనెల 15, 16 తేదీల్లో నిర్వహించాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను సైతం వాయిదా వేసింది. దీంతో ఆరు పరీక్షలను టీఎస్‌పీఎస్సీ తిరిగి నిర్వహించాల్సి వస్తోంది.
ఈ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల వద్ద హాల్‌టికెట్లు, పరీక్షా కేంద్రాల వివరాలు ఉన్నాయి. అయితే వీటన్నింటినీ సమూలంగా మార్చి కొత్తగా పరీక్షలు నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో పరీక్ష నిర్వహించే వారం రోజుల ముందు కొత్త నంబర్లతో అభ్యర్థులకు తిరిగి హాల్ టిక్కెట్లు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. అలాగే అభ్యర్థులకు కొత్తగా పరీక్షా కేంద్రాలు కేటాయించనున్నారు.
కొత్త ప్రశ్నపత్రాలను కూడా రూపొందించనున్నారు. కమిషన్ రహస్య కంప్యూటర్లలోని సమాచారం బయటకు లీక్ కావడంతో అన్ని రకాల ప్రశ్నపత్రాలు సమూలంగా మారనున్నాయి. ఈ మేరకు కొత్త ప్రశ్నలతో ప్రశ్నపత్రాల తయారీకి నిపుణులకు సూచనలు అందినట్లు సమాచారం.
కాగా ప్రశ్నపత్రాల్లో జంబ్లింగ్ విధానాన్ని అనుసరించే అంశాన్నీ అధికారులు పరిశీలిస్తున్నారు. గత పరీక్షల తాలూకు అనుభవాలను దృష్టిలో పెట్కుఉని... ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా అత్యంత గోప్యంగా ఈ ప్రక్రియ నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment