సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పరీక్షపత్రాల లీకేజీ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిట్ దర్యాప్తు తుది దశకు చేరుకుంటున్న సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగ ప్రవేశం చేసింది. కమిషన్ సహాయ కార్యదర్శి సత్యనారాయణ, కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కస్టోడియన్ శంకరలక్ష్మిలకు బుధ, గురువారాల్లో విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది.
వీరిద్దరి స్టేట్‌మెంట్‌లను రికార్డు చేసిన తర్వాత కమిషన్ కార్యదర్శిని, చైర్మన్‌ను కూడా విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బేగంబజార్ పోలీసు స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా విచారణ ప్రారంభించింది. పేపర్ లీకేజీతో చేతులు మారిన డబ్బు, కొనుగోలు చేసిన ఆస్తులను ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం(పీఎమ్‌ఎల్‌ఏ) కింద ఈడీ జప్తు చేయనుంది.
వారి విచారణకు అనుమతించండి..
చంచల్‌గూడ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న నిందితులు ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిలను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నాంపల్లిలోని 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ సుమిత్ గోయల్ పిటిషన్ దాఖలు చేశారు. ల్యాప్‌టాప్, ప్రింటర్, నిందితుల విచారణకు అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకువెళ్లేందుకు వీలుగా జైలు సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
ఈ పిటిషన్‌పై కోర్టు బుధవారం తీర్పు ఇవ్వనుంది. కాగా ప్రశ్నపత్రాల లీకేజీపై మీడియా కథనాలు, పబ్లిక్ డొమైన్‌లో ఉన్న సమాచారం, నిఘా విభాగాల ద్వారా వచ్చిన ప్రాథమిక సమాచారం ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసినట్లు ఈడీ వెల్లడించింది. ప్రశ్నపత్రాల అమ్మకాల్లో మనీలాండరింగ్ జరిగిందని అనుమానిస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో గత నెల 23న సీసీఎస్ ఏసీపీకి రాసిన లెటర్‌ను పిటిషన్‌కు అటాచ్ చేసింది.
రూ.40 లక్షలపై ఆరా
ఈ కేసులో సిట్ ఇప్పటివరకు రూ.40 లక్షలు సీజ్ చేసింది. వీటి వివరాలను ఈడీ సేకరించనుంది. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిల బ్యాంక్ లావాదేవీలు ఆధారంగా మనీలాండరింగ్‌పై సమాచారం సేకరించింది. న్యూజిలాండ్‌లోని రాజశేఖర్‌రెడ్డి బావకు ఎనీడెస్క్ యాప్ ద్వారా గ్రూప్–1 పేపర్ పంపించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రశాంత్‌రెడ్డి ద్వారా విదేశాల్లో ఉన్న ఎవరికైనా పేపర్ షేర్ అయ్యిందా అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. వారి నుంచి ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి ఖాతాలకు కానీ, ఇతరులకు కానీ మనీలాండరింగ్ జరిగిందా అనే వివరాలను రాబట్టనుంది. లీకేజీ సమయంలో నిందితుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము డిపాజిట్లకు సంబంధించి ఆయా బ్యాంకులకు లేఖలు రాయనుంది.
టీఎస్‌పీఎస్సీ లీకేజీ.. రంగంలోకి ఈడీ
Published Wed, Apr 12 2023 4:36 AM | Last Updated on Wed, Apr 12 2023 12:57 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment