సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీలో బీజేపీ నేతల హస్తం ఉంటే ఎందుకు అరెస్ట్ చేయడం లేదని మంత్రి కేటీఆర్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ‘‘అధికారంలో ఉన్నది మీరే కదా? మేం అడుగు తున్నాం. సమా ధానం చెప్పండి. పేపర్ లీకే జీలో ఐటీ శాఖ తప్పి దాలు ఉన్నాయి. అందుకే సంబంధిత మంత్రి అయిన కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని చెప్పారు.
నిజంగా తప్పు చేయ కపోతే సిట్టింగ్ జడ్జితో ఎందుకు విచారణ జరిపించడం లేదని నిలదీశారు. కవితపై వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో బండి సంజయ్ శనివారం మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. బయటికి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీక్ వ్యవహారంలో బీజేపీ హస్తముందంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. బండి సంజయ్ వ్యాఖ్య లు ఆయన మాటల్లోనే..
‘‘ఇతరులు తప్పు చేస్తే మెడపట్టి గెంటేసేవాళ్లు కదా. కేసీఆర్ కొడుకు తప్పు చేస్తే ఎందుకు బర్తరఫ్ చేయ డం లేదు? మున్సిపల్, ఐటీశాఖల తప్పిదాలకు జనం బలైపోతుంటే మంత్రిపై చర్యలేవి? తప్పు చేయనప్పుడు సిట్టింగ్ జడ్జితో విచారణ ఎందుకు చేయించడం లేదు? రాజశేఖర్ బీజేపీ వ్యక్తే అయితే 13ఏళ్లుగా టీఎస్‌పీఎస్సీ ఏం చేస్తున్నట్టు? ఎవరి నిర్వాకంతో పిల్లలు చనిపోయారు? పరీక్ష సక్రమంగా నిర్వహించే తెలివిలేనోడు కామన్ సెన్స్ గురించి మాట్లాడుతున్నడు.
ఎవరికి కామన్ సెన్స్ ఉందో, ఎవరికి లేదో ప్రజలకు తెలుసు. ఎవరి నిర్వాకం వల్ల ఇంటర్ పిల్లలు చనిపోయారు? ధరణి వల్ల లక్షల మంది రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? తన (కేటీఆర్) శాఖ పరిధిలోనే కుక్కలు కరిచి పిల్లలు చనిపోతుంటే కనీసం పట్టించుకోనోడు, నాలాల్లో పడి జనం చస్తే పట్టించుకోనోడు, సిటీలో అగ్ని ప్రమాదాల్లో జనం చనిపోతున్నా పట్టించుకోకుండా, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు.
ఈడీ, సీబీఐ రాజ్యాంగబద్ధ సంస్థలు కావా?
టీఎస్‌పీఎస్సీ రాజ్యాంగబద్ధ సంస్థ, ప్రభుత్వానికేం సంబంధమని కేటీఆర్ అంటున్నడు. మరి ఈడీ, సీబీఐ రాజ్యాంగబద్ధ సంస్థలు కావా? మీకు నచ్చితే, చెప్పినట్టు వినేవి మాత్రమే రాజ్యాంగబద్ధ సంస్థలా? లేకుంటే బీజేపీ సంస్థలు అవుతాయా? 30లక్షల మంది జీవితాలను నాశనం చేసిన మీరు.. కనీసం వాళ్లకు భరోసా కల్పించే ప్రయత్నం చేయకుండా గాలికొదిలేసి.. లిక్కర్ క్వీన్‌ను కాపాడుకునేందుకు ఢిల్లీకి పోయి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నరు..’’
తెలంగాణ సామెతనే ప్రస్తావించా..
‘‘కవితను ఉద్దేశించి తెలంగాణ సామెత ప్రస్తావించానే తప్ప నాకు మరే ఉద్దేశమేదీ లేదు. మహిళా కమిషన్ నాపై సీరియస్ అయిందంటూ మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం. లీకుల పేరుతో ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదు. మహిళా కమిషన్ లీక్ ఇచ్చినట్టు నేను భావించడం లేదు. కానీ ఈ ప్రచారంపై మహిళా కమిషన్ వివరణ ఇవ్వాలి. ప్రజల్లోకి మంచి సంకేతాలు వెళతాయనే ఉద్దేశంతోనే మహిళా కమిషన్ పిలవగానే హాజరై సమాధానమిచ్చా.
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
సీఎం ఆఫీసు నుంచే లీకేజీ తతంగం
– వ్యవహారంలో రిటైర్డ్ అధికారి పాత్ర: సంజయ్
సిద్దిపేట జోన్: సీఎంఓ కార్యాలయంలో రిటైర్డ్ అధికారికి టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీతో సంబంధం ఉందని, లీకేజీ తతంగం అంతా సీఎం ఆఫీసు నుంచే జరిగిందని బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. సదరు అధికారికి గతంలో సింగరేణి పేపర్ లీకేజీతో కూడా పాత్ర ఉందని పేర్కొన్నారు.
లీక్ వెనుక అసలు వ్యక్తుల వివరాలు బయటపెట్టాలని, దీనిపై తక్షణమే సమగ్ర విచారణ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. శనివారం రాత్రి సిద్దిపేటలో ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సంజయ్ మీడియాతో మాట్లాడారు. లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వం నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి, రూ.లక్ష పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంపై సీఎం కేసీఆర్ స్పందించాలన్నారు.
బీజేపీ నేతల హస్తముంటే.. అరెస్ట్ చేయడం లేదేం?
Published Sun, Mar 19 2023 1:33 AM | Last Updated on Sun, Mar 19 2023 3:23 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment