
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారంపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. టీఎస్పీఎస్సీ వ్యవహారంలో రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును అనవసరంగా లాగుతున్నారని వీరిద్దరికి తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులను పంపించారు. సుదీర్ఘ కాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు పదేపదే అబద్దాలను మాట్లాడుతున్నారన్నారు.
కేవలం ప్రజాప్రతినిధిగా ఉన్నంత మాత్రాన ఎదుటి వారిపై అసత్య ప్రేలాపనాలు చేసే హక్కు వీరికి లేదని కేటీఆర్ నోటీసులో పేర్కొన్నారు. ఇండియన్ పీనల్ కోడ్ లోని 499, 500 నిబంధనల ప్రకారం పరువు నష్టం దావా నోటీసులు పంపించారు. ఎలాంటి ఆధారాలు లేని సత్య దూరమైన ఆరోపణలను మానుకోవాలని, ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసులో డిమాండ్ చేశారు.
వారం రోజుల్లోగా తమ వ్యాఖ్యలను వెనకకు తీసుకొని క్షమాపణ చెప్పకుంటే రూ.100 కోట్ల పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ తన నోటీసులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు చేసిన నిరాధార ఆరోపణలను సాక్షాలతో సహా తన నోటీసులో కేటీఆర్ ప్రస్తావించారు.
చదవండి: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం.. ఘాటైన లేఖ
Comments
Please login to add a commentAdd a comment