డ్రగ్స్‌ వార్‌: రేవంత్‌పై మంత్రి కేటీఆర్‌ పరువు నష్టం దావా | KTR Files Defamation Suit Against TPCC Revanth Reddy | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ వార్‌: రేవంత్‌పై మంత్రి కేటీఆర్‌ పరువు నష్టం దావా

Published Tue, Sep 21 2021 2:04 AM | Last Updated on Tue, Sep 21 2021 8:02 AM

KTR Files Defamation Suit Against TPCC Revanth Reddy - Sakshi

డ్రగ్స్‌ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణకు హాజరవుతున్న వ్యక్తులతో లేదా ఆయా కేసులతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అయినా రేవంత్‌రెడ్డి దురుద్దేశంతో పదేపదే నా పేరును ప్రస్తావిస్తున్నారు. ఆయన దుష్ప్రచారం వల్ల నాకు సంభవించిన పరువు నష్టానికి తగిన పరిహారం చెల్లించేలా ఆదేశించాలి. క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ సైతం ప్రారంభించాలి.   – కోర్టులో వేసిన దావాలో కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విసిరిన వైట్‌ చాలెంజ్‌ రాష్ట్రంలో రాజకీయ రచ్చకు తెరలేపింది. టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ‘డ్రగ్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌’ అంటూ రేవంత్‌ చేస్తున్న ఆరోపణలతో మొదలైన వివాదం సవాళ్లు, ప్రతి సవాళ్లకు దారితీసింది.  నేతల మధ్య మాటల యుద్ధాన్ని మరింత తీవ్రం చేసింది. రాహుల్‌ గాంధీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ తదితరుల పేర్లు ‘వైట్‌ చాలెంజ్‌ బరి’లో ప్రస్తావనకు వచ్చేలా చేసింది. ఈ అంశంలో ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు చేస్తున్న ప్రకటనలు, పేలుతున్న మాటల తూటాలు ఆసక్తికరంగా మారాయి. ట్వీట్లతో మొదలైన వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. రేవంత్‌పై మంత్రి కేటీఆర్‌ పరువు నష్టం దావా దాఖలు చేయడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

అమరుల సాక్షిగా తేల్చుకుందాం: రేవంత్‌
రాష్ట్రంలో ఇప్పటివరకు గ్రీన్‌ చాలెంజ్‌ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం గురించే చాలా మందికి తెలుసు.. తాజాగా వైట్‌ చాలెంజ్‌ చర్చనీయాంశమయ్యింది. టాలీవుడ్‌తో ముడిపడిన డ్రగ్స్‌ కేసు విచారణ ప్రస్తుతం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా రేవంత్‌ ఆరోపణల నేపథ్యంలో.. శరీరంలో డ్రగ్స్‌ ఆనవాళ్లు గుర్తించేందుకు చేసే రక్తం, వెంట్రుకల పరీక్షలకు తాను సిద్ధమని కేటీఆర్‌ రెండురోజుల క్రితం ప్రకటించారు. దీంతో డ్రగ్స్‌కు సంబంధించి ఎలాంటి మచ్చా లేదని నిరూపించుకోవాలంటూ.. కేటీఆర్‌తో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి రేవంత్‌ వైట్‌ చాలెంజ్‌ విసిరారు. దేశంలో డ్రగ్‌ మహమ్మారిపై అవగాహన కల్పించేందుకు ఈ చాలెంజ్‌ విసురుతున్నానని అన్నారు. కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి తన చాలెంజ్‌ను స్వీకరించారని తెలిపారు. సోమవారం అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరుల స్థూపం వద్ద కేటీఆర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కోసం ఎదురుచూస్తానని ప్రకటించారు. దీనిపై కేటీఆర్‌ సామాజిక మాధ్యమ వేదిక ‘ట్విట్టర్‌’లో తీవ్రంగా స్పందించారు.
 
నా ప్రతిష్ట దిగజార్చుకోలేను: కేటీఆర్‌
‘ఢిల్లీ ఎయిమ్స్‌లో ఏ తరహా పరీక్షకైనా నేను సిద్ధం. రాహుల్‌ గాంధీ కూడా ఇష్టమైతే నాతో పాటు పరీక్షలు చేయించుకోవచ్చు. చర్లపల్లి జైలు మాజీ ఖైదీతో కలిసి పరీక్షలు చేసుకోవడం ద్వారా నా ప్రతిష్టను దిగజార్చుకో దలుచుకోలేదు. నేను పరీక్షలు చేసుకుని ఎలాంటి మచ్చ లేకుండా బయటకు వస్తే క్షమాపణ చెప్పి, నీ పదవికి రాజీనామా చేస్తావా? ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షలకు సిద్ధంగా ఉన్నావా..?’ అని రేవంత్‌ను కేటీఆర్‌ ప్రశ్నించారు. దీనికి స్పందించిన రేవంత్‌ లై డిటెక్టర్‌ టెస్టుకు తాను సిద్ధమని, అయితే సహారా, ఈఎస్‌ఐ కుంభకోణాల్లో కూడా లై డిటెక్టర్‌ టెస్టులకు వస్తారా? అని ప్రతి సవాల్‌ చేశారు. 

దురుద్దేశంతో దుష్ప్రచారం
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దురుద్దేశంతో గత కొంతకాలంగా తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం సిటీ సివిల్‌ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. డ్రగ్స్‌ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నిర్వహిస్తున్న విచారణకు హాజరవుతున్న వ్యక్తులతో కానీ, ఆయా కేసులతో కానీ తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అయినా రేవంత్‌రెడ్డి దురుద్దేశంతో పదే పదే తన పేరును ప్రస్తావిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన దుష్ప్రచారం వల్ల తనకు సంభవించిన పరువు నష్టానికి తగిన పరిహారం చెల్లించడంతో పాటు క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ను సైతం ప్రారంభించాలని కేటీఆర్‌ కోరారు.  కాగా ట్విట్టర్‌లో ‘రాహుల్‌ డ్రగ్‌ టెస్ట్‌’ హ్యాష్‌ట్యాగ్‌ను వేలాది మంది రీ ట్వీట్‌ చేయడంతో పొలిటికల్‌ న్యూస్‌లో ట్రెండింగ్‌గా నిలిచింది. రాహుల్‌ గాంధీ కూడా ఎయిమ్స్‌లో డ్రగ్‌ టెస్ట్‌కు ముందుకు రావాలని పలువురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు, ఇతర నేతలు, నెటిజన్లు ట్వీట్‌ చేశారు.

కేటీఆర్‌ ఆవేశానికి గురై బెదిరిస్తున్నారు..
డ్రగ్స్‌ విషయంలో రక్త పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధమని మంత్రి కేటీఆర్‌ చెప్పిన తర్వాతే తాను ఆయన్ను సవాల్‌ చేశానని రేవంత్‌ పేర్కొన్నారు. తన సవాల్‌కు జవాబు చెప్పాల్సింది పోయి ఆవేశానికి గురై బెదిరించే విధంగా మాట్లాడుతున్నారన్నారు. కోర్టుకు ఎందుకు వెళుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. కేటీఆర్‌కు వైట్‌ చాలెంజ్‌ విసిరిన రేవంత్‌ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు తన అనుచరులతో కలిసి గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపం వద్దకు వచ్చారు. అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున గుమిగూడిన కాంగ్రెస్‌ కార్యకర్తలతో కలిసి కొంతసేపు బైఠాయించారు. అనంతరం మాట్లాడుతూ..కేటీఆర్‌తో పాటు కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి కూడా చాలెంజ్‌ విసిరానని, ఆయన వచ్చినా కేటీఆర్‌ రాలేదని ఎద్దేవా చేశారు. తాను చేసిన చాలెంజ్‌కు కౌంటర్‌ పేరుతో తన స్థాయి గురించి కేటీఆర్‌ మాట్లాడడం సబబుగా లేదన్నారు. ఆయన ఎమ్మెల్యే కాకముందే తాను ఎమ్మెల్సీనని చెప్పారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఉన్నానని, జాతీయ పార్టీ కాంగ్రెస్‌కు తెలంగాణ అధ్యక్షుడిగా పనిచేస్తున్నానని చెప్పారు. స్థాయి గురించి మాట్లాడకుండా కేటీఆర్‌ ఎప్పుడు వచ్చినా ఇదే అమరవీరుల స్థూపం వద్ద చర్చకు తాను సిద్ధమని, గంట ముందు తనకు సమాచారం ఇస్తే చాలునని రేవంత్‌ చెప్పారు. ఈ రోజు రాహుల్‌ రావాలని అంటున్న కేటీఆర్‌ రేపు ఇవాంకా ట్రంప్‌ రావాలని అడుగుతారని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌ దత్తత తీసుకున్న సింగరేణి కాలనీలో డ్రగ్స్‌ కారణంగానే అనుచిత ఘటన జరిగిందని చెప్పారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక మంత్రుల కుటుంబ సభ్యులు, వారి బంధువులు పబ్‌లు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.   

ఎన్నికల్లో పోటీ చేసేవారంతా టెస్ట్‌ చేయించుకోవాలి:  కొండా
రేవంత్‌ విసిరిన వైట్‌ చాలెంజ్‌ను స్వీకరించి గన్‌పార్క్‌ వద్దకు వచ్చిన విశ్వేశ్వర్‌రెడ్డి.. ఈ చాలెంజ్‌ సమాజానికి మంచిదని వ్యాఖ్యానించారు. రేవంత్‌ సవాల్‌ను స్వీకరించి ఇక్కడకు వచ్చి ఉంటే కేటీఆర్‌ స్థాయి మరింత పెరిగేదని అన్నారు. రాజకీయ నాయకులు ఈ చాలెంజ్‌ను స్వీకరించాలని కోరారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారంతా డ్రగ్స్‌ టెస్టు చేయించుకోవాలని, ఆ తర్వాతే వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్‌ కల్పించాలని కోరారు. రేవంత్‌ విసిరిన వైట్‌ చాలెంజ్‌కు ఓ సామాజిక కార్యకర్తగా, తండ్రిగా ప్రతిస్పందిస్తున్నానంటూ.. తన వంతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీఎస్పీ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌లకు వైట్‌ చాలెంజ్‌ విసిరారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

బాగా బలిసినోడు డ్రగ్స్‌ తీసుకుంటాడు: బండి సంజయ్‌
విశ్వేశ్వర్‌రెడ్డి విసిరిన వైట్‌ చాలెంజ్‌ను స్వీకరిస్తున్నట్లు బండి సంజయ్‌ ప్రకటించారు. ‘కాంగ్రెస్‌లో రాజీ రాజకీయాలు నచ్చకే విశ్వేశ్వర్‌రెడ్డి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. నాకు ఎలాంటి దురలవాట్లు లేవు. ఆయన విసిరిన చాలెంజ్‌ను స్వీకరిస్తున్నా. అక్టోబర్‌ 2న నా తొలి విడత పాదయాత్ర పూర్తయిన వెంటనే వారు కోరిన చోటుకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటా. బాగా బలిసినోడు, బలుపెక్కినోడే డ్రగ్స్‌ తీసుకుంటాడు. పేదోడికి అవి అవసరం లేదు’ అంటూ ప్రతి స్పందించారు.

చంద్రబాబు, లోకేశ్‌కు కూడా విసరండి
వైట్‌ చాలెంజ్‌ పేరిట రేవంత్‌రెడ్డి తెలంగాణ అమరుల స్థూపాన్ని అపవిత్రం చేశారని టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్‌ బాబా ఫసీయుద్దిన్‌ నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ మహిళా కార్యకర్తలు అమరుల స్థూపాన్ని పాలతో శుద్ధి చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తొత్తులా రేవంత్‌ వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌కు రేవంత్‌రెడ్డి వైట్‌ చాలెంజ్‌ విసరాలని డిమాండ్‌ చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement