TSPSC Paper Leak: Bandi Sanjay Responds On KTR Defamation Legal Notices, Details Inside - Sakshi
Sakshi News home page

క్షమాపణ చెప్పే ప్రసక్తే లే

Published Wed, Mar 29 2023 4:29 PM | Last Updated on Thu, Mar 30 2023 4:42 AM

TSPSC Paper Leak: Bandi Sanjay Responds KTR Legal Notice Rs Defamatio - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్‌కు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని, ఆయన ఇచ్చానని చెబుతున్న నోటీసును లీగల్‌గానే ఎదుర్కొంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టంచేశారు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించినందుకు క్షమాపణ చెప్పకపోతే రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్‌ లీగల్‌ నోటీస్‌ ఇచ్చినట్లు తాను కూడా పత్రికల్లోనే చూశానని అన్నారు.

ఇలాంటి ఉడుత బెదిరింపులకు బెదిరిపోయేది లేదని లీగల్‌ నోటీసుపై న్యాయపరంగానే పోరాడతామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ స్కాం మొదలు పేపర్‌ లీకేజ్‌ దాకా ఐటి శాఖ మంత్రే బాధ్యత వహించాలి. నాలాలో పడి పిల్లలు చనిపోయిన దగ్గర నుండి కుక్కల దాడిలో పసిపిల్లల చావు వరకు మున్సిపాలిటీ శాఖ మంత్రే బాధ్యత వహించి రాజీనామా చేయాలి’అని డిమాండ్‌ చేశారు. 

నీ పరువు సరే.. వారి భవిష్యత్‌కు మూల్యమేంటి 
కేటీఆర్‌ పరువు విలువ రూ.100 కోట్లయితే తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న 30 లక్షల మంది యువత భవిష్యత్‌ వారి పాలనలో ప్రశ్నార్థమైందని సంజయ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మరి వారికెంత మూల్యం చెల్లిస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పరువు నష్టం పేరుతో కూడా డబ్బులు సంపాదించాలనుకోవడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. ‘సిట్‌ విచారణ అంశాలు అసలు కేటీఆర్‌కి ఎలా లీక్‌ అవుతున్నాయి.

మొదట ఇద్దరు మాత్రమే నిందితులన్న కేటీఆర్‌ పదుల సంఖ్యలో అరెస్టులు జరుగుతుంటే ఎందుకు నోరు విప్పడం లేదు? ఇద్దరు మాత్రమే దోషులంటూ కేసును నీరుగార్చేందుకు యత్నించిన కేటీఆర్‌పై ఎందుకు క్రిమినల్‌ కేసులు పెట్టలేదో పోలీసులు సమాధానం చెప్పాలి. ప్రశ్నాపత్రాలు పత్రాల లీకేజీ విచారణను ప్రభావితం చేసే విధంగా మాట్లాడుతున్న ఆయనకు సిట్‌ ఎందుకు నోటీసులు ఇవ్వలేదో జవాబివ్వకుండా తప్పిదాలను ప్రశ్నిస్తున్న మాపై చర్యలు తీసుకుంటామంటూ బెదిరిస్తారా? సిట్‌ బెదిరింపులకు బెదిరేది లేదు’అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 


చదవండి: రాజకీయ నేతలు, సినీ సెలబ్రిటీల ఫోటోలు మార్ఫింగ్‌.. 8 మంది అరెస్ట్‌

కేటీఆర్‌కు వందల కోట్లు ఎలా వచ్చాయ్‌? 
 తెలంగాణ ఉద్యమానికి ముందు అమెరికాలో ఉద్యోగ స్థాయి నుంచి నేడు వందల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి’అని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ‘పేపర్‌ లీకేజీతో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు,. కేటీఆర్‌ మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ప్రశ్నాపత్రాల లీకేజీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించే దాకా, నష్టపోయిన నిరుద్యోగులకు రూ. లక్ష చొప్పన పరిహారం అందించే వరకు బీజేపీ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం’అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు..‘ప్రధాని స్థాయిని, వయసును కూడా చూడకుండా విమర్శించడం కేసీఆర్‌ కొడుకు కుసంస్కారానికి నిదర్శనం.

ప్రశ్నాపత్రాలు లీకేజీ అంశాన్ని ఒక సాధారణ అంశంగా మలిచేందుకు మంత్రులంతా ప్రయత్నం చేస్తున్నారు’అని మండిపడ్డారు. ‘కేటీఆర్‌ ఓ ఒక స్వయం ప్రకటిత మేధావి. నాలుగు ఇంగ్లీష్‌ ముక్కలు మాట్లాడగానే అపరజ్ఞానిలా భావిస్తున్నాడు. ప్రశ్నిస్తే తట్టుకోలేని మూర్ఖుడు. పాలనలోని తప్పులను ఎత్తిచూపితే సహించలేని అజ్ఞాని’అని సంజయ్‌ ధ్వజమెత్తారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement