సాక్షి, హైదరాబాద్: లీగల్ నోటీసుతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారెవరూ లేరు అంటూ కేటీఆర్‌కు కౌంటరిచ్చారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఏం జరిగిందో, ఆ కేసులను ఏ విధంగా నీరుగార్చారో తెలుసు అంటూ కామెంట్స్ చేశారు.
మాజీ మంత్రి కేటీఆర్ తనకు పంపిన లీగల్ నోటీసులపై బండి సంజయ్ స్పందించారు. ఈ క్రమంలో బండి సంజయ్..‘కేటీఆర్ నాకు లీగల్ నోటీసు పంపినట్లు మీడియాలో చూశాను. లీగల్ నోటీసుతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారెవరూ లేరు. నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక లీగల్ నోటీస్ ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోంది. తాటాకు చప్పళ్లకు భయపడేది లేదు. నాపై తొలుత వ్యక్తిగత ఆరోపణలు చేసి అవమానించింది కేటీఆరే. అందుకు బదులుగానే నేను మాట్లాడాను. ఆయన మంచి వాడు అనుకుంటన్నాడు. ఆయన భాగోతం ప్రజలకు తెలుసు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఏం జరిగిందో, ఆ కేసులను ఏ విధంగా నీరుగార్చారో తెలుసు. ఇప్పటి వరకు మాటకు మాటతోనే బదులిచ్చాను. లీగల్ నోటీసులకు నోటీసులతోనే బదులిస్తా. మేం చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే వ్యక్తులం. చట్టం, న్యాయం ప్రకారం కూడా ముందుకు వెళ్తాం’ అంటూ కామెంట్స్ చేశారు.
అలాగే, కేటీఆర్ నోటీసులపై తెలంగాణ బీజేపీ నేతలు కూడా స్పందించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు ఇవ్వడాన్ని ఖండిస్తున్నాను. లీగల్ నోటీసులతో కేటీఆర్ రాజకీయ జీవితానికి చరమ గీతం పడటం ఖాయం. దద్దమ్మ, సన్యాసి అంటూ కేసీఆర్, కేటీఆర్ కొన్ని వందల సార్లు మాట్లాడారు. బీఆర్‌ఎస్ నేతలు పారిపోయే రోజులు వచ్చాయి. లీగల్ నోటీసులతో ఆట మీరు మొదలుపెట్టారు. రోజు లీగల్ నోటీసులు అందుకోవడానికి కేటీఆర్ సిద్ధంగా ఉండాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో బీజేపీ ఎస్సీ మోర్చ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్.కుమార్ మాట్లాడుతూ..‘లీగల్ నోటీసులకు బండి సంజయ్ భయపడరు. బండి సంజయ్‌ను ఎన్నో సార్లు కేసీఆర్, కేటీఆర్ అవమానించారు. భాషను మార్చుకోవాలని బీఆర్‌ఎస్ నేతలకు సూచించారు. కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం’ అంటూ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment