TSPSC Paper Leak Case: Accused Shared Paper With Friend - Sakshi
Sakshi News home page

TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్సీ లీకేజ్‌ కేసులో తెరపైకి కొత్త పేరు.. స్నేహితుడికీ షేర్ చేశాడు!

Published Wed, Mar 22 2023 7:54 AM | Last Updated on Wed, Mar 22 2023 11:30 AM

TSPSC Paper Leak Case 2023 Accused Shared Paper With Friend - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజ్‌ వ్యవహారంలో మరో పేరు వెలుగులోకి వచ్చింది. కమిషన్‌ మాజీ ఉద్యోగి, తన స్నేహితుడైన సురేశ్‌కూ ప్రవీణ్‌కుమార్‌ గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రం పంపినట్లు తేలింది. దీంతో మంగళవారం సురేశ్‌ను అదుపులోకి తీసుకున్న సిట్‌ అధికారులు  ప్రశి్నస్తున్నారు. తమ అదుపులో ఉన్న తొమ్మిది మంది నిందితులను కూడా వరసగా నాలుగో రోజూ ప్రశ్నించారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేశారు. 

10 మంది కమిషన్‌ ఉద్యోగులు క్వాలిఫై..
గ్రూప్‌–1 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న ప్రవీణ్‌కుమార్‌ గతేడాది జూన్‌ నుంచి ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాల కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. కమిషన్‌లోనే నెట్‌వర్క్‌ అడ్మిన్‌గా పని చేస్తున్న రాజశేఖర్‌ సాయంతో కస్టోడియన్‌ కంప్యూటర్‌లో ఉన్న ఈ ప్రశ్నపత్రాన్ని గతేడాది అక్టోబర్‌ తొలి వారంలో చేజిక్కించుకున్నాడు. దీన్ని వినియోగించి తాను పరీక్షకు సిద్ధం కావడంతో పాటు తన స్నేహితుడైన సురేశ్‌కు వాట్సాప్‌ ద్వారా పంపాడు.

అతడు కూడా మంచి మార్కులతో ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయ్యాడు. దీంతో సురేశ్‌ను సిట్‌ అధికారులు అదుపులోకి తీసు కుని ప్రశి్నస్తున్నారు. గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌లో కమిషన్‌లో పని చేస్తున్న 10 మంది ఉద్యోగులు క్వాలిఫై అయినట్లు సిట్‌ గుర్తించింది. ముగ్గురు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, ఏడుగురు రెగ్యులర్‌ ఉద్యోగులకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది.

గ్రూప్‌–1 అనుభవంతో మిగతా పేపర్ల కోసం.. 
గ్రూప్‌–1 పరీక్ష పేపర్లు చేజిక్కించుకున్న అనుభవంతో ప్రవీణ్, రాజశేఖర్‌లు మిగిలిన పరీక్షల సమయంలోనూ తమ ప్రయత్నాలు కొసాగించారు. గత నెల ఆఖరి వారంలో మరో నాలుగు పరీక్షలకు సంబంధించిన పది క్వశ్చన్‌ పేపర్లు వీరికి చిక్కాయి. అయితే వాటిని ఎలా విక్రయించాలో అర్థం కాని ప్రవీణ్‌ తనతో సన్నిహితంగా ఉండే రేణుకను సంప్రదించాడు. తన సమీప బంధువైన కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ ద్వారా ఏఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న నీలేశ్‌ నాయక్, గోపాల్‌ నాయక్‌లను రేణుక సంప్రదించింది.

ప్రవీణ్‌ నుంచి పేపర్‌ అందగానే భర్త డాక్యాతో కలిసి స్వగ్రామమైన మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలం పగిడ్యాల్‌ తండాకు వెళ్లి, రెండురోజుల పాటు తన ఇంట్లోనే నీలేశ్‌, గోపాల్‌తో చదివించింది. ఈ నేపథ్యంలోనే సిట్‌ అధికారులు మంగళవారం రేణుక, డాక్యా నాయక్, నీలేశ్, గోపాల్‌లను ఆ తండాకు తీసుకువెళ్లి సీన్‌ రీ–కన్‌స్ట్రక్షన్‌ చేశారు.  

రాజశేఖర్‌ కాంటాక్టుల పైనా ఆరా.. 
లీకైన ప్రశ్నపత్రాలను ప్రవీణ్‌తో పాటు రాజశేఖర్‌ సైతం తన పెన్‌డ్రైవ్‌లోని కాపీ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతను ఎవరికైనా అమ్మడం, షేర్‌ చేయడం జరిగిందా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. రాజశేఖర్‌ ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్స్, వాట్సాప్‌ గ్రూప్స్‌లో ఉన్న వారితో జరిగిన సంప్రదింపుల వివరాలు ఆరా తీస్తున్నారు. వీరిలో ఎవరైనా గ్రూప్‌–1 సహా ఇతర పరీక్షలు రాశారా? ఉత్తీర్ణులయ్యారా? తదితర వివరాలు సేకరిస్తున్నారు.

ఏఈ ప్రశ్నపత్రాలు ఇచ్చిన రేణుకకు నీలేష్, గోపాల్‌ రూ.14 లక్షల వరకు చెల్లించారు. ఇందులో రూ.లక్ష వీరికి కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ సర్దుబాటు చేసినట్లు సిట్‌ గుర్తించింది. నగదు ఇచి్చనందుకు అతడు సైతం ప్రశ్నపత్రాన్ని వీరి నుంచి పొందాడా? ఎవరికైనా పంపాడా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తోంది.  

ప్రవీణ్‌ ఇంట్లో సోదాలు 
ప్రవీణ్‌కుమార్‌ నివాసం ఉంటున్న రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట కార్పొరేషన్‌ 19వ డివిజన్‌లోని మల్లికార్జుననగర్‌ కాలనీలో మంగళవారం సిట్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. పేపర్‌ లీక్‌కు సంబంధించిన ఆధారాల కోసం క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు, కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని విశ్వసనీయ సమాచారం. కాగా కొన్ని వస్తువులను కూడా సిట్‌ బృందం తమ వెంట తీసుకెళ్లినట్లు తెలిసింది.
చదవండి: కొలువుల కలవరం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement