సాక్షి, హైదరాబాద్: ‘‘టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీకి కేటీఆర్ నిర్వాకమే కారణం. ఏ శాఖలో తప్పులు జరిగినా కేటీఆరే స్పందిస్తున్నారు. ఆయన షాడో సీఎం. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకైతే మాత్రం తనకేం సంబంధం లేదంటున్నారు. తప్పు చేయకపోయినా మంత్రులను బయటికి పంపిన సీఎం కేసీఆర్.. తన కొడుకు తప్పుచేస్తే ఎందుకు బర్తరఫ్ చేయడం లేదు. కేటీఆర్ రాజీనామా చేయాలి.
పేపర్ లీకేజీపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి, నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇచ్చేదాకా పోరాడుతాం..’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో ‘మా నౌకరీలు మాగ్గావాలే’నినాదంతో బీజేపీ నిరుద్యోగ మహాధర్నా నిర్వహించింది. బండి సంజయ్ ధర్నాలో పాల్గొని మాట్లాడారు.
సీఎం కేసీఆర్ దొంగ సారా దందాలో దొరికిన బిడ్డను, లీకు వీరుడు కొడుకును కాపాడుకునేందుకు ప్రయత్నిస్తూ.. నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పరీక్షల్లో స్కాం, లిక్కర్‌లో, ధరణిలో, ఇరిగేషన్ టెండర్లలో స్కాంలు.. కేసీఆర్ పాలన అంతా స్కాములమయమని ఆరోపించారు.
తప్పు చేయకపోతే భయమెందుకు?
లీకేజీపై ప్రశ్నించిన తమకు నోటీసులు ఇస్తున్నారని... మరి కేటీఆర్‌కు ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదని సంజయ్ ప్రశ్నించారు. మొదట ఇద్దరికే లీకేజీతో సంబంధం ఉందని కేటీఆర్ చెప్పారని.. కానీ ఈ కేసులో ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. కేటీఆర్ ఏ హోదాతో అలా చెప్పారు? ఆయనకు సిట్ నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు.
లీకేజీకి సంబంధించి కేటీఆర్ పాత్ర ఉందని.. ఆయనకూ నోటీసులు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ‘‘టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యులను ఎందుకు తొలగించడం లేదు? తొలగిస్తే బయటకొచ్చి వాస్తవాలు బయటపెడతారనే భయంతోనే వారిపై చర్యల్లేవు.
30లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తును నాశనం చేసిన లీకేజీపై కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదు? తప్పు చేయకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడానికి భయమెందుకు? దీనిపై తెలంగాణ ఉద్యమకారులు స్పందించాలి. మీకు అండగా మేమున్నాం. నిరుద్యోగుల తరఫున రొడ్డెక్కి కొట్లాడుదాం..’’అని పిలుపునిచ్చారు.
ఆందోళనలు ఉధృతం చేస్తాం..
బీజేపీ నిరుద్యోగుల పక్షాన ఆందోళనలను ఉధృతం చేస్తుందని బండి సంజయ్ తెలిపారు. ఏప్రిల్ 2 నుండి 6 వరకు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని.. తర్వాత హైదరాబాద్‌లో భారీ ఎత్తున నిరుద్యోగ మిలియన్ మార్చ్ చేపడతామని చెప్పారు. అవసరమైతే సర్కార్‌కు సెగ తగిలేందుకు రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామని ప్రకటించారు.
కేసీఆర్ పాలనలో ఉద్యోగాలు వస్తాయనే ఆశలు పోయాయని.. బీజేపీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సంజయ్ ప్రకటించారు. నిరుద్యోగుల పక్షాన కొట్లాడిన బీజేవైఎం నాయకులను జైల్లో వేశారని.. అక్కడ ఇష్టానుసారం వేధిస్తున్నారని ఆరోపించారు.
బీఆర్‌ఎస్‌కు రోజులు దగ్గరపడ్డాయ్: బీజేపీ నేతలు
బిడ్డ లిక్కర్ దందాపై కేసీఆర్ నోరెందుకు విప్పడం లేదని.. తెలంగాణ ప్రభుత్వాన్ని మొత్తం ఢిల్లీకి ఎందుకు తీసుకుపోయారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. ‘‘కేసీఆర్ ప్రభుత్వానికి, బీఆర్‌ఎస్‌కు రోజులు దగ్గర పడ్డాయ్.. ఎప్పుడు ఎన్నికలొచ్చినా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
టీఎస్‌పీఎస్సీ లీకేజీకి సంబంధించి కేటీఆర్ రాజీనామా చేయాల్సిందే..’’అని బీజేపీ సీనియర్ నేతలు ఈటల రాజేందర్, ఎం.రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, విజయశాంతి, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి సుధాకరరెడ్డి మండిపడ్డారు.
బీజేపీ దీక్షలో నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్‌తోపాటు పలు ప్రజా, విద్యార్ధి, యువజన సంఘాల నాయకులు, అన్ని యూనివర్సిటీల విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కేటీఆర్ రాజీనామా చేయాల్సిందే! పేపర్ల లీకేజీ నిర్వాకం ఆయనదే..
Published Sun, Mar 26 2023 2:42 AM | Last Updated on Sun, Mar 26 2023 3:10 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment