సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్‌కు సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. తనపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం వారికి తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. వారిద్దరూ తనపై చేసిన వ్యాఖ్యలను వారం రోజుల్లోపు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పకుంటే రూ.100 కోట్ల పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు.
వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు
‘ఈ నెల 17 నుంచి 25 వరకు వివిధ టీవీ చానెళ్లతో పాటు డిజిటల్, సోషల్ మీడియాలో తన పరువుకు భంగం కలిగించేలా ఇద్దరు నేతలు ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడారు. 2009 నుంచి 2018 వరకు సిరిసిల్ల నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది, మంత్రిగా పనిచేస్తున్న, విద్యావంతుడినైన నా ప్రతిష్టకు.. బండి సంజయ్, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు భంగం కలిగించాయి. నా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయి..’ అని కేటీఆర్ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
దురుద్దేశంతోనే పదేపదే అబద్ధాలు
‘సుదీర్ఘ కాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న నా పరువుకు భంగం కలిగించాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్, రేవంత్ రెడ్డి పదేపదే అబద్ధాలు మాట్లాడుతున్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్నంత మాత్రాన ఎదుటివారిపై అసత్య ప్రేలాపనలు చేసే హక్కు వీరికి లేదు. ఈ నేపథ్యంలోనే ఇండియన్ పీనల్ కోడ్‌లోని 499, 500 సెక్షన్ల ప్రకారం పరువు నష్టం దావా నోటీసులు పంపుతున్నా.
ఇప్పటికైనా ఎలాంటి ఆధారాలు లేని సత్య దూరమైన ఆరోపణలు మానుకోవాలి. ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో దావాను ఎదుర్కోవాల్సి ఉంటుంది..’ అని మంత్రి స్పష్టం చేశారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు చేసిన ఆరోపణల వివరాలను నోటీసుల్లో కేటీఆర్ పొందుపరిచారు.
ఇవే సెక్షన్ల కింద రాహుల్‌కు జైలు శిక్ష
గుజరాత్‌లోని సూరత్ కోర్టులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఐపీసీ సెక్షన్లు 499, 500 కిందే కేసు నమోదైంది. ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఈ కేసులోనే రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.15 వేలు జరిమానా కూడా న్యాయమూర్తి విధించారు. ఈ తీర్పు నేపథ్యంలోనే రాహుల్‌గాంధీని లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడిగా సెక్రటేరియట్ ప్రకటించింది.
ప్రస్తుతం కేటీఆర్ కూడా ఇవే సెక్షన్ల కింద లోక్‌సభ సభ్యులుగా ఉన్న రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లకు లీగల్ నోటీసులు పంపించడం ఆసక్తికరంగా మారింది. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌ల స్థానిక చిరునామాలకు, అలాగే ఢిల్లీ చిరునామాలకు కూడా కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు.
ముందే హెచ్చరించి నోటీసులు
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనను బూచిగా చూపి ఉద్యోగ నియామకాల ప్రక్రియను ఆపేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుట్ర పన్నాయని కేటీఆర్ పలు సందర్భాల్లో విమర్శించారు. తన వ్యక్తిగత సహాయకుడిపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను కూడా రెండు రోజుల క్రితం ఖండించారు. ఉద్యోగాల భర్తీని అడ్డుకునే కుట్రలను సహించేది లేదని పదే పదే చెప్పిన కేటీఆర్.. ఇద్దరు విపక్ష నేతలకు లీగల్ నోటీసులు ఇస్తానని ఈ నెల 23నే చెప్పారు. చెప్పినట్టుగానే మంగళవారం నోటీసులు పంపించారు.
రూ.100 కోట్ల దావా
Published Wed, Mar 29 2023 12:42 AM | Last Updated on Wed, Mar 29 2023 12:42 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment