సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో నూతనంగా నిర్మించిన స్కూల్ భవనాన్ని విద్యార్థులతో కలసి ప్రారంభిస్తున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో వినోద్‌కుమార్ తదితరులు
సిరిసిల్ల: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తొమ్మిదేళ్ల పాలనలో అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని మంత్రి కేటీ రామారావు చెప్పారు. కరోనాతో రూ.లక్ష కోట్ల నష్టం వచ్చినా కల్యాణలక్ష్మి ఆగలేదని, ఆసరా పెన్షన్లు, రైతుబంధు, ఉచిత కరెంట్ ఇచ్చామని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని, దేశంలో ఆసరా పెన్షన్లు అధికంగా ఇచ్చే ప్రభుత్వం మనదేనని అన్నారు.
ఇలాంటి మనసున్న కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరింట్యాలలో అదనపు తరగతి గదులు, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జెడ్పీ హైస్కూల్ కాంప్లెక్స్, సిరిసిల్లలో వాలీబాల్ అకాడమీని మంత్రి ప్రారంభించారు. దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
మనసున్న ముఖ్యమంత్రి కాబట్టే..
‘మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి కేసీఆర్ దివ్యాంగుల సంక్షేమానికి బాటలు వేస్తున్నారు. దివ్యాంగులకు పక్కనే ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో రూ.200, కర్ణాటక లో రూ.1,100, మహారాష్ట్రలో రూ.300, ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో రూ.600 పెన్షన్ ఇస్తుంటే..మన రాష్ట్రంలో మాత్రం రూ.3,0 16 చొప్పున చెల్లిస్తున్నాం. వచ్చే నెలనుంచి రూ.4,0 16 ఇస్తాం. గుజరాత్‌లో 47 వేల మంది దివ్యాంగులకు పెన్షన్ ఇస్తున్నారు.
అదే మన రాష్ట్రంలో 5.15 లక్షల మందికి ఇస్తున్నాం. వారి సంక్షేమానికి రూ.1,800 కోట్లు వెచ్చించాం. ఉద్యోగాల్లో 4%, డబుల్ బెడ్రూం ఇళ్లలో 5% రిజర్వేషన్లు కల్పించాం. ఇలా ఆసరా కల్పించడం తప్పని, ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుందని ప్రధాని మోదీ చెబుతున్నారు. బడా వ్యాపారులకు రూ.12 లక్షల కోట్లు మాఫీ చేయడం మాత్రం మంచిదట. ఎవరేం అన్నా..ఇంకా సదరం సర్టిఫికెట్ రాని వారికి, అర్హత ఉండి పెన్షన్ రాని వాళ్లను గుర్తించి వారికి కూడా పింఛన్లు ఇస్తాం..’ అని కేటీఆర్ తెలిపారు.
బండి సంజయ్ అరపైసా సాయం చేయలే..
‘ఎంపీ బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నా అరపైసా సాయం చేయలేదు. ఒక్క నవోదయ పాఠశాల, మెడికల్ కాలేజీ అయినా, సిరిసిల్లకు మెగా పవర్‌లూమ్ క్లస్టర్, కరీంనగర్‌కు ట్రిపుల్ ఐటీ అయినా తేలేదు. కానీ కాళ్లళ్ల కట్టెలు పెడుతు న్నారు..’ అని విమర్శించారు. ఈ కార్యక్రమాల్లో ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, ఎమ్మెల్సీ రఘోత్తమరెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పలు సంస్థల చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలి
‘గంభీరావుపేటలో కేజీ టూ పీజీ స్కూల్ రాష్ట్రానికి ఆదర్శమైంది. అక్కడ ప్రభుత్వ హాస్టళ్లను కూడా ప్రారంభిస్తాం. విద్యతోనే వికాసం..విజ్ఞానం. ఒకతరం చదువుకుంటే ఇక వెనక్కి చూడాల్సిన పని ఉండదు. ప్రపంచంతో పోటీపడే స్థాయికి ఎదగాలి. జిల్లాలోని 60 స్కూళ్లలో ఆరు నుంచి పదో తరగతి వరకు పిల్లలకు కంప్యూటర్ బేసిక్స్ నేర్పిస్తున్నాం. ఈ నైపుణ్య శిక్షణ విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా సర్కారు స్కూళ్లలో అమలు చేస్తాం. బాలి కలకు ఆత్మరక్షణ కార్యక్రమాలు అన్ని పాఠశా లల్లో నిర్వహిస్తాం..’ అని మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment