ప్రారంభోత్సవం అనంతరం మంత్రి మల్లారెడ్డితో కలసి ఉప్పల్ స్కైవాక్‌పైకి వెళ్తున్న కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. ఈ అభివృద్ధిని చూస్తూ ఓర్వలేకే ప్రతిపక్షాలు అడ్డగోలుగా మాట్లాడుతున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్‌ను జైల్లో పెడతామంటూ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నడ్డా.. అడ్డమైన మాటలు మాట్లాడొద్దంటూ హెచ్చరించారు.
అడ్డం పొడుగు లేని మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు సహించబోరని చెప్పారు. ఉప్పల్ రింగురోడ్డు వద్ద సుమారు రూ.25 కోట్లతో నిర్మించిన స్కైవాక్‌ను మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. అంతకుముందు ఉప్పల్ మినీ శిల్పారామం వద్ద రూ.10 కోట్లతో నిర్మించిన మల్టీ పర్పస్ హాల్‌ను ప్రారంభించారు. అనంతరం ఉప్పల్‌లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు.
మీరంతా సొంత అస్తిత్వం లేని గులాములు
‘కేసీఆర్‌ను ఎందుకు జైల్లో వేస్తారు? కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలతో లక్షలాది మంది ఆడ్డబిడ్డల పెళ్లిళ్లు చేసినందుకా? సర్కార్ దవాఖానాల్లో వైద్య సేవలను మెరుగుపర్చినందుకా? ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులకు కేసీఆర్ కిట్‌లను అందజేసిందుకా? డబుల్ బెడ్‌రూమ్ వంటి పథకాలను ప్రవేశపెట్టినందుకా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘హైదరాబాద్‌లో మా ప్రభుత్వం 35 ఫ్లైఓవర్ బ్రిడ్జిలను నిర్మించింది. ప్రజలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్డు సదుపాయాలను అభివృద్ధి చేసింది.
కేంద్రం నారపల్లి నుంచి ఉప్పల్ వరకు చేపట్టిన ఫ్లైఓవర్ ఆరేళ్లు అయినా పూర్తి కాలేదు. అంబర్‌పేట్ ఫ్లైఓవర్ అలాగే ఉండిపోయింది. ఇదీ కేసీఆర్ పనితీరుకు, మోదీ పనితీరుకు మధ్య వ్యత్యాసం. కాంగ్రెస్, బీజేపీ నాయకులంతా సొంత అస్తిత్వం లేని ఢిల్లీ గులాములు. కానీ కేసీఆర్ స్వీయ రాజకీయ అస్తిత్వంతో తెలంగాణను ముందుకు తీసుకెళ్తున్నారు. 55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలోని దరిద్రాన్ని, పేదరికాన్ని కేవలం తొమ్మిదేళ్లలో పోగొట్టారు. తెలంగాణలో ప్రతి ఇంటికీ ఒక అన్నగా, ఇంటి పెద్దగా అండగా ఉండి వాళ్ల కష్టాలను తీరుస్తున్నారు. ఆయన నాయకత్వంలోనే ప్రగతి రథ చక్రాలు పరుగులు తీస్తాయి..’ అని మంత్రి చెప్పారు.
అమర వీరులను చంపింది సోనియా గాందీయే..
‘అమర వీరులను చంపింది సోనియా గాందీయే. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో జాప్యం వల్లనే వాళ్లు చనిపోయారు. అయితే రేవంత్‌రెడ్డి అమరుల గురించి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నాడు. కేసీఆర్‌ను తిడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు. పులి శాకాహారిగా మారినట్లు ఆయన అవినీతి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. రూ.50 లక్షల నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిన దొంగోడు, జైల్లో చిప్పకూడు తిన్నోడు అవినీతి గురించి మాట్లాడుతున్నాడు..’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
పాదచారుల భద్రతకు భరోసా
‘నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే ఉప్పల్ రింగ్‌రోడ్డు వద్ద గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగేవి. ఇప్పుడు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన స్కైవాక్ వల్ల రింగురోడ్డుకు 5 మార్గాల్లో పాదచారులు నిర్భయంగా రాకపోకలు సాగించవచ్చు. ఉప్పల్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.వందల కోట్లు ఖర్చు చేసింది. రూ.453 కోట్లతో మంచినీళ్ల ట్యాంకులు, పైపులైన్‌లు కొత్తగా ఏర్పాటు చేశాం. త్వరలో ఎయిర్‌పోర్టు మెట్రో కూడా అందుబాటులోకి వస్తుంది.
ఉప్పల్–ఘటకేసర్ మార్గంలో నాణ్యమైన రోడ్లు వేస్తాం..’ అని మంత్రి తెలిపారు.స్కైవాక్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన దానిపై కొద్దిసేపు నడిచారు. హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను, స్కైవాక్ మోడల్‌ను తిలకించారు. హెచ్‌ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్, చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్‌రెడ్డి ప్రాజెక్టు ప్రత్యేకతలను మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment