సబ్సిడీ పంపుసెట్టుకోసం ప్రతిపాదన పంపడానికి లంచం డిమాం డ్ చేసిన ఓ రెవెన్యూ ఉద్యోగి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికాడు.
సబ్సిడీ పంపుసెట్టు అనుమతి
ప్రతిపాదన కోసం లంచం డిమాండ్
రూ.4 వేలు తీసుకుంటూ తహశీల్దార్ కార్యాలయం వద్ద
పట్టుబడిన వీఆర్‌వో
ఉలిక్కిపడిన రెవెన్యూ అధికారులు
వీరఘట్టం : సబ్సిడీ పంపుసెట్టుకోసం ప్రతిపాదన పంపడానికి లంచం డిమాం డ్ చేసిన ఓ రెవెన్యూ ఉద్యోగి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికాడు. వీరఘట్టం మండలంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ రంగరాజ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మొట్టవెంకటాపురం గ్రామానికి చెందిన బోను రాజారావుతో పాటు మరో ఇద్దరు రైతులు తమ పొలంలో సబ్సిడీపై ప్రభుత్వం అందజేసే పంపుసెట్టుకావాలని మూడు నెలల క్రితం వీరఘట్టం తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తుచేసుకున్నారు.
దరఖాస్తులను పరిశీలించిన తహశీల్దార్ ఎం.వి.రమణ వాటికి సంబంధించి నివేదికలు సిద్ధం చేయాలని బిటివాడ, కుమ్మరిగుంట వీఆర్‌ఓగా పని చేస్తున్న ఎల్.వెంకటరత్నంనాయుడును ఆదేశించారు. పొలాలు పరిశీలించి నివేదికలు ఇవ్వడానికి అర్జీదారులను రూ. 5వేలు లంచం కావాలని డిమాండ్ చేశారు. ఎంతగా బతిమిలాడినా ఆయన ససేమిరా అనడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రూ. నాలుగు వేలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతేగాకుండా వీఆర్‌ఓ ఒత్తిడికి విసిగిపోయిన వారు ఏసీబీ అధికారులను గురువారం ఆశ్రయించారు.
పథకం ప్రకారం...
అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డీఎస్పీ రంగరాజ్ అధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్లు లక్ష్మోజి, రమేష్‌లు పథకం ప్రకారం వీఆర్‌ఓ వెంకటరత్నంనాయుడును శుక్రవారం సాయంత్రం ఆరుగంటల సమయంలో తహశీల్దార్ కార్యాలయం గేట్ వద్ద రూ.4 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి వీఆర్‌ఓను శ్రీకాకుళం తమ వెంట తీసుకు వెళ్లారు.తహశీల్దార్ ఎం.వి.రమణ నుండి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.
ఉలిక్కిపడిన వీరఘట్టం
వరుస దాడులతో వీరఘట్టం మండలం ఒక్కసారి శుక్రవారం ఉలిక్కిపడింది. గురువారం చలివేంద్రిలో విజిలెన్స్ అధికారుల దాడులు, తాజాగా వీరఘట్టంలో ఏసీబీ దాడులతో అవినీతి అధికారులతో పాటు అక్రమ వ్యాపారుల్లో దడ మొదలైంది. అవినీతికి ఎవరైనా పాల్పడితే 9440446124 నంబరుకు సమాచారం ఇస్తే అవినీతి పరుల భరతం పడతామని ఏసీబీ డీఎస్పీ రంగరాజ్ ఈ సందర్భంగా విలేకరులకు తెలిపారు.