వీరఘట్టం: గ్రామ పంచాయతీల జమాఖర్చుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మరో మూడు నెలల్లో ముగియనుంది. అయితే గత ఆర్థిక సంవత్సరం(2013-14) జమాఖర్చుల నమోదే ఇంకా పూర్తి కాలేదు. జిల్లాలోని 1099 పంచాయతీల్లో ఇప్పటి వరకు 412 గ్రామాల వివరాలు మాత్రమే నమోదయ్యాయని అధికారవర్గాల ద్వారా తెలిసింది. ప్రత్యేక ఏజెన్సీ సాంకేతిక పరిజ్ఞానం అందించినప్పటికీ పంచాయతీరాజ్ సిబ్బంది నిరాసక్తత కారణంగా ఈ ప్రక్రియ చాలా మందకొడిగా సాగుతోంది.
స్థానిక సంస్థలకు మంజూరు చేస్తున్న నిధులు వినియోగం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమైన ఈ విధానం అమలుకు రాష్ట్రంలో ప్రత్యేకంగా పంచాయతీరాజ్ ఇన్‌స్టిట్యూషన్స్ అకౌంటింగ్, సాప్ట్‌వేర్ సిస్టమ్(ప్రియా సాప్ట్‌వేర్ సిస్టమ్) రూపొందించారు. అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించే బాధ్యతను కార్వీ సంస్థకు అప్పగించారు. ఈ సాఫ్ట్‌వేర్ వినియోగంపై గ్రామపంచాయతీ కార్యదర్శులకు సామర్లకోటలో ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. మొదట్లో సొంతంగా కంప్యూటర్లు అందుబాటులో లేనందున వివరాలు నమోదు చేయడానికి ప్రైవేటు నెట్ సర్వీసులను వినియోగించేందుకు అనుమతి ఇచ్చారు.
ఇందుకు అయ్యే ఖర్చులను పంచాయతీ నిధుల నుంచి తీసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ఆ తర్వాత అన్ని మండల కేంద్రాల్లో రెండేసి కంప్యూటర్లు ఏర్పాటు చేసి ఇద్దరు ఆపరేటర్లను నియమించారు. వారానికోసారైనా ఆ మండలంలోని పంచాయతీల జమాఖర్చులు నమోదు చేయించాలని ఆదేశించారు. తర్వాత ప్రతి పంచాయతీకి ఒక ఆపరేటర్‌ను నియమించారు. అయినా పరిస్థితి మారలేదు. జిల్లాలో అన్ని పంచాయతీల్లోనూ కంప్యూటర్లు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. పూర్తిస్థాయి సమాచారం ఆన్‌లైన్‌లో పొందిపరిస్తే ఢిల్లీలోని ఉన్నతాధికారులతో పాటు సదరు పంచాయతీ ప్రజలు కూడా ఆ వివరాలు తెలుసుకొనేందుకు వీలవుతుంది. తద్వారా నిధుల వినియోగంలో పారదర్శకత ఉంటుంది. మళ్లీ నిధుల విడుదలకు మార్గం సుగమమవుతుంది.
40 శాతమే పూర్తి
అయితే పంచాయతీ సిబ్బంది మాత్రం దీనిపై నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. జిల్లాలో 1099 పంచాయతీలు ఉండగా కేవలం 40 శాతం.. అంటే 412 పంచాయతీలు మాత్రమే గత ఆర్థిక సంవత్సరం జమా ఖర్చుల వివరాలు నమోదు చేశాయి. మండలాల వారీగా పరిశీలిస్తే ఏ మండలంలోనూ నూరు శాతం నమోదు పూర్తి కాలేదు. గత ఏడాది లెక్కల నమోదు పూర్తి అయితేనే ఈ ఆర్థిక సంవత్సరం వివరాల నమోదుకు అనుమతిస్తారు.
వెంటనే పూర్తి చేయాలని ఆదేశించాం
జమాఖర్చుల నమోదుపై జిల్లా ఇన్‌చార్జి పంచాయతీ అధికారి బి.ఎం.సెల్వియాను వివరణ కోరగా పంచాయతీ లెక్కల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కార్యదర్శులను గతంలోనే ఆదేశించామన్నారు. ఈ విషయంలో వెనుకబడిన మాట వాస్తవమేనని, మళ్లీ మరోసారి సమావేశం నిర్వహించి పెండింగ్ వివరాలు వెంటనే నమోదు చేయాలని ఆదేశిస్తామని చెప్పారు.
లెక్కల ‘పంచాయితీ’
Published Sun, Dec 21 2014 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 6:29 PM
Advertisement
Advertisement