వీరఘట్టం : బడిఈడు బాలలందరికీ నిర్బంధ విద్య అందించే లక్ష్యంతో రూపొందించిన విద్యా హక్కు చట్టం జిల్లాలో అమలుకు నోచుకున్న దాఖలాలులేవు. చదువు కావాలని కోరిన ప్రతి పిల్లవాడికి విద్యను హక్కుగా చేసి ఉచితంగా చదువు చెప్పించేలా ప్రతిష్టాత్మకంగా తెచ్చిన చట్టం అమల్లో ప్రభుత్వం ఒకఅడుగు ముందుకేస్తే నాలుగడుగులు వెనక్కి పడుతున్నాయి. కేంద్ర పభుత్వం 2010లో దేశ వ్యాప్తంగా అమల్లోకి తెచ్చిన రైటు టూ ఎడ్యుకేషన్ యాక్ట్ (ఆర్‌టీఈ-2009) కు బుజు పట్టింది. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలపై అటు ప్రభుత్వం, ఇటూ విద్యాశాఖాధికారులు దృష్టి సారించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆరేళ్ల నుంచి 14 ఏళ్ల లోపు బాలలను పాఠశాలలకే పరిమతం చేసి, బాలకార్మిక వ్యవస్థను సమూలంగా రూపుమాపే లక్ష్యంతో ఈ చట్టాన్ని రూపొందించారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను నిరుపేద, ఆల్పాదాయ వర్గాల పిల్లలతో ఉచితంగా భర్తీ చేయాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వం చట్టం అమలుకు ముందుకు రాకపోవడంతో విద్యాశాఖాధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు.
చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే..
విద్యాభివృద్ధి లేనిదే సమాజాభివృద్ధి సాధించలే దని భావించిన కేంద్ర ప్రభుత్వం 2009 ఆగస్టు 27న విద్యా హక్కు చట్టాన్ని రూపొందించింది. ఎనిమిది నెలల తర్వాత 2010 ఏప్రిల్ ఒకటో తేదీన అమల్లోకి తెచ్చింది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన,పేద విద్యార్థులకు 25 శాతం రిజ్వరేషన్, ప్రభుత్వం గుర్తింపు లేకుండా పాఠశాలలు కొనసాగరాదనే ప్రధానాంశాలు చట్టంలో పొందుపరిచారు. అయితే వీటిలో ఏ ఒక్కటీ జిల్లాలో సక్రమంగా అమలు కాలేదు. చట్టం వచ్చిన ఐదేళ్ల కాలంలో జిల్లాలోని ఏ ఒక్క కార్పొరేట్ పాఠశాలలోనూ పేద విద్యార్థులతో 25 శాతం సీట్లను ఉచితంగా భర్తీ చేయలేదు. గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవడంలో సైతం అధికారులు విఫలమయ్యారు.
పేదలపై ఫీజు భారం
విద్యాహక్కు చట్టం సక్రమంగా అమలుకాకపోవడంతో పేద, ఆల్పాదాయ వర్గాల పిల్లలు అవస్థలు పడతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్న వారు వేలాది రూపాయలను ఫీజులుగా చెల్లిస్తున్నారు. చట్టం నిర్దేశించిన విధంగా జరిగితే ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను ఉచితంగా ఇవ్వడం ద్వారా పేద వర్గాల పిల్లలతో భర్తీ చేసిన పాఠశాలలకు ఆ మేరకు ఫీజులను ప్రభుత్వం చెల్లించాలని చట్టంలో పొందుపరిచారు. మరోవైపు చట్టంలో పొందుపర్చిన విధంగా ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవన నిర్మాణాలు చేపట్టి, పూర్తిస్థాయిలో సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండగా.. జిల్లాలో ఆ పరిస్థితి లేదు.
కాగితాల్లోనే నిర్బంధం !
Published Fri, Sep 4 2015 12:13 AM | Last Updated on Sun, Sep 3 2017 8:41 AM
Advertisement