వీరఘట్టం: మండల కేంద్రం తెలగవీధిలో వివాహిత గ్రంధి లిల్లీగ్రేస్(24) అనుమానాస్పద మృతి సంచలనం రేపింది. భర్త, అత్తమామల వేధింపులకు నిండు ప్రాణం బలైందని కొందరు, భర్త, అత్తమామలే హత్య చేశారని మృతురాలి కుటుంబ సభ్యుల ఆరోపణలతో వివాహిత మృతి అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
స్థానిక తెలగవీధిలో గత కొన్ని నెలలుగా గ్రంధి రాజు అతని భార్య లిల్లీగ్రేస్, అత్తమామలు అప్పయ్యమ్మ, సూర్యరావు నివాసముంటున్నారు. వీరు విశాఖపట్నం జిల్లా తగరపువలస గ్రామం నుంచి ఇక్కడకు వలస వచ్చి బీరువాలు మరమ్మతులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. లిల్లీగ్రేస్‌ను భర్తతో పాటు అత్తమామలు నిత్యం వేధిస్తున్నారు. ఈ వేధింపులు తాళలేక శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఆమె మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పాలకొండ డీఎస్పీ సి.హెచ్.ఆదినారాయణ, సీఐ ఎన్.వేణుగోపాలరావు, పోలీసులు సంఘటనా స్థలానికి ఆదివారం ఉదయం చేరుకొని మృతదేహాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. భర్త, అత్తమామల వేధింపులే ఈ చావుకి కారణమని అనుమానిస్తున్నారు. అయితే తన భార్య లిల్లీగ్రేస్ ఇంటిలో వంటగదిలో ఉరిపోసుకొని చనిపోయినట్టు భర్త రాజు పోలీసులకు తెలిపాడు. అనంతరం మృతిరాలి భర్త రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లిల్లీగ్రేస్ మృతిపై ఎస్‌ఐ బి.రామారావు కేసు నమోదు చేశారు. తహశీల్దార్ ఎం.వి.రమణ ఆధ్వర్యంలో పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఇది ముమ్మాటికీ హత్యే
ఇది ముమ్మాటికీ హత్యే అంటూ మృతురాలి తల్లిదండ్రులు కొయ్యాన యోహన్, అన్నమణి ఆరోపించారు. భర్తతో పాటు అత్తమామలు ఎన్నోసార్లు వేధించారని తన కుమారై లిల్లీగ్రేస్ ఫోన్‌లో చెప్పేదని, ఇవన్నీ కుటుంబంలో సహజమేనని సర్దిచెప్పేవారుమన్నారు. అయితే ఇంత దారుణానికి ఒడిగడతారని మేము అనుకోలేదని భోరున విలపించారు. తమ కుమారైలాంటి దుస్థితి మరెవరికీ రాకుండా ఉండాలంటే ఆమెను హత్య చేసిన భర్త, అత్తమామలను కఠినంగా శిక్షించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు 2010లో రూ. 5 లక్షల కట్నం, 5 తులాల బంగారం ఇచ్చి పెళ్లి చేశామన్నారు. తమ కుమారైను బాగా చూసుకుంటారని భావిస్తే చిత్ర హింసలు పెట్టి పైలోకాలకు పంపించారని విలపించారు. తల్లి లేని మా మనవళ్లు అనాథలయ్యారంటూ కన్నీటి పర్యాంతమయ్యారు.
కుమ్మక్కు అవుతున్న పోలీసులు
లిల్లీగ్రేస్‌ను భర్త, అత్తమామలు హత్య చేసి... ఈ ఉదంతాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూస్తున్నారని, వారికి అనుగుణంగా పోలీసులు కేసు నమోదు చేసి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘ అధ్యక్షుడు గంగరాపు సింహాచలం, జిల్లా ఐద్వా సంఘ ఉపాధ్యక్షురాలు గంగరాపు ఈశ్వరమ్మ, సీపీఎం, పలు ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. ఈ మేరకు వీరఘట్టం పోలీస్ స్టేషన్ వద్ద ఆదివారం సాయంత్రం ఆందోళన చేశారు. వివాహితను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
Published Sun, Sep 6 2015 11:52 PM | Last Updated on Sun, Sep 3 2017 8:52 AM
Advertisement
Advertisement