కొమ్మాది(భీమిలి): ఎన్నో ఆశలతో అత్తవారింట అడుగుపెట్టిన ఓ యువతి పెళ్లయిన 42 రోజులకే మృత్యుఒడికి చేరింది. కట్టుకున్న భర్తే కాలయముడిగా మారి కిరాతకంగా చంపేశాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జీవీఎంసీ 4వ వార్డు పుక్కళ్లపాలేనికి చెందిన మైలపిల్లి హరితో తగరపువలస వలందపేటకు చెందిన కోనాడ నరసయమ్మ(26)కు 42 రోజుల కిందట వివాహం జరిగింది. పెళ్లయిన వారం రోజులకే హరి అదే వార్డు పరిధి చేపలుప్పాడ సమీపంలోని గోవుపేటలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు. నగరంలో ఓ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
అయితే ఏమైందో తెలియదు కాని నరసయమ్మ శుక్రవారం ఉదయం విగతజీవిగా కనిపించింది. తగరపువలసలో ఉంటున్న తన అన్నయ్య కోనాడ అప్పారావుతో ఆమె రోజూ ఫోన్‌లో మాట్లాడుతుండేది. శుక్రవారం ఉదయం నుంచి అప్పారావు ఆమెకు ఫోన్ చేస్తున్నా స్పందించకపోవడంతో అనుమానం వచ్చి అతను మధ్యాహ్నం నరసయమ్మ ఇంటికి వచ్చేసరికి తన చెల్లి విగతజీవిగా పడి ఉంది. దీంతో హరిని నిలదీయగా ఎటువంటి సమాధానం చెప్పకపోవడంతో భీమిలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కాళ్లకు తాడు కట్టి..
నరసయమ్మ శుక్రవారం ఉదయమే చనిపోయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శరీరంపై ఉన్న గాయాలను బట్టి హత్యగానే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాళ్లకు తాడుకట్టి, ఛాతిపై వాతలు పెట్టి, మెడకు తాడు కట్టి హత్య చేసినట్లు పోలీసుల పరిశీలనలో తేలింది. సీఐ వెంకటరమణ, ఎస్సై రాంబాబు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మూఢ నమ్మకాలతోనే.?
హరికి మూఢనమ్మకాలపై ఆసక్తి ఎక్కువ అని, జరిగినది.. జరగబోయేది చెబుతానంటూ ఏవో మంత్రాలు.. తంత్రాల వంటివి వేస్తాడని స్థానికులు చెబుతున్నారు. మూఢనమ్మకాల్లో భాగంగానే నరసయమ్మను చిత్ర హింసలకు గురిచేసి చంపి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. ఆమె మరణం విని తండ్రి దుర్గయ్య విలపించిన తీరు అందరినీ కన్నీరు పెట్టించింది. దుర్గయ్యకు ఇద్దరు కొడుకులు, నలుగురు కూతుర్లు కాగా.. ఈమె చివరి కుమార్తె. ఆయన భార్య గతంలోనే చనిపోయింది. పెళ్లయి ఆనందంగా గడుపుతుందని భావించిన తన కూతురు ఇలా హత్యకు గురవుతుందని ఊహించలేదని వాపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment