బాధితులు ప్రసన్న కుమార్, ప్రభుదాసు
తగరపువలస(భీమిలి): గడ్డి వాము తగలబెట్టిన కేసులో నేరాన్ని ఒప్పుకోవాలని భీమిలి మండలం దాకమర్రికి చెందిన అన్నదమ్ములు చెల్లూరి ప్రసన్న కుమార్, ప్రభుదాసులపై భీమిలి పోలీసులు ప్రతాపం చూపారు. బెల్టు దెబ్బలతో హింసించి.. బూటు కాలితో తన్నారు. వైఎస్సార్ సీపీ యేతర పార్టీ నాయకుల ప్రమేయంతోనే తమపై కక్ష సాధించినట్టు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వారు తెలిపిన వివరాలివీ.. గత నెల 30 రాత్రి 12.30 సమయంలో గ్రామంలో కె.అప్పలరాజుకు చెందిన గడ్డివామును గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు.
దీనిపై ఆయన మరికొందరితో కలిసి ప్రసన్న కుమారే తన గడ్డి వామును తగలబెట్టినట్టు భీమిలి పోలీసులకు 31న ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ ప్రసాద్ ప్రసన్నకుమార్, ప్రభుదాసులను అదే రోజు సాయంత్రం స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారణ పేరుతో హింసించారు. ఆయనకు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు తోడయ్యారు. గడ్డి వాము తగలబెట్టినట్టు ఒప్పుకోవాలంటూ వీపుపై బొబ్బలు వచ్చేలా బెల్టుతో కొట్టి, బూటు కాలితో తన్నినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.
సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు హింసించి.. రాత్రి 11 గంటలకు విడిచిపెట్టినట్లు చెప్పారు. మంగళవారం సాయంత్రం వరకు వీరి ఒంటిపై దెబ్బలు అచ్చుకట్టి ఉన్నాయి. దీనిపై బాధితులు మాట్లాడుతూ గడ్డి వాము తగలబెట్టినట్టు అనుమానం ఉంటే కేసు పెట్టాలని కోరినా కనికరించలేదన్నారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తనను విడిచిపెట్టమని కోరినా వినలేదని ప్రభుదాస్ కన్నీరుమున్నీరయ్యారు.
పంచాయతీకి చెందిన కొందరి ప్రోద్భలంతోనే ప్రాణాలు పోయేలా కొట్టారని వాపోయారు. ఈ సంఘటన కారణంగా ఈ నెల 23న జరగాల్సిన తన పెళ్లి సందిగ్ధంలో పడినట్టు ప్రసన్న కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని భీమిలి సీఐ జీవీ రమణ దృష్టికి తీసుకురాగా.. ఎస్‌ఐ ప్రసాద్‌కు చార్జ్ మెమో ఇచ్చి విచారణ జరిపిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment