ఆమె జీతం 7 లక్షలు.. అతని జీతం 4 లక్షలు? | Women Suicide In Visakhapatnam | Sakshi
Sakshi News home page

 భర్త కన్నా అధిక సంపాదనే శాపమైంది

Published Fri, Jun 15 2018 2:48 AM | Last Updated on Fri, Jun 15 2018 10:28 PM

Women Suicide In Visakhapatnam - Sakshi

ఆత్మహత్యకు పాల్పడిన వాణి, భర్త గంగాధర్‌తో వాణి (పాతచిత్రం)

పెదవాల్తేరు(విశాఖతూర్పు) : ఉన్నత చదువు.. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం.. రూ.లక్షల్లో వేతనం. సాఫీగా సాగిపోవాల్సిన జీవితం... కానీ అత్తింటి వారి వేధింపులు ఓ మహిళను పొట్టనపెట్టుకున్నాయి. తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చాయి. భర్త కన్నా అధిక మొత్తంలో సంపాదించడమే ఆమె పాలిట శాపంగా మారింది. తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాలివి..

నగరంలోని ఎంవీపీ కాలనీకి చెందిన పీతల అప్పారావు ఆంధ్రా యూనివర్సిటీలో పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో రెండో కుమార్తె వాణి(35)కి 2011లో జిల్లా పరిషత్‌ దరి కృష్ణానగర్‌కు చెందిన పసుపులేటి బుల్లయ్య కుమారుడు గంగాధర్‌తో వివాహం జరిగింది. వివాహం సమయంలో అధిక మొత్తంలో కట్న, లాంఛనాలు సమర్పించారు. తరువాత భార్యాభర్తలిద్దరూ అమెరికా వెళ్లి అక్కడ ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగాలు చేశారు. వీరికి ఆరేళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు.  కొన్నాళ్లు వీరి కాపురం సజావుగానే సాగింది.

వాణి నెల వేతనం రూ.7.80 లక్షలు కాగా.. ఆమె భర్త నెల వేతనం రూ.4 లక్షలు. దీంతో భర్త గంగాధర్‌లో అసూయ బాగా పెరిగిపోయింది. అమెరికాలో ఉండగానే వాణికి భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఇంకా కట్నం, కానుకలు తేవాలని సూటిపోటి మాటలతో వేధించాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం మానేయాలని కూడా ఒత్తిడి తెచ్చాడు. ఈ నేపథ్యంలో భార్యాభర్తలిద్దరూ ఈ ఏడాది ఏప్రిల్‌ 29న విశాఖ వచ్చేశారు. వాణి ఇంటి నుంచే హోం టు వర్క్‌ ఉద్యోగం చేస్తున్నారు. భర్త మాత్రం బంధువుతో కలసి మెడికల్‌ బిజినెస్‌ ప్రారంభించారు. ఈ క్రమంలో అత్తింటి వేధింపులు భరించలేక వాణి తన ఇద్దరు కుమారులను తీసుకుని తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది. ఆమె తల్లిదండ్రులు చినవాల్తేరు దరి కిర్లంపూడి లేఅవుట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు.

కొద్ది రోజుల కిందట ఆమె భర్త గంగాధర్‌ తన మేనత్త కుమారుడిని పంపించి, తన ఇద్దరు కుమారులను తీసుకురమ్మని చెప్పారు. దీంతో వాణి తాను కూడా వస్తానని చెప్పగా గంగాధర్‌ బంధువు నిరాకరించారు. ఆమె తల్లిదండ్రుల వద్దనే ఉండిపోయి ఇద్దరు కుమారులను భర్త వద్దకు పంపించింది. కాగా..గంగాధర్‌ తన చిన్న కుమారుడికి చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం ఉదయం వాణి తల్లిదండ్రులు ఆమెను నిద్రలేపడానికి ఎన్నిసార్లు గది తలుపుకొట్టినా.. స్పందన లేకపోవడంతో ఆందోళన చెందారు. తలుపు తెరిచి చూసేసరికి వాణి విషం తాగి ఆత్మహత్య చేసుకోవడం చూసి కుప్పకూలిపోయారు. వారిని ఓదార్చ డం ఎవరి తరమూ కాలేదు. మూడో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించారు. కేసును ఎస్‌ఐ ప్రసాద్‌ దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement