తనిఖీకి వచ్చి యువతి ఇంట్లో పోలీస్ రచ్చ
డీసీపీకి బాధితురాలి ఫిర్యాదు
బొమ్మనహళ్లి: యువతి పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకోగా, తనిఖీ కోసం ఆమె ఇంటికి వెళ్ళిన కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె షాకైంది. ఫిర్యాదు చేయడంతో అతనిని సస్పెండ్ చేసిన ఘటన బెంగళూరు నగరంలోని బ్యాటరాయనపుర ఠాణా పరిధిలో జరిగింది.
కోరిక తీర్చమంటూ..
ఫిర్యాదు మేరకు వివరాలు.. ఠాణా పరిధిలోని బాపూజీ నగరలో ఉండే ఓ యువతి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకుంది. ఇందుకోసం పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకుంది. ఆమె గురించి తనిఖీ చేయాలని పాస్‌పోర్టు ఆఫీసు నుంచి ఠాణాకు సిఫార్సు వచ్చింది. దీంతో కానిస్టేబుల్ కిరణ్ యువతి ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి చొరబడి తలుపులు మూసి, నీ సోదరునిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందువలన నీకు పాస్‌పోర్టు రాదు. నీవు నాకు సహకరిస్తే చాలు అని ఒత్తిడి చేశాడు. ఆమె ససేమిరా అనడంతో ఒక్కసారి కౌగిలించుకుంటా అని వేధించాడని యువతి ఆరోపించింది. మరో గదిలో ఉన్న సోదరుడు ఏమిటీ గొడవ అని రాగా, కానిస్టేబుల్ మాట మార్చి అక్కడి నుంచి జారుకున్నాడు. మరోవైపు వెరిఫికేషన్ నంబర్ ఇవ్వకుండా బ్లాక్ చేశాడు. దాంతో బాధితురాలు పశ్చిమ డీసీపీ ఎస్. గిరీష్‌ని కలిసి గోడు వెళ్లబోసుకుంది. పోలీసు తప్పు చేసినట్లు గమనించి అతన్ని సస్పెండ్ చేశారు.
ముడుపుల గోల
కాగా, నగరమే కాకుండా రాష్ట్రమంతటా పాస్‌పోర్టు కోసం పెద్దసంఖ్యలో ప్రజలు దరఖాస్తులు చేస్తుంటారు. తనిఖీల సమయంలో పెద్దమొత్తంలో ముడుపులు అడుగుతారని, ఇవ్వకపోతే ఏదో ఒక సాకుతో పెండింగ్‌లో పెడతారని ఆరోపణలు ఉన్నాయి. గొడవ ఎందుకని చాలామంది డబ్బులు ఇచ్చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment