పిల్లలతో జనార్దన్, అనూష దంపతులు(ఫైల్ ఫొటో)
చీకూ చింతా లేని చక్కని పొదరిల్లు వారిది.. భార్య, భర్త, వారికి ఇద్దరు ముత్యాల్లాంటి బిడ్డలు.. వారి ఆనందం చూసి విధికే కన్నుకుట్టిందో లేదా ఏ దుష్టగ్రహం కన్ను పడిందో గానీ క్షణ కాలంలో తల్లీ బిడ్డలు విగత జీవులుగా మారారు. కుమార్తెలను హతమార్చి, తల్లి ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. ఊరు వెళ్లిన భర్త ఇంటికి తిరిగి వచ్చేసరికి ఈ దారుణం జరిగింది. మృతురాలు సూసైడ్ నోట్ రాసి చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఆ లేఖలో ఏముందో తెలిస్తే గానీ అసలు విషయం బయటపడదు.
అనకాపల్లి: స్వగ్రామానికి వెళ్లి హుషారుగా ఇంటికి తిరిగి వచ్చిన భర్త హతాశుడయ్యాడు.. భార్యా బిడ్డల మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరయ్యాడు.. ఇంతలోనే అంత కష్టం ఏమొచ్చిందని కుమిలిపోతున్నాడు. అనకాపల్లి శివారులో సోమవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. శ్రీకాకుళం జి ల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగం మెట్ట పేట గ్రామానికి చెందిన మెట్ట జనార్దన్ ఆరేళ్ల కిందట తన అక్క కుమార్తె అనూష (24)ను వివాహం చేసుకున్నాడు.
వారికి సుదీక్ష (5), మెట్ట గీత అన్విత (ఏడాదిన్నర) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జనార్దన్‌కు అచ్యుతాపురంలో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం రావడంతో ఆరు నెలల నుంచి అనకాపల్లి జాతీయ రహదారికి సమీపంలో అనకాపల్లి–ఉమ్మలాడ రహదారిలో ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం ఉంటున్నాడు. జనార్దన్ ఉంటున్న ఇంటి పరిసరాలు నిర్మానుష్యంగా ఉంటాయి. దూరదూరంగా ఇళ్లు ఉంటాయి. మేడపై ఇంటి యజమాని కుటుంబంతో ఉంటున్నారు.
జనార్దన్ శనివారం శ్రీకాకుళం వెళ్లాడు. సోమవారం సాయంత్రం 5.30 నిమిషాలకు తన సోదరుడితో కలిసి ఇంటికి వచ్చి చూడగా ఇద్దరు చిన్నారులు విగత జీవులుగా పడి ఉన్నారు. భార్య ఫ్యాన్‌కు ఉరిపోసుకొని ఉంది. దీన్ని గమనించిన భర్త జనార్దన్ భార్యను కిందకు దించాడు. జనార్దన్ సోదరుడు 100కు ఫోన్ చేసి సమాచారమిచ్చాడు.
హుటాహుటిన డీఎస్పీ బి.సునీల్, పట్టణ సీఐ లంక భాస్కరరావులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. అనూష రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నట్లు డీఎస్పీ సునీల్ చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. అద్దె ఇంటి యజమాని దుర్భాషలాడడంతో తన భార్య మనస్తాపం చెంది ఈ దారుణానికి పాల్పడినట్టు జనార్దన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వారం కిందటే వచ్చారు..
జలుమూరు: నగరికటకం పంచాయతీ పరిధి మెట్టపేటకు చెందిన మెట్ట అనూష పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవడంతో మెట్టపేటలో విషాద ఛాయలు అలముకున్నాయి. అనూష తల్లిదండ్రులు మీనాకుమారి, సంజీవరావులు ఉపాధి రీత్యా పలాసలో ఉంటున్నారు. వారం కిందటే అనూషతో పాటు భర్త జనార్దనరావు స్వగ్రామం మెట్టపేట వచ్చారు. ఇంతలోనే ఈ విషాదకర వార్త వినాల్సి రావడంతో వారంతా విషాదంలో మునిగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment