వీరఘట్టం : జూదానికి అలవాటు పడిన కొందరు దానిని మానుకోలేక సీజనల్ జూదానికి తెరలేపుతున్నారు. ఏడాదిలో 60 శాతం పేకాటకు, మిగిలిన 40 శాతం క్రికెట్ బెట్టింగ్‌లతో కాలం వెల్లబుచ్చుతున్నారు. యువతను కూడా ఈ రొంపిలోకి లాగుతున్నారు. నెల రోజులుగా జరుగుతున్న ఇండియా-ఆస్ట్రేలియా వన్‌డే, టీ-20 మ్యాచ్‌లకు వీరఘట్టంలో ఒక రోజుకు రూ.5లక్షల వరకూ బెట్టింగ్‌లు విచ్చలవిడిగా బహిరంగ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. వీరఘట్టం అంబేడ్కర్ జంక్షన్‌లో ఉదయం 7 గంటల నుంచి 9గంటల వరకూ ఇవే చర్చలు. రూ.వెయ్యి, రెండు, మూడు వేలు ఇలా... పందాలు కాస్తూ బెట్టింగ్ బంగార్రాజులు పేట్రేగి పోతున్నారు. చిన్నచిన్న కిరాణ షాపులు, పకోడి బడ్డీలు, పాన్ షాపుల వద్ద ఈ తతంగం అంతా జరుగుతోంది.
అంతా ఆన్‌లైన్‌లోనే...
గతంలో ముఖాముఖిగా బెట్టింగ్‌లు కాసేవారు. కంప్యూటర్ పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఆన్‌లైన్ బెట్టింగ్‌కు తెర తీశారు. పాలకొండ, తోటపల్లి, పార్వతీపురం, విశాఖపట్టణం, బరంపురం తదితర పట్టణాల్లో క్రికెట్ మాఫీయాతో కొంతమందికి సంబంధాలు ఉండడంతో మాయదారి క్రికెట్ బెట్టింగ్‌లు వీరఘట్టంలో గత మూడేళ్ళ నుంచి యథేచ్ఛగా జరుగుతున్నాయి. అయితే ఇంత వరకూ వీరఘట్టంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి క్రికెట్ బెట్టింగ్‌లు బారి నుంచి యువతను రక్షించాలని పలువురు కోరుతున్నారు. ఇదే విషయాన్ని ఎస్సై బి.రామారావు వద్ద సాక్షి ప్రస్తావించగా క్రికెట్ బెట్టింగ్‌లు అంశం ఇంత వరకూ తమ దృష్టికి రాలేదని చెప్పారు. అయినా సరే బెట్టింగ్ రాయుళ్ళపై నిఘా వేసి బెట్టింగ్‌లకు పాల్పడిన వారిపై కే సులు నమోదు చేస్తామన్నారు.
క్రికెట్ ఏదైనా బెట్టింగ్ జరగాల్సిందే...
ఇండియా ఆడే మ్యాచ్‌లే కాదు... క్రికెట్ ఏ తరహాదైనా బెట్టింగ్‌లు మాత్రం కాల్‌మనీ వ్యవహారం కంటే దారుణంగా జరుగుతున్నాయి. టెస్ట్ మ్యాచ్‌లు, టీ-20, వన్‌డే, ఐ.పి.ఎల్ మ్యాచ్‌లు అని తేడా లేకుండా బెట్టింగ్ కాస్తున్నారు. ఈ బెట్టింగ్‌లకు అలవాటు పడిన యువత పక్కతోవ పడుతున్నారు. అధిక వడ్డీలకు అప్పులువాడి కుదేలవుతున్నారు. ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి.
జోరుగా క్రికెట్ బెట్టింగ్
Published Wed, Jan 27 2016 11:51 PM | Last Updated on Sun, Sep 3 2017 4:25 PM
Advertisement