పందెం కోళ్లతో ఖాకీల కష్టాలు | police problems In kodi pandalu at ap | Sakshi
Sakshi News home page

పందెం కోళ్లతో ఖాకీల కష్టాలు

Published Sun, Feb 2 2025 11:25 AM | Last Updated on Sun, Feb 2 2025 11:25 AM

police problems In kodi pandalu at ap

ఒక చోట క్రికెట్‌ బెట్టింగ్‌ జరుగుతుంటుంది. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి, బుకీలతో పాటు అక్కడ దొరికిన సామగ్రిని స్వాధీనం చేసుకుంటారు. ఒక ఇంట్లో కొందరు పేకాట ఆడుతూ ఉంటారు. పోలీసులు పేకతో పాటు నగదు, తదితరాలను కూడా స్వాధీనం చేసుకుంటారు. సంక్రాంతి రోజుల్లో కోడి పందేలు జరుగుతుంటాయి. పోలీసులు దొరికిన పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద దొరికిన నగదుతో పాటు కోళ్లనూ స్వాధీనం చేసుకుంటారు..

సాధారణంగా ఏ కేసులో అయినా పోలీసులు తాము అరెస్టు చేసిన నిందితులను కోర్టులో హాజరుపరచే సమయంలో వారి నుంచి స్వాధీనం చేసుకున్న నగదును, వస్తువులను కోర్టుకు అప్పగిస్తారు. కోడి పందేల కేసుల్లో కోళ్లను ఏం చేస్తారనేది ఆసక్తికర అంశం. ఈ కోళ్లను కొన్నాళ్ల వరకు కాచుకోవాల్సి ఉంటుంది. సంక్రాంతి రోజుల్లో జరిగే కోడి పందేలన్నీ రాజకీయ నాయకులు, పోలీసుల కనుసన్నల్లోనే జరుగుతాయి. న్యాయస్థానాలు  ప్రశ్నించినప్పుడో, మరేదైనా జరగరానిది జరిగినప్పుడో చూపించుకోవడానికి రికార్డుల కోసం పోలీసులు అప్పుడప్పుడు కొన్నిచోట్ల దాడులు చేస్తుంటారు. కోడి పందేలు ఆడుతున్న వారిని, పందేలకు సిద్ధమవుతున్న వారిని అరెస్టు చేసి, వారి నుంచి కత్తులు, నగదుతో పాటు కోళ్లను స్వాధీనం చేసుకుంటుంటారు. . 

పందెంరాయుళ్లను కోర్టులో హాజరుపరచే పోలీసులు కోళ్లను స్వాధీనం చేసుకున్న విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లి, దానికి ఆధారంగా కొన్ని ఫొటోలను సమర్పిస్తారు. న్యాయస్థానం నిందితులను బెయిల్‌పై వదలడమో, రిమాండ్‌కు పంపడమో చేస్తుంది. ఆపై విషయం కోళ్ల దగ్గరకు వస్తుంది. ఆ కోళ్లను గతంలో సేఫ్‌ కస్టడీలో ఉంచాలంటూ పోలీసులనే ఆదేశించేది. దీంతో పోలీసులు వాటిని ఠాణాల్లోనో లేదా సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశాల్లోనే కట్టేసి మేపుతుండే వాళ్లు. అక్కడే కొన్ని రోజుల పాటు తమ సంరక్షణలో ఈ కోళ్లు ఉండాల్సి రావడం, అవి కోర్టు ప్రాపర్టీ కావడంతో తాత్కాలిక భద్రత ఏర్పాట్లు చేసేవాళ్లు.

ప్రతి రోజూ వాటికి తిండి గింజలు, నీళ్లు తదితరాలు అందిస్తూ జాగ్రత్తగా కాచుకునేవారు. ఈ విధానంలో అనేక ఇబ్బందులు వస్తుండటంతో కోర్టు కొన్నాళ్లుగా ఈ విధానాన్ని మార్చింది. కోళ్లను స్వాధీనం చేసుకున్న వెంటనే, వాటిని విక్రయించడానికి అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తున్నారు. ఆ కోళ్లను స్థానికంగా ఉండే పెంపకందారులకు, చికెన్‌ షాపుల నిర్వాహకులకు అప్పగించి ఎన్ని, ఏ రకానికి చెందినవో సూచిస్తూ రసీదు తీసుకుంటారు. వారి నుంచి వాంగ్మూలం కూడా నమోదు చేసుకుని, కోర్టుకు సమర్పిస్తారు. 

అలా ఓ సంరక్షకుడికి అప్పగిస్తున్న సమయంలో ఆ కోళ్లను తిరిగి పందేలకు వినియోగించకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఆ కోణంలో మరికొన్ని చర్యలు కూడా తీసుకుంటారు. గేమింగ్‌ యాక్ట్‌ ప్రకారం నమోదయ్యే ఈ కేసు దర్యాప్తు పూర్తయ్యాక న్యాయస్థానంలో నిందితులపై అభియోగపత్రాలు దాఖలు చేస్తారు. ఆ సమయంలోనే కోళ్ల విక్రయానికి అనుమతిచ్చే న్యాయస్థానం ఓ రేటును ఖరారు చేస్తుంది. ఈ ధరకు కోళ్లను అప్పటి వరకు వాటి సంరక్షణ చూసిన వారికే అమ్మేసి, అలా వచ్చిన మొత్తాన్ని కోర్టులో జమ చేస్తారు. ఈ క్రతువులోనూ ఇటీవల కాలంలో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇలా కోర్టులో జమ చేసిన మొత్తం కేసు విచారణ ముగిసి, ఫలితం తేలే వరకు బ్యాంకు ఖాతాలోనే ఉంటుంది.

 సరైన సాక్ష్యాధారాలు లేకనో, మరో కారణంగానో కేసు వీగిపోతే ఆ మొత్తం ఆరోపణలు ఎదుర్కొన్న నిందితులకు, కేసు నిరూపితమై వారికి శిక్షపడితే కోర్టుకు వెళ్లిపోతుంది. ఇక్కడే కొన్ని సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. కేసు వీగిపోయినప్పుడు కొందరు పందెంరాయళ్లు పోలీసుల వద్ద కొత్త మెలికలు పెడుతున్నారు. తమ కోళ్లు తమకు కావాలంటూ వాదిస్తున్నారు. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానాలు ఇటీవల ఒక కొత్త విధానాన్ని మొదలెట్టాయి. స్వాధీనం చేసుకున్న కోళ్లను మళ్లీ పందేలకు ఉపయోగించకుండా షరతులు వి«ధిస్తూ, నిందితులకే అప్పగించాలని చెబుతున్నాయి. కేసు విచారణ ముగిసి, వారిపై నేరం నిరూపణ అయితే మాత్రం అప్పుడు న్యాయస్థానం ఆ కోళ్లకు రేటు కట్టి, నిర్దేశిత మొత్తాన్ని వారి నుంచి వసూలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాయి.

ఈ పందెం కోళ్లు తమ స్వాధీనంలో ఉన్నన్నాళ్లూ పోలీసులు ఒక రకంగా కంటిమీద కునుకు లేకుండా గడిపాల్సిన పరిస్థితే! ఈ కేసులో అరెస్టు చేసిన నిందితులను మరుసటి రోజు కోర్టులో హాజరుపరచడంతో పాటు కోళ్లను సంరక్షకుడికి అప్పగించే వరకు పోలీసులదే బాధ్యత. ఆలోపు ఆ కోళ్లకు ఏమైనా జరిగితే పోలీసులకు కొత్త పని వచ్చిపడుతుంది. వారి అధీనంలో ఉండగా అనారోగ్య, అనివార్య కారణాలతో ఒక్క కోడిపుంజు చనిపోయినా లేదా తప్పించుకుని పోయినా, దానికి సంబంధించి మరో కేసు నమోదు చేయాలి. చనిపోయిన కోడి కళేబరానికి ప్రభుత్వ  పశువైద్యుడితో పోస్టుమార్టం చేయించాలి. తర్వాత అధికారికంగా ఖననమో, దహనమో చేయించడమూ అనివార్యం. 

ఈ తంతులు పక్కాగా చేయడంతో పాటు ఆ రికార్డులను కోర్టులో దాఖలు చేయడం తప్పనిసరి. ఈ వ్యవహారంలో కొసమెరుపు ఏమిటంటే, ఇలాంటి పందెం కోళ్లను కోర్టు అనుమతి తర్వాత సంరక్షకులు ఎక్కువగా చికెన్‌ పకోడీ సెంటర్లకు విక్రయించడం లేదా తామే పకోడీ చేసుకోవడం చేస్తుంటారు. డ్రైఫ్రూట్స్, పళ్లు వంటి పౌష్టికాహారం తిని పెరిగే ఈ కోళ్లతో చేసే కూర కంటే పకోడీనే బాగుంటుందని వాళ్లు చెబుతుంటారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement