బీజేపీ ఎంపీ సీఎం రమేశ్, టీడీపీ ఎమ్మెల్యే బండారు ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో కోడి పందేలు
ఊరూ వాడా యథేచ్ఛగా పందేల జోరు.. జూద క్రీడలు
బరుల వద్దే మినీ బార్లు, మద్యం షాపులు.. 3 రోజుల్లో రూ.5 వేల కోట్లకుపైగా దందా
మినీ స్టేడియంలు, ఫ్లడ్ లైట్లు, ఎల్‌ఈడీ స్క్రీన్లు, క్యారవ్యాన్లు, వీఐపీ గ్యాలరీలు, మాంసాహారాలతో విందు భోజనాలు
సినిమా సెట్టింగులు, మహిళా బౌన్సర్లతో హడావుడి
బరి తెగించి ఆడించిన కూటమి ఎమ్మెల్యేలు
ఉండిలో డిప్యూటీ స్పీకర్, దెందులూరులో చింతమనేని ఆధ్వర్యంలో నిర్వహణ
కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి యథేచ్ఛగా నిర్వహిస్తున్నా పోలీసుల ప్రేక్షకపాత్ర
సాక్షి, అమరావతి, నెట్‌వర్క్: ఇటు జూదం.. అటు మద్యం! కోట్లు వెదజల్లితే చాలు కోరినవన్నీ కూర్చున్న చోటకే! ఎక్కడ చూసినా పందెం కోళ్లు.. బెల్టు షాపుల కోలాహలం! గోవా, శ్రీలంక, బ్యాంకాక్ తదితర చోట్ల కళ్లు మిరుమిట్లు గొలిపే క్యాసినోలను మించి రాష్ట్రంలో కోడి పందేలు, జూద క్రీడలు బరి తెగించి విచ్చలవిడిగా సాగాయి. కోడి పందేల బరుల వద్ద మినీ బార్లు, మద్యం షాపులను తెరిచి యథేచ్ఛగా బెల్టు అమ్మకాలు సాగించారు.
హైకోర్టు ఉత్తర్వులను లెక్క చేయకుండా సంక్రాంతి సంబరాల ముసుగులో ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీ కూటమి పార్టీ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అడ్డూ అదుపు లేకుండా నిర్వహించారు. పోలీసులు అటువైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయలేదు. ఎన్నడూ లేనిది విజయవాడ నడిబొడ్డున రామవరప్పాడులో కోడి పందేలు, పేకాట, గుండాట జోరుగా నిర్వహించినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో సాగించిన ఈ పందేల విలువ ఏకంగా రూ.5 వేల కోట్లకుపైనే ఉంటుందని అంచనా. కోడిపందేల నిర్వహణ పూర్తిగా కూటమి ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలోనే సాగింది. చాలాచోట్ల నేరుగా కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొనగా కొన్నిచోట్ల వారి అనుచరులతో నిర్వహించారు. కోడి పందేలను భారీ ఆదాయ వనరుగా మార్చుకుని కూటమి నేతలు ఈ మూడు రోజులు విజృంభించారు. ఒక్కో బరిపై మూడు రోజుల్లో రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లు పిండుకున్నట్లు తెలుస్తోంది.
పోటాపోటీగా ‘గోదావరి’
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,200కిపైగా బరుల్లో కోడి పందేలు జరిగినట్లు తెలుస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే సుమారు 350 చోట్ల పందేలు నిర్వహించగా వాటిలో 120కిపైగా పెద్ద బరులున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 300కిపైగా పందేల బరులుండగా సుమారు వందకుపైగా పెద్ద బరులు ఏర్పాటు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ 320కిపైగా కోడి పందేల బరుల్లో పందేలు జరిగాయి.
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 150 వరకు బరులు ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని పెద్ద బరుల్లో రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలు.. ఆపైన మొత్తాలతో పందేలు నిర్వహించారు. చిన్న బరుల్లో రూ.10 వేల నుంచి రూ.2 లక్షల వరకూ పందేలు సాగాయి. కొన్నిచోట్ల రూ.కోటి, కోటిన్నర పందేలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోడి పందేలను స్వయంగా ఎమ్మెల్యేలే పోటాపోటీగా నిర్వహించడం గమనార్హం.
‘బరి’లో డిప్యూటీ స్పీకర్
పశ్చిమ గోదావరి జిల్లా పెద అమిరంలో భారీగా నిర్వహించిన కోడి పందేలకు అక్కడి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు నేతృత్వం వహించారు. 25 ఎకరాల్లో కోడి పందేల ప్రాంగణాన్ని ఆయన సిద్ధం చేయించారు. సినిమా సెట్టింగులను తలపించేలా దారి పొడవునా ఫ్లెక్సీలు, వేలాది మంది కూర్చునేలా కుర్చీలు, ప్రముఖుల కోసం వీఐపీ గ్యాలరీలు, సోఫా సెట్లు, ఎల్‌ఈడీ స్క్రీన్లు, ఫ్లడ్‌లైట్లతో ఒక ఉత్సవంలా పందేలను నిర్వహించారు.
చింతమనేని ‘మినీ స్టేడియం’
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సాధారణ కోడి పందేల్లా కాకుండా తన బరిని మినీ స్టేడియంలా సిద్ధం చేయించి అందులో పందేలు నిర్వహించారు. నియోజకవర్గంలోని దుగ్గిరాలలో జాతీయ రహదారికి ఆనుకుని ఏర్పాటైన ఈ పందేల బరులు కుంభమేళాను తలపిస్తున్నాయి.
సుమారు రూ.కోటికి పైగా వ్యయంతో నెల రోజులకు పైగా కార్మికులు శ్రమించి దీన్ని తయారు చేశారు. చిన్న పిల్లలు, మహిళలకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఎల్‌ఈడీ స్క్రీన్లు, వీఐపీలు రెస్ట్ తీసుకునేందుకు క్యారవాన్, పక్కనే కోసాట, గుండాడ ఒకటని కాకుండా అన్ని రకాల జూద క్రీడలు అక్కడ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.
కూటమి ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో..
పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం రూరల్ డేగాపురం, మహదేవపట్నం, సీసలి, ఆకివీడు, కొవ్వాడ, అన్నవరం, వీరవాసరం మండలం నౌడూరు, తాడేపల్లిగూడెం, యలమంచిలి మండలం కలగంపూడి, తణుకు తదితర ప్రాంతాల్లో భారీ బరులతో పందేలు నిర్వహించారు. డేగాపురంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు, తణుకులో ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ, సీసలిలో ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు దగ్గరుండి కోడి పందేలు వేయించారు.
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గండేపల్లి సమీపంలో కోడి పందేల బరులు ఏర్పాటు చేశారు. విస్సన్నపేటలో ఏకంగా కాకతీయ ప్రీమియర్ లీగ్ పేరుతో పందేల బరులు పెట్టారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని గ్రామాల్లో భారీగా కోడిపందేలు జరిగాయి. పామర్రు, కూచిపూడి, కోసూరు, పమిడిముక్కల, గడ్డిపాడు, గరికపర్రు, తోట్లవల్లూరు, కొమ్ముమూరు, పెదపారుపూడి, యలమర్రులో భారీ ఎత్తున పందేలు నిర్వహించారు. బాపట్ల జిల్లా తీరప్రాంతంలో కోడి పందేల బరులు ఏర్పాటు చేసి పందేలు నిర్వహించారు. చెరుకుపల్లి మండలం తూర్పుపాలెం, పిట్టలవానిపాలెం మండలం మంతెనవారి పాలెం, కొల్లూరు మండలం అనంతవరంలో ప్రధాన రహదారుల పక్కనే బరులు ఏర్పాట్లు చేశారు.
క్యారవ్యాన్లు.. మహిళా బౌన్సర్లు!
కోడి పందేల బరుల వద్ద భారీ సెట్టింగులతో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. చాలాచోట్ల వీవీఐపీలు, ముఖ్యులకు క్యారవ్యాన్ల సదుపాయం కల్పించారు. డ్రోన్లు, అత్యాధునిక కెమెరాలతో వీడియో, సీసీ కెమెరాలతో పర్యవేక్షించారు. పందేలు నిర్వహించే చోటే అన్ని రకాల మాంసాహారాలతో విందు భోజనాలు వడ్డించారు. బిర్యానీ పాయింట్లు, చికెన్ పకోడీ పాయింట్లు, ఇతర ఆహార పదార్థాలతో స్టాళ్లు ఏర్పాటయ్యాయి.
రాత్రి సమయాల్లోనూ నిరాటంకంగా పందేలు జరిగేందుకు ఫ్లడ్‌లైట్లు పెట్టారు. కోడి పందేలకు వచ్చిన వారి కార్లు, ద్విచక్ర వాహనాలతోనే ఆయా ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. జూద జన సందోహాలు, వాటిని వీక్షించడానికి వచ్చే వారితో కిటకిటలాడిపోయాయి. కొన్నిచోట్ల లోపలికి ప్రవేశించేందుకు రుసుము పెట్టారు. పెద్ద బరుల్లో టోకెన్లు జారీ చేసి అవి ధరించిన వారినే లోపలకు అనుమతించారు. ఇందుకోసం ప్రత్యేకంగా బౌన్సర్లను నియమించారు. కొన్నిచోట్ల మహిళా బౌన్సర్లు కూడా ఉండడం గమనార్హం.
బరుల వద్దే బార్లు, బెల్టు షాపులు
అన్ని బరుల వద్ద మద్యం బెల్టు షాపులు ఏర్పాటు చేయడంతో మందు ఏరులై పారింది. పెద్ద బరుల వద్ద ఏకంగా బార్లు తెరిచి అమ్మకాలు సాగించారు. వీఐపీల కోసం ప్రత్యేకంగా అందించే ఏర్పాట్లు చేశారు. యధేచ్చగా అమ్మకాలు సాగుతున్నా పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది కన్నెత్తి చూడలేదు.
బాపట్ల ‘బరి’లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు..
బాపట్ల జిల్లాలో సాక్షాత్తూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలే కోడిపందేలను నిర్వహించడమే కాకుండా స్వయంగా పాల్గొనడం గమనార్హం. రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం తూర్పుపాలెంలో 30 ఎకరాల బరిలో కోడిపందేలతో పాటు పలురకాల జూద క్రీడలు జరిగాయి. మంత్రి అనగాని సత్యప్రసాద్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, రాజ్యసభ మాజీ సభ్యుడు మోపిదేవి వెంకటరమణతో పాటు పలువురు సినీ నిర్మాతలు, రాజకీయ ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు.
బాపట్ల ఎమ్మెల్యే వేగ్నేశ నరేంద్రవర్మ ఆధ్వర్యంలో ఆయన బంధువులు మంతెన వారిపాలెంలో 40 ఎకరాల్లో పెద్ద బరి ఏర్పాటు చేసి కోడిపందేలు ఆడించారు. ఎమ్మెల్యే నరేంద్రవర్మ దగ్గరుండి మూడు రోజులపాటు పర్యవేక్షించడంతోపాటు స్వయంగా సొంత కోళ్లతో బరిలో నిలిచి పందెంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు వేమూరు నియోజకవర్గంలో ఐదు బరులు ఏర్పాటు చేయించి పందేలను స్వయంగా పర్యవేక్షించారు. అన్ని బరుల వద్ద మద్యం షాపులు ఏర్పాటు చేశారు.
అనకాపల్లిలో ఎంపీ సీఎం రమేష్ సమక్షంలో..
అనకాపల్లి జిల్లాలో కూటమి నేతలు విద్యాలయాన్నే కోళ్ల పందేలకు అడ్డాగా మార్చేశారు. దేవరాపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో పోలీసుల సమక్షంలోనే కోళ్లకు కత్తులు కట్టి మంగళవారం రోజంతా పందేలను నిర్వహించారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కోసం ప్రత్యేకంగా కోడి పందేలు జరిపించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు పేకాట, కోళ్ల పందేలు, బల్లాట తదితర జూద క్రీడలు నిర్వహించరాదని ఎస్పీ ముందుగానే ఆదేశాలు జారీ చేసినా ఎక్కడా లెక్క చేయలేదు. దేవరాపల్లి చరిత్రలో ఇంత విచ్చలవిడిగా కోళ్ల పందేలు జరగడం ఇదే తొలిసారి.
హోంమంత్రి ఇలాకాలో బెల్టు షాపులు, పందేలు..
ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రధానంగా హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి జిల్లా పాయకరావుపేటతో పాటు యలమంచిలి, మాడుగులలో ఇష్టారాజ్యంగా కోడి పందేలను నిర్వహించారు. అడ్డరోడ్డు, వేంపాడు టోల్‌ప్లాజా వద్ద విచ్చలవిడిగా జరిగాయి. హోంమంత్రి నియోజకవర్గంలోనే బెల్టు షాపులు, కోళ్ల పందేలు ఏర్పాటైనా పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది కన్నెత్తి చూడలేదు.
జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న యలమంచిలి నియోజకవర్గంలోని రామన్నపాలెం వద్ద లాటరీ బాల్‌తో పాటు బెల్టు షాపులకు వేలం నిర్వహించి మరీ అప్పగించారు. భీమిలి, పెందుర్తి, గాజువాక, అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం నియోజకవర్గాల్లో కూడా కోడి పందేలను నిర్వహించారు.
మురమళ్లలో హైటెక్ హంగులతో..
సంక్రాంతి సంప్రదాయాల ముసుగులో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గుండాటలు, అశ్లీల నృత్యాలు విచ్చలవిడిగా సాగాయి. ఐ.పోలవరం మండలం మురమళ్లలో స్టేడియాన్ని తలపించేలా ఏర్పాటు చేసిన భారీ బరి వద్ద ముమ్మిడివరం టీడీపీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో బుధవారం కోడి పందేలు జరిగాయి. ఆయనే స్వయంగా బరి వద్ద తిష్ట వేసి పందేలను పర్యవేక్షించారు.
అమలాపురం, కాకినాడ ఎంపీలు గంటి హరీష్ మాధుర్, తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ కూడా పందేలను ఆద్యంతం వీక్షించారు. రామచంద్రపురం, మండపేట, రాజోలు, కొత్తపేట, అమలాపురం, పి.గన్నవరం నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేల అండదండలతో పందేలు జోరుగా సాగాయి. అన్ని బరుల వద్ద గుండాటలు, జూద క్రీడలు యథేచ్ఛగా సాగాయి. జిల్లా మొత్తం మీద దాదాపు 110 కోడిపందేల బరులు ఏర్పాటు కాగా మురమళ్లలో హైటెక్ హంగులు, ఎల్‌ఈడీ స్క్రీన్లతో సిద్ధం చేశారు.
ఒక్క మురమళ్ల బరి వద్దే రూ.60 కోట్ల మేర పందేలు జరగ్గా జిల్లాలో మొత్తం రూ.300 కోట్ల మేర సాగినట్లు అంచనా. ఇక మామిడికుదురు మండలం గోగన్నమఠం, మలికిపురం మండలం కేశనపల్లితో పాటు అమలాపురంలో రికార్డింగ్ డ్యాన్సుల పేరుతో హద్దులు మీరి అశ్లీల నృత్యాలు ప్రదర్శించారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఆదేశాలతో పోలీసులు అటువైపు తిరిగి కూడా చూడలేదు.
వేంపల్లెలో మందుబాబుల ఘర్షణ..
వైఎస్సార్ కడప జిల్లా గిడ్డంగి వారి పల్లెలో మంగళవారం కోడిపందేల సందర్భంగా ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. గెలిచిన వారికి ఓడిపోయిన వారు కోడి ఇవ్వలేదని తాగిన మైకంలో గొడవ పడ్డారు. భోగి రోజు టి.వెలమ వారి పల్లె గ్రామంలో ఆటగాళ్లకు తాగేందుకు నీళ్లు ఏర్పాటు చేయలేదని దుర్భాషలకు దిగారు.
వర్షాలు సరిగా లేక రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు ఒడిగడుతున్న తరుణంలో గ్రామీణ ప్రాంతాల్లో కోడిపందేలు, జూదాలు లాంటివి నిర్వహించడంపై స్థానికులు మండిపడుతున్నారు. రామిరెడ్డి పల్లె, గిడ్డంగివారి పల్లె, ఎగువతువ్వపల్లె, అలవలపాడు గ్రామాల్లో పోలీసుల హెచ్చరికలను లెక్క చేయకుండా రెండు రోజులపాటు కోడి పందేలు కొనసాగించారు.
ఎన్నారై టీడీపీ నేత తోటలో..
అన్నమయ్య జిల్లా రాజంపేటలో సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన ఎన్నారై టీడీపీ నేతకు చెందిన తోటలో కోడి పందేలు జోరుగా సాగాయి. పల్లెల్లో ఎక్కడా పెద్దగా సంక్రాంతి కనిపించకపోయినా ఎన్‌ఆర్‌ఐ నేత తోటలో మాత్రం కోలాహలం నెలకొంది. రూ.లక్షల్లో జూదం సాగుతున్నా పోలీసులు అటువైపు తొంగి కూడా చూడలేదు. హద్దుల విషయంలో పుల్లంపేట, మన్నూరు పోలీసులు ఒక నిర్ణయానికి రాకుండా అది తమ పరిధిలోది కాదంటూ తప్పుకున్నారు.
⇒ చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం బండపల్లి పరిసర ప్రాంతాల్లో కోడి పందేలు జోరుగా సాగాయి. పందెం నిర్వహించే ప్రాంతాన్ని పూర్తిగా గ్రీన్ మ్యాట్‌తో కప్పేశారు. పందెం కాసేందుకు, తిలకించేందుకు వచ్చిన వ్యక్తుల నుంచి రూ.500 చొప్పున ప్రవేశ రుసుము వసూలు చేశారు.
⇒ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరంలో కోడి పందేల్లో గెలుపొందిన విజేతలకు రెండు బులెట్లతో పాటు నాలుగు బైకులను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చేతుల మీదుగా నిర్వాహకులు అందజేశారు.
ఫొటో: జిడివి63 : విజేతలకు బులెట్‌ను అందజేస్తున్న ఎమ్మెల్యే రాము
⇒ తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నం, అమలాపురం రూరల్ మండలం కామనగరువులో కోడి పందేల విజేతలకు బుల్లెట్లు బహుమతులుగా అందించారు.
భీమవరంలో క్యాసినో.. డ్యాన్స్‌లు
ఉమ్మడి పశ్చిమ గోదావరిలో భారీ సినీ సెట్టింగులతో బరులు ఏర్పాటు చేసి ఫ్లడ్‌లైట్ వెలుగుల్లో రాత్రిపూట కూడా జాతరలా కోడి పందేలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో రూ.300 కోట్ల మేరకు కోడి పందాలు, జూదం కొనసాగినట్లు అంచనా. ప్రధానంగా తాడేపల్లిగూడెంలోని వెంకట్రామన్నగూడెం, ఉండి నియోజకవర్గంలోని సీసలి, పెదఅమిరం, భీమవరం నియోజకవర్గంలోని డేగాపురం, దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగిలో కోట్లల్లో పందాలు కొనసాగాయి. వెంకట్రామన్నగూడెంలో బుధవారం రూ.1.25 కోట్ల పందెం కొనసాగింది.
భీమవరం మండలంలో కోడిపందేల బరి వద్ద యువతుల రికార్డింగ్ డ్యాన్స్‌లు
తాడేపల్లిగూడెంలోని ప్రభాకర్‌కు చెందిన నెమలి పుంజు, రంగాపురం రత్తయ్యకు చెందిన రసంగి పుంజు 20 నిమిషాల పాటు హోరాహోరీగా తలపడ్డాయి. ప్రభాకర్‌కు చెందిన పుంజు విజేతగా నిలవడంతో రూ.1.25 కోట్లను కైవసం చేసుకున్నారు. దెందులూరు, భీమవరంలో, వెంకట్రామన్నగూడెంలో భారీ సెట్టింగులు ఏర్పాటు చేసి మద్యం, నాన్‌వెజ్‌తో సహా అన్ని సౌకర్యాలను శిబిరాల్లోనే ఏర్పాటు చేసి ప్రత్యేకంగా బౌన్సర్లను నియమించారు. క్యాసినో తరహాలో నగదు కాకుండా కాయిన్స్‌తో జూదాలు నిర్వహించారు.
వెంకట్రామన్నగూడెంలో మహిళా బౌన్సర్లను ప్రత్యేకంగా నియమించారు. చింతలపూడి, పోలవరం, కైకలూరు, ఉంగుటూరు, తణుకులో ఎమ్మెల్యేలు శొంగా రోషన్ కుమార్, చిర్రి బాలరాజు, కామినేని శ్రీనివాస్, పి.ధర్మరాజు, ఆరమిల్లి రాధాకృష్ణలు కోడి పందాలను ప్రారంభించి పరిశీలించారు. చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో అత్యధిక పందేలు గెలిచిన వారికి బుల్లెట్ బహుకరించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి పశ్చిమ గోదావరిలో బరుల సంఖ్య భారీగా పెరిగింది.
డ్యాన్స్‌లు.. క్యాసినో
భీమవరం మండలంలో కూటమి నాయకులు నిర్వహించిన కోడి పందేల బరి వద్ద మ్యూజికల్ నైట్ పేరుతో మహిళలతో డ్యాన్స్‌లు చేయించారు. భీమవరంలో గతంలో ఎన్నడూలేని విధంగా క్యాసినో జూదం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment