కోనసీమ జిల్లా మురమళ్లలో స్టేడియాన్ని తలపించేలా భారీ సెట్టింగుల మధ్య కోడిపందేలు
ఉమ్మడి గోదావరి జిల్లాల్లో హైటెక్ హంగులతో ఏర్పాట్లు
మినీ స్టేడియంలను తలపించేలా బరులు
ఎల్‌ఈడీ స్క్రీన్లు.. ఫ్లడ్‌లైట్ల కాంతుల నడుమ వీవీఐపీ గ్యాలరీలు
బరుల వద్దే జూదాల జాతర ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ పెద్దఎత్తున పందేలు
సాక్షి అమరావతి/నెట్‌వర్క్: సంక్రాంతి తొలిరోజునే రాష్ట్రవ్యాప్తంగా కోడి పందేల జాతర మొదలైంది. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో హైటెక్ హంగులు.. మినీ స్టేడియంలను తలపించిన బరుల్లో కోళ్లు కత్తులు దూశాయి. భారీ టెంట్లు.. వీవీఐపీ, వీఐపీ, సామాన్య జనానికి వేర్వేరుగా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. పందేలను తిలకించేందుకు వీలుగా కుర్చీలు.. సోఫాలు.. ఎయిర్ కూలర్లతో సౌకర్యవంతమైన ఏర్పాట్ల నడుమ ఫ్లడ్ లైట్ల వెలుగుల మధ్య పందేలు సాగాయి.
ప్రత్యేక ఎంట్రీ పాస్‌లు ఇచ్చి.. పందేల్లో తలపడిన కోళ్లు ప్రేక్షకులకు కన్పించేల భారీ ఎల్‌ఈడీ స్క్రీన్ల లైవ్ ఇచ్చారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోను పెద్దఎత్తున కోడి పందేలు సాగాయి. గతానికి మించిన భారీ ఏర్పాట్లతో కోళ్ల సమరం సాగింది. ఈ ఏడాది కోడి పందేల జాతర రాయలసీమ జిల్లాలకు పాకింది.
గోదావరి జిల్లాల్లో ఇలా..
ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలో జాతీయ రహదారి పక్కనే రూ.కోటి ఖర్చుతో కోడి పందేల బరిని మినీ స్టేడియాన్ని తలదన్నేలా నిర్మించారు. అక్కడ కోడి పందేలు వేసేవారికి.. వాటిని చూసేవారికి ప్రత్యేకంగా టోకెన్లు జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని గొల్లవానితిప్ప–డేగాపురం వద్ద హైటెక్ హంగులతో ఏర్పాటు చేసిన భారీ బరిలో కోడి పందేలు మొదలయ్యాయి. పందేలరాయుళ్లు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా బరులకు సమీపంలోనే కార్‌వేన్లు, రెస్ట్‌రూమ్‌ల సౌకర్యాలు కల్చించారు. బౌన్సర్లతో ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
ఉండి నియోజకవర్గంలోని పెదఅమిరం, సీసలి, మహాదేవపట్నం, ఆకివీడులో బరులను సినిమా సెట్టింగులను తలపించేలా తీర్చిదిద్దారు. ఇక్కడ ఓ బరిలో పందేలను ప్రారంభించేందుకు గోల్డ్ కాయిన్ తయారు చేయించి హెడ్ అండ్ టాస్ వేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 350 బరుల్లో కోడిపందేలు పోటాపోటీగా నిర్వహించారు. కోడిపందేలు, గుండాట కలిపి తొలిరోజు సుమారు రూ.250 కోట్లకు పైగా పందేలు జరిగాయని అంచనా. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పర్యవేక్షణలో ఐ.పోలవరం మండలం మురమళ్లలో 10 ఎకరాల లే–అవుట్‌లో భారీగా కోడిపందేలు, గుండాటలు నిర్వహించారు.
కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం నియోజకవర్గంలో 15 బరుల్లో సుమారు రూ.3 కోట్ల పందేలు జరిగాయని అంచనా. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో 30 బరులు ఏర్పాటు చేశారు. కరపలో మూడు రోజులపాటు నిర్వహించే 60 పందేల్లో ఎక్కువ పందేలు గెలిచిన వారికి బహుమతిగా రూ.25 లక్షల విలువైన తార్ జీపు, గురజనాపల్లి, గొర్రిపూడి బరుల్లో నాలుగు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌లను విజేతలకు బహుమతిగా ఇచ్చేందుకు సిద్ధం చేశారు.
బరిలోకి గుంటూరు
ఉమ్మడి గుంటూరు జిల్లాలోనూ భారీ ఏర్పాట్ల నడుమ కోడి పందేలు, జూద జాతరకు సోమవారమే శ్రీకారం చుట్టారు. బాపట్ల జిల్లా రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో భారీ ఎత్తున పందేలు మొదలయ్యాయి. మంతెనవారిపాలెంలో 40 ఎకరాల్లో భారీ బరి ఏర్పాటు చేశారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న రేపల్లె నియోజకవర్గంలోని తూర్పుపాలెం వద్ద 30 ఎకరాల్లో 6 బరులు ఏర్పాటయ్యాయి.
వేమూరు నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు బోస్‌నగర్, అనంతవరం, జంపని, చుండూరు మండలం కేఎన్ పల్లి, భట్టిప్రోలు మండలం పల్లకోన ప్రాంతాల్లో బరులు ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లాలో పందేలు తొలిరోజే జోరందుకున్నాయి. సంతనూతలపాడు మండలం వడ్డెపాలెం పరిసరాల్లో సోమవారం కోడి పందేలు జరిగాయి. ఒంగోలు పాతపాడు, కొత్తపట్నం మండలం మడనూరు, గామళ్లపాడులో పందేలు మొదలయ్యాయి.
‘సీమ’లోనూ కాలు దువ్విన కోడి
⇒ ఎకరాల్లో ప్రత్యేక బరి ఏర్పాటు చేశారు. ఇక్కడ కోడి పందేలు, క్యాసినో, కోత ముక్క ఆడించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విజయవాడ సమీపంలోని రామవరప్పాడు, ఎనికేపాడు, అంబాపురంలోనూ భారీ బరులు ఏర్పాటయ్యాయి. పెనమలూరు పరిధిలోని ఈడుపుగల్లు, గొడవర్రు, ఉప్పులూరు, పెద్దపులిపాకలో కోడి పందేలు జరిగాయి. నందిగామ, పామర్రు గుడివాడ, జగ్గయ్యపేట, పెడన, తిరువూరు, మచిలీపట్నం, మైలవరం నియోజకవర్గాల్లో భారీగా బరుల్లో కోడిపందేలు సాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment