మార్కులు, ర్యాంకులు లక్ష్యంగా కళాశాలలు, కోచింగ్ సెంటర్లు నిర్బంధ విద్యకు ఒత్తిడికి గురి చేస్తున్నాయి. విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడితో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ పరిస్థితులకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలతో పాటు కోచింగ్ సెంటర్ల కార్యకలాపాల పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో జిల్లా మానిటరింగ్ అండ్ సూపర్‌వైజింగ్ కమిటీ (డీఎంఎస్‌సీ)కి శ్రీకారం చుట్టింది. ప్రతి నెలా సమావేశాలు పెట్టి ఆయా కళాశాలలు, కోచింగ్ సెంటర్ల లోపాలపై చర్యలకు సిఫారసు చేస్తే ప్రభుత్వం వాటిపై చర్యలు తీసుకుంటుంది.
నెల్లూరు (టౌన్): బలవంతపు చదువులకు స్వస్తి చెబుతూ ప్రశాంత చదువులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పర్యవేక్షణ కమిటీలతో శ్రీకారం చుట్టింది. ఇంటర్ నుంచే జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్›డ్, నీట్, గ్రూప్స్ తదితర పోటీ పరీక్షల్లో మార్కులు, ర్యాంకుల కోసం విద్యార్థులపై బలవంతపు చదువులను రద్దుతున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఒక సర్వేలో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడిలకు లోనుకాకుండా ప్రశాంతంగా చదువుకునే విధంగా అనువైన పరిస్థితులను ఆయా కళాశాలల్లో కల్పించాలని భావించింది. రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల పర్యవేక్షణకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని జిల్లా ఇంటర్ బోర్డు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
జిల్లాలో మొత్తం 204 జూనియర్ కళాశాలలు ఉంటే.. వీటిల్లో ప్రభుత్వ యాజమాన్యం 65, ప్రైవేట్ 139 కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో మొత్తం 57,647 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం 28,510, ద్వితీయ సంవత్సరం 29,137 మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో 20కు పైగా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో సుమారు 4 వేల మందికి పైగా విద్యార్థులు వివిధ పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి జూనియర్ కళాశాలలను పునః ప్రారంభించారు. పరీక్షల్లో ర్యాంకుల కోసం ఉదయం 7 నుంచి రాత్రి 11 గంటల వరకు వీరిని చదివిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో విద్యార్థులు మానసిక ఒత్తిడి లోనవుతున్నారు.
డీఎంఎస్‌సీ కమిటీ ఏర్పాటు
జిల్లాలో జూనియర్ కళాశాలలు, కోచింగ్ సెంటర్లు పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో 10 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా మానిటరింగ్ అండ్ సూపర్‌వైజింగ్ కమిటీకి గౌరవాధ్యక్షులుగా కలెక్టర్ చక్రధర్‌బాబు వ్యవహరించనున్నారు. కమిటీ అధ్యక్షులుగా జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, కన్వీనర్‌గా జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి శ్రీనివాసులు, సభ్యులుగా ఆర్‌ఐఓ వరప్రసాదరావు, డీఈఓ రమేష్, డీఎంహెచ్‌ఓ పెంచలయ్య, సీడీపీఓ అనూరాధ, ఫుడ్‌సేఫ్టీ అధికారి నీరజ, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసరు జాషువా, మానసిక వైద్యులు డాక్టర్ క్రిష్టినా, మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్ రమ్య ఉంటారు. ఇప్పటికే కలెక్టర్ అధ్యక్షతన తొలి సమావేశం నిర్వహించారు.
కమిటీ విధి, విధానాలు
కమిటీ సభ్యులు ప్రతి నెలా జిల్లాలో 2 జూనియర్ కళాశాలల్లో తనిఖీలు నిర్వహించాలి. అక్కడ విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి తీసుకు వస్తున్నారనే కారణాలను గుర్తించాలి.
కళాశాలలు, కోచింగ్ సెంటర్లలో విద్యార్థులతో మమేకమై వారి సాధక బాధలను అడిగి తెలుసుకోవాలి. వారికి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలి, విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యాలతో మాట్లాడి ఆత్మహత్యల నివారణకు మార్గనిర్దేశం ఇవ్వాలి.
ఇంటర్ బోర్డు నిబంధనలను ఉల్లంఘించే కళాశాలలను గుర్తించాలి. వాటిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు నివేదించాలి.
ఇంటర్ విద్యలో సంస్కరణలను సూచించాలి. కళాశాల సందర్శన, పరిశీలన వివరాలతో కూడిన నివేదికను తయారు చేసి ప్రతి నెలా కలెక్టర్‌కు అందజేయాలి.
ప్రతి నెలా జేసీ అధ్యక్షతన కమిటీ సభ్యులు కలిసి సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంది. ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించాలి. అక్కడ గుర్తించిన సమస్యలు, వివరాలను సమావేశంలో వారి దృష్టికి తీసుకెళ్లాలి.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
ప్రభుత్వ నిబంధనలను ధిక్కరించే కళాశాలలను గుర్తించి వారిపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేస్తాం. ఆయా కళాశాలలు, కోచింగ్ సెంటర్లలో నాణ్యమైన భోజనాన్ని అందించాలి. విద్యార్థులకు పూర్తి స్థాయిలో అన్ని రకాల వసతులు కల్పించాలి. విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేయకుండా తరగతులు నిర్వహించాలి.
– ఎ.శ్రీనివాసులు, డీవీఈఓ, కమిటీ కన్వీనర్
Comments
Please login to add a commentAdd a comment