పట్టా పట్టు.. కొలువు కొట్టు | New Reforms in Higher Education System | Sakshi
Sakshi News home page

పట్టా పట్టు.. కొలువు కొట్టు

Published Sat, Aug 27 2022 12:10 PM | Last Updated on Sat, Aug 27 2022 12:20 PM

New Reforms in Higher Education System - Sakshi

చదువు పూర్తికాగానే ఉద్యోగం కల్పించే లక్ష్యంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందు కోసం ఉన్నత విద్యలో నూతన జాతీయ విద్యావిధాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. విద్యార్థి దశలోనే వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే దిశగా కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఇంజినీరింగ్‌లో అమల్లో ఉన్న ఇంటర్న్‌షిప్‌ ఈ విద్యా సంవత్సరం నుంచే డిగ్రీలో కూడా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సిద్ధపడిన విద్యార్థులను పరిశ్రమలతో మ్యాపింగ్‌ పూర్తి చేసింది.  

నెల్లూరు (టౌన్‌):   ఉన్నత విద్య చదివే విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. 2022–23 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను తప్పని సరి చేసింది. ఇప్పటికే ఇంజినీరింగ్‌లో ఇంటర్న్‌షిప్‌ ఉంది. డిగ్రీలో కూడా ఇంటర్న్‌షిప్‌ను అమలు చేస్తే విద్యార్థులు చదువు పూర్తి కాగానే సులభంగా ఉద్యోగ, ఉపాధి పొందే అవకాశం ఉంది. తద్వారా నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి ప్రభుత్వ లక్ష్యంగా పని చేస్తోంది.  

10 నెలల ఇంటర్న్‌షిప్‌ తప్పని సరి  
డిగ్రీలో 10 నెలల పాటు ఇంటర్న్‌షిప్‌ తప్పని సరి చేశారు. అకడమిక్‌ విద్యా సంవత్సరం ఉత్తీర్ణతతో పాటు ఇంటర్న్‌షిప్‌లో చూపిన ప్రతిభకు మార్కులు కేటాయించారు. కోర్సుకు సంబంధించిన పరిశ్రమలో చదువుతో పాటు అనుభవం సంపాదించడం, పరిశ్రమలతో అనుబంధం ఏర్పడేందుకు ఇంటర్న్‌షిప్‌ ఎంతో ఉపయోగపడుతోంది. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో రెండు సెమిస్టర్‌ పరీక్షలు అయిన తర్వాత 2 నెలలు పాటు కమ్యూనిటీ సర్వీసు ప్రాజెక్టు చేయాల్సి ఉంటుంది. ద్వితీయ సంవత్సరంలో 3, 4 సెమిస్టర్‌ పరీక్షలు పూర్తయిన తర్వాత 2 నెలల పాటు ఇంటర్న్‌షిప్‌ చేయాలి. డిగ్రీ తృతీయ సంవత్సరంలో 5వ సెమిస్టర్‌ పరీక్షలు పూర్తయిన తర్వాత 6 నెలల పాటు ప్రాజెక్టు వర్క్‌ చేయాల్సి ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 4 ఏళ్లు డిగ్రీ కోర్సు అమలు చేయనున్నట్లు ఉన్నత విద్య అధికారులు చెబుతున్నారు. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు కోర్సును బట్టి (ఉదాహరణకు బీఏ హానర్స్‌ పేరుతో) సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు.  

8,964 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ 
జిల్లాలో మొత్తం 74 ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో ప్రభుత్వ–10, ఎయిడెడ్‌–3, ప్రైవేట్‌– 61 కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో డిగ్రీ 3 సంత్సరాలు కలిపి మొత్తం 45 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు.  ఇంటర్న్‌షిప్‌ కోసం విద్యార్థులు లెర్నింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం పోర్టల్‌ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 13,547 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 8,964 మంది విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌కు పోర్టల్‌లో పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 3,883 మంది విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌కు ఆయా పరిశ్రమలు, సంస్థలతో మ్యాపింగ్‌ చేసుకోవడం జరిగింది. మిగిలిన విద్యార్థులు కూడా పోర్టల్‌లో పేర్లను నమోదు చేసుకునేందుకు వర్సిటీ అధికారులు చర్యలు చేపట్టారు. ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్‌తో విద్యార్థుల డేటాను తెప్పించి వర్సిటీలోనే నమోదు చేయిస్తున్నారు. ఇంటర్న్‌షిప్‌ మీద కళాశాలల యాజమాన్యాలతో పాటు ప్రిన్సిపల్స్‌కు కూడా వర్సిటీ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.   

జిల్లా స్థాయిల్లో పర్యవేక్షణ కమిటీలు
నూతన విద్యా విధానాన్ని పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి కమిటీలో చైర్మన్‌గా కలెక్టర్, మెంబర్‌గా వర్సిటీ వైస్‌ చాన్సలర్, మెంబర్‌ సెక్రటరీగా జాయింట్‌ కలెక్టర్, అడిషనల్‌ మెంబరు సెక్రటరీగా వర్సిటీ రిజిస్ట్రార్, మెంబర్లుగా డీఐఈపీసీ జనరల్‌ మేనేజర్, డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, విజ్ఞాన్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ (చేజర్ల), కృష్ణచైతన్య ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ప్రిన్సిపల్, ఆదానీ విల్‌మర్, సీమెన్స్‌గమేసా, ఆదానీపోర్ట్, ఐఆర్‌సీఎస్‌ చైర్మన్, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్, బీఎం   ఆర్‌ గ్రూపు జీఎంలు ఉన్నారు.  

ఇంటర్న్‌షిప్‌కు అవకాశం
డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ కోసం తిరుపతి జిల్లా కలెక్టర్‌తో సమావేశ అనంతరం పరిశ్రమలు, సచివాలయాలు, ఆర్బీకేలు, శ్రీసిటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ తదితర విభాగాల్లో 4 వేల మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశాన్ని కల్పించారు. వచ్చే నెల 6న కమిటీ చైర్మన్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, పరిశ్రమలు, సంస్థల ప్రతినిధులతో మాట్లాడి మిగిలిన విద్యార్థులకు కూడా ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పించనున్నాం. 
– సుందరవల్లి, వైస్‌ చాన్సలర్, వీఎస్‌యూ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement