ఐబీ కరిక్యులం అంతర్జాతీయ ప్రతినిధులు ప్రశంస
అన్నమయ్య జిల్లాలోని జెడ్పీ ఉన్నత పాఠశాల సందర్శన
సంబేపల్లె: ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తోన్న విద్యా విధానాలు ఇంటర్నేషనల్ బాకలారియట్ (ఐబీ)కి దగ్గరగా ఉన్నాయని ఐబీ కరిక్యులం రూపకల్పన సభ్యులు కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి నుంచి ఐబీ సిలబస్ అమల్లోకి రానున్న దృష్ట్యా అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఐబీ కరిక్యులం రూపకల్పన సభ్యులు వెండిగీన్ (అమెరికా) ఎరిక్ బాబర్ (ఇంగ్లండ్) సందర్శించారు. వీరు నాడు–నేడు ద్వారా సమకూరిన తరగతి గదులు, ఇతర మౌలిక వసతుల గురించి ప్రధానోపాధ్యాయుడు నరసింహారెడ్డిని అడిగి తెలుసుకున్నారు.
పాఠశాలలో అమలవుతోన్న విద్యా విధానం, విద్యార్థుల అభ్యసన విధానంలో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ ఎలా దోహదపడుతున్నాయనేది పరిశీలించారు. ఉపాధ్యాయుల బోధన విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ట్యాబ్‌లను చూసి వాటిని ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసుకున్నారు. బైజూస్ ట్యాబ్స్, ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్, జగనన్న విద్యాకానుక, అమ్మఒడి, జగనన్న గోరుముద్ద పథకాల ద్వారా తాము ఏ విధంగా ప్రయోజనం పొందుతున్నామో విద్యార్థులు వీరికి వివరించారు. అంతర్జాతీయ ప్రతినిధులు పాఠశాలలోని జగనన్న గోరుముద్దను తిన్నారు.
పాఠశాలలో డిజిటల్ విద్య, ద్విభాష పాఠ్యపుస్తకాలు, లైబ్రరీ, యూనిఫామ్, భౌతిక, జీవనశాస్త్ర ప్రయోగశాలను పరిశీలించి ఉపాధ్యాయులను ప్రశంసించారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడంపై ప్రధానోపాధ్యాయుడిని అభినందించారు. ఎస్‌సీఈఆర్‌టీ అధ్యాపకుడు గిరిబాబు యాదవ్ మాట్లాడుతూ 2035కి పదోతరగతికి, 2037కి 12వ తరగతికి ఐబీ సిలబస్‌ను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని సదుపాయాలపై అధ్యయనం చేసేందుకు ఐబీ కరిక్యులం అంతర్జాతీయ ప్రతినిధులు ఏపీలోని పలు పాఠశాలలను సందర్శిస్తున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment