compulsory education
-
ప్రీ–మెట్రిక్ ఉపకార వేతనం 9, 10 తరగతులకే: కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలయ్యే ప్రీ మెట్రిక్ ఉపకార వేతన పథకాన్ని ఇకపై 9, 10వ తరగతి విద్యార్థులకే వర్తింపజేస్తామని కేంద్రం స్పష్టంచేసింది. గతంలో ఒకటి నుంచి పదో తరగతి దాకా మైనారిటీ విద్యార్థులకు ఈ పథకం కింద స్కాలర్షిప్ వచ్చేది. విద్యాహక్కు చట్టం ప్రకారం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు నిర్బంధ ఉచిత విద్య అమలవుతున్నందున వారికి ఉపకార వేతన ప్రయోజనాల అవసరం ఉండదని చెప్పుకొచ్చింది. ఇకపై స్కాలర్‌షిప్‌ల కోసం 9, 10 తరగతి విద్యార్థుల దరఖాస్తులనే పరిశీలించాలని రాష్ట్ర, జిల్లా నోడల్ అధికారులకు సూచించింది. దీనిపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ‘దశాబ్దాలుగా లబ్ధి పొందుతున్న పేద విద్యార్థులను ఆర్థికంగా మరింత కుంగదీసేలా బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా ఆగ్రహం వ్యక్తంచేశారు. -
నిర్బంధ విద్యపై నిఘా
మార్కులు, ర్యాంకులు లక్ష్యంగా కళాశాలలు, కోచింగ్ సెంటర్లు నిర్బంధ విద్యకు ఒత్తిడికి గురి చేస్తున్నాయి. విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడితో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ పరిస్థితులకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలతో పాటు కోచింగ్ సెంటర్ల కార్యకలాపాల పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో జిల్లా మానిటరింగ్ అండ్ సూపర్వైజింగ్ కమిటీ (డీఎంఎస్సీ)కి శ్రీకారం చుట్టింది. ప్రతి నెలా సమావేశాలు పెట్టి ఆయా కళాశాలలు, కోచింగ్ సెంటర్ల లోపాలపై చర్యలకు సిఫారసు చేస్తే ప్రభుత్వం వాటిపై చర్యలు తీసుకుంటుంది. నెల్లూరు (టౌన్): బలవంతపు చదువులకు స్వస్తి చెబుతూ ప్రశాంత చదువులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పర్యవేక్షణ కమిటీలతో శ్రీకారం చుట్టింది. ఇంటర్ నుంచే జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్›డ్, నీట్, గ్రూప్స్ తదితర పోటీ పరీక్షల్లో మార్కులు, ర్యాంకుల కోసం విద్యార్థులపై బలవంతపు చదువులను రద్దుతున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఒక సర్వేలో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడిలకు లోనుకాకుండా ప్రశాంతంగా చదువుకునే విధంగా అనువైన పరిస్థితులను ఆయా కళాశాలల్లో కల్పించాలని భావించింది. రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల పర్యవేక్షణకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని జిల్లా ఇంటర్ బోర్డు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో మొత్తం 204 జూనియర్ కళాశాలలు ఉంటే.. వీటిల్లో ప్రభుత్వ యాజమాన్యం 65, ప్రైవేట్ 139 కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో మొత్తం 57,647 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం 28,510, ద్వితీయ సంవత్సరం 29,137 మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో 20కు పైగా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో సుమారు 4 వేల మందికి పైగా విద్యార్థులు వివిధ పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి జూనియర్ కళాశాలలను పునః ప్రారంభించారు. పరీక్షల్లో ర్యాంకుల కోసం ఉదయం 7 నుంచి రాత్రి 11 గంటల వరకు వీరిని చదివిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో విద్యార్థులు మానసిక ఒత్తిడి లోనవుతున్నారు. డీఎంఎస్సీ కమిటీ ఏర్పాటు జిల్లాలో జూనియర్ కళాశాలలు, కోచింగ్ సెంటర్లు పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో 10 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా మానిటరింగ్ అండ్ సూపర్వైజింగ్ కమిటీకి గౌరవాధ్యక్షులుగా కలెక్టర్ చక్రధర్‌బాబు వ్యవహరించనున్నారు. కమిటీ అధ్యక్షులుగా జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, కన్వీనర్‌గా జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి శ్రీనివాసులు, సభ్యులుగా ఆర్ఐఓ వరప్రసాదరావు, డీఈఓ రమేష్, డీఎంహెచ్ఓ పెంచలయ్య, సీడీపీఓ అనూరాధ, ఫుడ్‌సేఫ్టీ అధికారి నీరజ, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసరు జాషువా, మానసిక వైద్యులు డాక్టర్ క్రిష్టినా, మహిళా సబ్ ఇన్స్పెక్టర్ రమ్య ఉంటారు. ఇప్పటికే కలెక్టర్ అధ్యక్షతన తొలి సమావేశం నిర్వహించారు. కమిటీ విధి, విధానాలు కమిటీ సభ్యులు ప్రతి నెలా జిల్లాలో 2 జూనియర్ కళాశాలల్లో తనిఖీలు నిర్వహించాలి. అక్కడ విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి తీసుకు వస్తున్నారనే కారణాలను గుర్తించాలి. కళాశాలలు, కోచింగ్ సెంటర్లలో విద్యార్థులతో మమేకమై వారి సాధక బాధలను అడిగి తెలుసుకోవాలి. వారికి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలి, విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యాలతో మాట్లాడి ఆత్మహత్యల నివారణకు మార్గనిర్దేశం ఇవ్వాలి. ఇంటర్ బోర్డు నిబంధనలను ఉల్లంఘించే కళాశాలలను గుర్తించాలి. వాటిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు నివేదించాలి. ఇంటర్ విద్యలో సంస్కరణలను సూచించాలి. కళాశాల సందర్శన, పరిశీలన వివరాలతో కూడిన నివేదికను తయారు చేసి ప్రతి నెలా కలెక్టర్‌కు అందజేయాలి. ప్రతి నెలా జేసీ అధ్యక్షతన కమిటీ సభ్యులు కలిసి సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంది. ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించాలి. అక్కడ గుర్తించిన సమస్యలు, వివరాలను సమావేశంలో వారి దృష్టికి తీసుకెళ్లాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ప్రభుత్వ నిబంధనలను ధిక్కరించే కళాశాలలను గుర్తించి వారిపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేస్తాం. ఆయా కళాశాలలు, కోచింగ్ సెంటర్లలో నాణ్యమైన భోజనాన్ని అందించాలి. విద్యార్థులకు పూర్తి స్థాయిలో అన్ని రకాల వసతులు కల్పించాలి. విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేయకుండా తరగతులు నిర్వహించాలి. – ఎ.శ్రీనివాసులు, డీవీఈఓ, కమిటీ కన్వీనర్ -
కాగితాల్లోనే నిర్బంధం !
వీరఘట్టం : బడిఈడు బాలలందరికీ నిర్బంధ విద్య అందించే లక్ష్యంతో రూపొందించిన విద్యా హక్కు చట్టం జిల్లాలో అమలుకు నోచుకున్న దాఖలాలులేవు. చదువు కావాలని కోరిన ప్రతి పిల్లవాడికి విద్యను హక్కుగా చేసి ఉచితంగా చదువు చెప్పించేలా ప్రతిష్టాత్మకంగా తెచ్చిన చట్టం అమల్లో ప్రభుత్వం ఒకఅడుగు ముందుకేస్తే నాలుగడుగులు వెనక్కి పడుతున్నాయి. కేంద్ర పభుత్వం 2010లో దేశ వ్యాప్తంగా అమల్లోకి తెచ్చిన రైటు టూ ఎడ్యుకేషన్ యాక్ట్ (ఆర్టీఈ-2009) కు బుజు పట్టింది. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలపై అటు ప్రభుత్వం, ఇటూ విద్యాశాఖాధికారులు దృష్టి సారించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆరేళ్ల నుంచి 14 ఏళ్ల లోపు బాలలను పాఠశాలలకే పరిమతం చేసి, బాలకార్మిక వ్యవస్థను సమూలంగా రూపుమాపే లక్ష్యంతో ఈ చట్టాన్ని రూపొందించారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను నిరుపేద, ఆల్పాదాయ వర్గాల పిల్లలతో ఉచితంగా భర్తీ చేయాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వం చట్టం అమలుకు ముందుకు రాకపోవడంతో విద్యాశాఖాధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు. చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే.. విద్యాభివృద్ధి లేనిదే సమాజాభివృద్ధి సాధించలే దని భావించిన కేంద్ర ప్రభుత్వం 2009 ఆగస్టు 27న విద్యా హక్కు చట్టాన్ని రూపొందించింది. ఎనిమిది నెలల తర్వాత 2010 ఏప్రిల్ ఒకటో తేదీన అమల్లోకి తెచ్చింది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన,పేద విద్యార్థులకు 25 శాతం రిజ్వరేషన్, ప్రభుత్వం గుర్తింపు లేకుండా పాఠశాలలు కొనసాగరాదనే ప్రధానాంశాలు చట్టంలో పొందుపరిచారు. అయితే వీటిలో ఏ ఒక్కటీ జిల్లాలో సక్రమంగా అమలు కాలేదు. చట్టం వచ్చిన ఐదేళ్ల కాలంలో జిల్లాలోని ఏ ఒక్క కార్పొరేట్ పాఠశాలలోనూ పేద విద్యార్థులతో 25 శాతం సీట్లను ఉచితంగా భర్తీ చేయలేదు. గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవడంలో సైతం అధికారులు విఫలమయ్యారు. పేదలపై ఫీజు భారం విద్యాహక్కు చట్టం సక్రమంగా అమలుకాకపోవడంతో పేద, ఆల్పాదాయ వర్గాల పిల్లలు అవస్థలు పడతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్న వారు వేలాది రూపాయలను ఫీజులుగా చెల్లిస్తున్నారు. చట్టం నిర్దేశించిన విధంగా జరిగితే ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను ఉచితంగా ఇవ్వడం ద్వారా పేద వర్గాల పిల్లలతో భర్తీ చేసిన పాఠశాలలకు ఆ మేరకు ఫీజులను ప్రభుత్వం చెల్లించాలని చట్టంలో పొందుపరిచారు. మరోవైపు చట్టంలో పొందుపర్చిన విధంగా ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవన నిర్మాణాలు చేపట్టి, పూర్తిస్థాయిలో సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండగా.. జిల్లాలో ఆ పరిస్థితి లేదు. -
పాఠశాలకు పట్టం
తెలంగాణలో నియోజకవర్గానికో ‘కేజీ టు పీజీ’ విద్యాక్షేత్రం 15 ఎకరాల విశాల ఆవరణలో స్కూలు, రూ. 54.56 కోట్లతో సకల సదుపాయాలు ప్రతి పాఠశాలలో వెయ్యి మందికి ప్రవేశాలు ఐదు వరకు తెలుగులో బోధన, ఆపై ఇంగ్లిష్ మీడియం వచ్చే ఏడాది 1, 3, 5, 7, 9 తరగతులు ప్రారంభం తర్వాతి విద్యా సంవత్సరంలో 2, 4, 6, 8, 10 క్లాసులు 2017 నుంచి ఏటా ఒకటో తరగతిలోనే ప్రవేశాలు ప్రభుత్వ పరిశీలనలో ‘కేజీ టు పీజీ’ ప్రణాళిక సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని భావిస్తున్న ‘కేజీ టు పీజీ’ నిర్బంధ ఉచిత విద్య పథకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనికింద నియోజకవర్గానికో పాఠశాలను ఏర్పాటు చేసి వెయ్యి మంది చొప్పున విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. 15 ఎకరాల విశాల ఆవరణలో హాస్టల్ సదుపాయంతో కూడిన స్కూలును నెలకొల్పేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో, ప్రాథమికోన్నత స్థాయిలో ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధనను ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. రాష్ర్ట సిలబస్‌నే అమలు చేయనున్న ఈ స్కూళ్లలో ఒకటి నుంచి ఐదు వరకు ప్రతి తరగతిలో రెండు సెక్షన్లు, 6 నుంచి పది వరకు ప్రతి తరగతిలో మూడు సెక్షన్లు ఉండాలని, ప్రతి సెక్షన్‌లోనూ 40 మంది విద్యార్థులకు ప్రవేశాలను కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు రాష్ర్ట విద్యా శాఖ సమగ్ర ప్రణాళికను రూపొందించింది. వీటి అమలు సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. ‘కేజీ టు పీజీ’ ప్రణాళికలోని ప్రధానాంశాలు వచ్చే ఏడాది 1, 3, 5, 7, 9 తరగతుల్లో, ఆ తర్వాతి సంవత్సరం(2016-17లో) 2, 4, 6, 8, 10 తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 2017-18 నుంచి ఏటా ఒకటో తరగతిలో మాత్రమే అడ్మిషన్లు ఉంటాయి. ఆ ఏడాది ఆరో తరగతిలో అదనంగా 40 మంది కొత్త వారిని మాత్రం తీసుకుంటారు. కో ఎడ్యుకేషన్ విధానం ఉంటుంది. బాలబాలికలకు ప్రవేశాలు కల్పిస్తారు. వేర్వేరు హాస్టల్ సదుపాయం ఉంటుంది. హాస్టళ్లలో మూడో తరగతి నుంచి ప్రవేశం కల్పిస్తారు. ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పిస్తారు. అడ్మిషన్ల విషయంలో డ్రాపవుట్(మధ్యలో బడి మానేసిన) విద్యార్థులకు తొలి ప్రాధాన్యం ఇస్తారు. వారిని గుర్తించి ఈ స్కూళ్లలో చేర్చుతారు. పాఠశాలల్లో ఆరోగ్యకర వాతావరణం కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు చేపడతారు. సకల మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. అవసరమైనంత మంది కొత్త టీచర్లను నియమిస్తారు. అర్హత కలిగిన పాత టీచర్లకూ సమగ్ర శిక్షణ ఇస్తారు. నియోజకవర్గాల్లో ఈ స్కూళ్లను ‘సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ’గా గుర్తిస్తారు. నిధుల కొరత లేకుండా చూస్తారు. హాస్టళ్లలో నాణ్యమైన భోజనం పెడతారు. అర్హత కలిగిన వంటగాళ్లను, హెల్పర్లను నియమిస్తారు. ఏపీ గురుకులాలు, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేసిన వారిని అవసరమైతే ఔట్‌సోర్సింగ్‌పై తీసుకుంటారు. నిఫుణుల సూచనల మేరకు 5వ తరగతి వరకు మాతృభాషలోనే బోధన ఉంటుంది. ఇంగ్లిష్‌కు ఏర్పడిన ప్రాధాన్యం దృష్ట్యా ఒకటో తరగతి నుంచే దాన్ని ఒక సబ్జెక్టుగా పెడతారు. ప్రాథమిక స్థాయిలో ఆంగ్ల బోధనపై ఎక్కువ దృష్టి పెడతారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో పాఠశాలలకు అవసరమైన భూసేకరణ జరుగుతుంది. అవసరమైతే ప్రైవేటు స్థలాలను సేకరిస్తారు. ఒక్కో స్కూల్ నిర్మాణం, నిర్వహణ వ్యయం కింద రూ. 54.56 కోట్లు వెచ్చిస్తారు. ఇందులో స్కూలు భవనానికి రూ. 9.13 కోట్లు, హాస్టల్‌కు రూ. 8 కోట్లు, ఉద్యోగుల క్వార్టర్లకు రూ.6.14 కోట్లు, వేతనాలు, డైట్ చార్జీలు, వసతుల కల్పనకు రూ. 9.28 కోట్లను కేటాయిస్తారు. ప్రతి స్కూలుకు 34 మంది ఉపాధ్యాయులను కేటాయిస్తారు. ప్రాథమిక స్థాయిలో 10 మంది, ప్రాథమికోన్నత స్థాయిలో 12 మంది, ఉన్నత పాఠశాల స్థాయిలో 12 మంది చొప్పున టీచర్లను నియమిస్తారు. 2016-17లో పదో తరగతి పూర్తి చేసుకునే వారు ఇంటర్మీడియెట్‌కు వెళ్లేలా అనుసంధానం చేస్తారు. అలా డిగ్రీ, పీజీ వరకు బోధన అందించే సమగ్ర క్యాంపస్‌లను అందుబాటులోకి తెస్తారు. -
బడులను బాగు చేద్దాం: కేసీఆర్
విద్యావేత్తలతో సమీక్షించి కొత్త విధానం అమలు చేద్దాం : సీఎం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాల విద్యావిధానాన్ని సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం త్వరలోనే కొత్త విధానాన్ని రూపొందించే కసరత్తు ప్రారంభించనున్నట్టు మంగళవారం ఆయన శాసనసభలో ప్రకటించారు. ‘ప్రేరేపితమో, అయాచితమో తెలియదుగానీ గతంలో పాఠశాల విద్య అంతా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లింది. ప్రభుత్వంలోని కొందరైతే కావాలనే ప్రైవేట్‌కు అనుకూలంగా వ్యవహరించారు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో నిరుపేదలు కూడా ప్రైవేట్ పాఠశాలల్లోనే పిల్లలను చేరుస్తున్నారు. ఉపాధ్యాయులను రేషనలైజ్ చేద్దామంటే ఉపాధ్యాయ సంఘాలు ఇబ్బందిగా భావిస్తున్నాయి. ఈ పద్ధతి మారాలి. అందుకే త్వరలో విద్యావేత్తలు, అన్ని పార్టీల సమక్షంలో సమీక్షించుకుందాం. ఏదో ఆదరాబాదరాగా కాకుండా పూర్తిస్థాయిలో దాన్ని నిర్వహించి అందరి సలహాల మేరకు ఓ విధానాన్ని నిర్దేశించుకుందాం. దాన్నే అమలు చేసుకుందాం’ అని ముఖ్యమంత్రి తెలిపారు. అస్తవ్యస్తంగా సర్కార్ బడులు ప్రభుత్వ పాఠశాలలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, వాటిని వెంటనే సరిదిద్దాలని బీజేఎల్పీ నేత లక్ష్మణ్ చేసిన సూచనకు సీఎం పై విధంగా స్పం దించారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు లాంటి అత్యవసర వసతులను కల్పిస్తే బాలికలు క్రమంతప్పకుండా పాఠశాలలకు వస్తారని, మురికివాడలలోని విద్యార్థుల్లో డ్రాపవుట్స్ ఉండరని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలకు వాచ్‌మ్యాన్, స్వీపర్లు ఉండేలా పోస్టులను బడ్జెట్లోనే మంజూరు చేయాలని కోరారు. నిర్బంధ విద్యపై త్వరలో నిర్ణయం.. కేజీ టూ పీజీ నిర్బంధ విద్యపై సభ్యులు తరచూ ప్రశ్నిస్తున్నందున దాని విధివిధానాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీఎం ప్రకటించారు. నిర్బంధ విద్య క్రమంగా ఆచరణలోకి వస్తుందన్నారు. దాన్ని ఒకటో తరగతి నుంచి అమలు చేయాలా, ఐదో తరగతి నుంచి ప్రారంభించాలా అనేది త్వరలో నిర్ణయిస్తామన్నారు. -
కేజీ టూ పీజీ నిర్బంధ విద్య
ఉపాధ్యాయ దినోత్సవంలో సీఎం కేసీఆర్ ఆకాంక్ష వచ్చే ఏడాది నుంచి ప్రారంభం ఏకీకృత సర్వీసు రూల్స్‌కోసం చర్యలు 12 ఏళ్ల తర్వాత మెుత్తం ఇంగ్లిష్ మీడియమే వస్తుంది.. సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది ఇంగ్లిష్ మీడియంలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను ప్రారంభిస్తామని, ఈ బృహత్తర పథకం ఉపాధ్యాయుల చేతుల్లో పెరిగే పాప కావాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో శుక్రవారం జరి గిన గురుపూజోత్సవంలో సీఎం ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థలను నియోజకవర్గానికి లేదా మండలానికి ఒకటి ప్రారంభిస్తామన్నారు. దీనిపై అందరి సల హాలు తీసుకుంటామన్నారు. అయితే తెలుగును కాపాడుకుంటూనే ప్రపంచస్థారుులో పోటీకి తట్టుకునే ఆంగ్ల మీడియంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఇందులో బోధిం చే టీచర్లకు ఎలాంటి శిక్షణ అవసరం, ఎంతకా లం అవసరమనే అంశాలను నిర్ణయించాల్సి ఉందన్నారు. ఇంగ్లిష్ ఏమీ బ్రహ్మ విద్య కాదని, గట్టిగా అనుకుంటే నేర్చుకోవడానికి ఆరు నెలలు చాలని అన్నారు. టీచర్లు గట్టిగా కృషిచేస్తే పక్కా గా ఇంగ్లిష్ మీడియంలో బోధన అందించవచ్చ న్నారు. చైనా కూడా పట్టుబట్టి ఇంగ్లిష్ నేర్పిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో క్రియాశీలమైందన్నారు. సిలబస్ నష్టపోయినా, ఆ తరువాత సెలవుల్లో పనిచేసి సిలబస్‌ను పూర్తిచేశారని, అదీ ఉపాధ్యా యుల అంకితభావానికి నిదర్శనమని ప్రశంసిం చారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ కోసం అవసరమైన చర్యలు చేపడతామన్నారు. గురువులు చదువు చెబితే బృహస్పతి అవుతార ని, చెప్పకపోతే శనిగ్రహం అవుతారన్నారు. ఈ కార్యక్రవుంలో మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట జెడ్పీ హైస్కూల్ టీచర్ యాదేశ్వరి బ్రెయిలీ లిపిలో రాసిన ‘కొత్తపల్లి జయశంకర్ చరిత్ర.. ఒడవని ముచ్చట’ పుస్తకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమెను సన్మానించా రు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోం మంత్రి నర్సింహారెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 87 మందికి నగదు, జ్ఞాపికలు, మెరిట్ సర్టిఫికెట్లు అందజేసి సన్మానించారు. గురువుల విద్యతోనే ఈ స్థారుుకి వచ్చా కార్యక్రవుంలో సీఎం కేసీఆర్ తన గురువులను గుర్తుచేసుకున్నారు. అందరి ముందు తాను ఇలా అనర్గళంగా మాట్లాడుతున్నానంటే అది తన గురువులు మృత్యుంజయశర్మ, రాఘవరెడ్డి అం దించిన జ్ఞానమేనన్నారు. వారుపెట్టిన అక్షర భిక్ష వల్లే తాను ఈ స్థాయికి ఎదిగానన్నారు. ఈ సం దర్భంగా వుహాభారతంలోని ఉత్తరగోగ్రహణం లో పేర్కొన్న పద్యాన్ని చదివి వినిపించారు. ఎం తో కఠినమైన ఆ పద్యాన్ని ఐదుసార్లు తరగతి గదిలోనే చూసి చదివి, ఆరోసారి చూడ కుండా అప్పగించేశానన్నారు. ఇప్పటికీ ఆ పద్యాన్ని మ రచిపోలేదంటే అది తన గురువులు అందించిన విద్య ఫలితమేనన్నారు. బాల వ్యాకరణం నుంచి మొదలుకొని సాహిత్యం వరకు అన్నీ నేర్పించారన్నారు. 9వ తరగతిలోనే ప్రబంధం, కావ్యం అం టే ఏంటో నేర్పారని, అప్పుడే చందోబద్ధమైన పద్యం రాయగలిగానంటే అది తనకు గురువులు అందించిన జ్ఞానమేనన్నారు. దుబ్బాక జెడ్పీ హైస్కూల్లో చదువుకున్నానని తెలిపారు. సర్వేపల్లికి సీఎం నివాళి ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి సీఎం కేసీఆర్ శుక్రవారం నివాళి అర్పించారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పైనున్న రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. టీచర్లను ప్రోత్సహించేలా ప్రభుత్వ విధానాలుండాలి: రఘువీరారెడ్డి సాక్షి, హైదరాబాద్: టీచర్లను ప్రోత్సహించేలా ప్రభుత్వాల చర్యలుండాలని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సూచించారు. రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఇందిర భవన్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. రాధాకృష్ణన్ చిత్రపటానికి పూల మాలలేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్వేపల్లిని ఆదర్శంగా తీసుకుని నేటితరం గురువులంతా వ్యవహరించాలని సూచించారు. -
2,325 మంది పిల్లలు బడికి దూరం
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: జిల్లాలో 2,325 మంది బడీడు పిల్లలు బడికి దూరంగా ఉన్నారని ఆర్వీఎం నివేదికలు వెల్లడిస్తున్నాయి. కాని వాస్తవంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఇది పొంతన లేని లెక్కేనని పరిశీలకులు చెబుతున్నారు. నిరుపేద పిల్లలకు విద్యను అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని అమలులోకి తెచ్చింది. చట్టం వచ్చి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇంత వరకు ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. రాజీవ్ విద్యా మిషన్ అధికారులు బడికి దూరంగా ఉన్న పిల్లలను గుర్తించేందుకు నిర్వహిస్తున్న సర్వేలు మొక్కుబడిగా ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో 2,325 మంది పిల్లలు బడికి దూరంగా ఉన్నారని పట్టణాల్లో 322 మంది పిల్లలు పాఠశాలలకు వెళ్లడం లేదని ఆర్వీఎం తన నివేదికలో పేర్కొంది. ఈ నివేదికకు, వాస్తవ పరిస్థితులకు ఏ మాత్రం పొంతన లేదని చెప్పవచ్చు. ఒక్క పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతాలలోనే వేలాదిగా బాలకార్మికులు వివిధ ప్రాంతాలలో పని చేస్తూ దర్శనమిస్తున్నారు. పని ప్రదేశాలలో తల్లిదండ్రులకు తోడుగా పిల్లలు పని చేయకుండా పని ప్రదేశంలోనే పాఠశాలలను నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయిస్తూవస్తోంది. ఈ నిధులతో పని ప్రదేశంలో ఉన్న పిల్లలకు విద్యా బోధన చేసేందుకు 20 మంది పిల్లలకు ఒక వలంటీర్‌ను నియమించనున్నారు. జిల్లాలో ప్రధానంగా ఒరిస్సా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు అధికంగా ఉండడంతో అదే భాషలో విధ్యాబోధన చేయించేందుకు వలంటీర్లను నియమించి గౌరవ వేతనంగా రూ.3 వేలు చెల్లిస్తారు. కాని రెండేళ్ళుగా వర్క్‌సైడ్ పాఠశాల నిర్వహణ కోసం నిధులు ఉన్నా అధికారులు పాఠశాలలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. అమలుకాని నిర్బంధ విద్య 6 నుంచి 14 సంవత్సరాలు గల పిల్లలకు ఉచిత విద్యను అందించాలనే ఉద్దేశంతో 2010 ఎప్రిల్ 1న బాలల ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని అమలులోకి తెచ్చారు. ఈ చట్టం ద్వారా కనీసం 8వ తరగతి వరకు ఉచిత విద్యను అందించాలనేది ప్రధాన ఉద్దేశం. బడికి దూరంగా ఉన్న పిల్లలను వారి వయస్సుకు తగిన తరగతిలో చేర్పించి ప్రత్యేక శిక్షణ ద్వారా విద్యను అందించి పాఠశాలలో కొనసాగేలా చూసే బాధ్యత సంబంధిత పాఠశాల హెచ్ఎంలతో పాటు స్థానిక విద్యా కమిటీలదేనని పేర్కొన్నారు. బడికి దూరంగా ఉన్న పిల్లలను చదవడం, రాయడం రాదనే కారణంతో పాఠశాలలో చేర్చుకునేందుకు నిరాకరించరాదని చట్టంలో పేర్కొన్నారు. చట్టాలు ఎన్ని ఉన్నా క్షేత్ర స్థాయిలో అమలు చేయకపోవడంతో ఆశించిన ఫలితాలు రాలేకపోతున్నాయి. బాలకార్మికుల సంఖ్య అధికమే.. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో బాలకార్మికులు దర్శనం ఇస్తున్నారు. ఇటుక క్వారీలు, క్రషర్ మిల్లర్స్, హోటల్స్, మెకానిక్ షెడ్లు, ఇలా ఎక్కడ చూసినా వారే కనిపిస్తున్నారు. బాలకార్మికులతో పని చేయించుకుంటే ఐదు సంవత్సరాలు జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించే ఆవకాశం ఉంది. కాని సాక్షాత్తూ కార్మికశాఖ అధికారులు ఉండే ప్రాంతాలలోనే బాల కార్మికులు దర్శనమిస్తున్నారు. సంగారెడ్డిలోని డిప్యూటీ లేబర్ కమిషనర్ కార్యాలయం సమీపంలోని వ్యాపార సంస్థలలో బాల కార్మికులు పనులు చేస్తున్నారు. నిత్యం ఈ ప్రాంతంలో కార్మిక శాఖ అధికారులు కార్యాలయాలకు వచ్చివెళ్ళే సమయాల్లో పని చేస్తూ కనిపిస్తున్నా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. ఇలా మెకానిక్ షెడ్లు, హోటల్లో పని చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో రోజురోజుకు బాల కార్మికుల సంఖ్య ఘననీయంగా పెరిగిందని చెప్పవచ్చు. -
వైఎస్ భిక్షతోనే రాజకీయాల్లోకి వచ్చా
సాక్షి, గుంటూరు: విద్యాహక్కు చట్టం అమల్లో భాగంగా ఆరు నుంచి 14 ఏళ్ల లోపు బాలబాలికలకు తప్పనిసరి విద్యను అందించేందుకు రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. చిన్నారులను బడిలో చేర్పించేందుకు తల్లిదండ్రుల సహకారం కూడా తప్పనిసరి. తల్లిదండ్రులకు బాధ్యతతో పాటు వారిని భాగస్వామ్యం చేసేందుకు రాజీవ్ విద్యా మిషన్ అధికారులు తరగతి నుంచి ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులను ఎంపిక చేసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కన్వీనర్‌గా మేనేజ్మెంటు కమిటీలను ఏర్పాటు చేసింది. వీరికి శిక్షణనిచ్చేందుకు ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు. అవగాహన కల్పించేందుకు మెటీరియల్ ముద్రించి ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. అయితేఈ నిధులు అధికభాగం దుర్వినియోగమవుతున్నాయే తప్ప లక్ష్యం నెరవేరడం లేదు. ఇటు రాజీవ్ విద్యామిషన్ అధికారులు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు స్పందన కరువైంది. జిల్లాలో 3,693 స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులతో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రతి తరగతికి ముగ్గురు పేరెంట్స్‌తో ప్రాథమిక, ప్రాథమికోన్నత, హైస్కూల్లలో కలిపి మొత్తం 3,693 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలకు రాజీవ్ విద్యామిషన్ నుంచి ఫండ్ సమకూరుస్తున్నారు. హైస్కూల్ కమిటీకి రూ.17 వేలు, ప్రాథమికోన్నత పాఠశాల కమిటీకి రూ.10 వేలు, ప్రాథమిక పాఠశాలకు రూ.5 వేలు ఇచ్చారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు శిక్షణ పేరుతో కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. గతేడాది రూ.కోటి ఖర్చు చేశారు. ఈ ఏడాది విద్యాహక్కు చట్టంపై పూర్తి అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులు నిర్వహించారు. అయితే ఈ తరగతుల నిర్వహణకు బిల్లులు సమర్పించనందున ఖర్చు ఎంతో తేలలేదు. హాజరైన విద్యార్ధుల తల్లిదండ్రులకు ఒక్కొక్కరికి రూ.130 వెచ్చించారు. స్కూల్ మేనేజ్మెంటు కమిటీల శిక్షణ తూతూ మంత్రంగా జరుగుతుందని విద్యా సంఘాల నేతలు పేర్కొంటున్నారు. మొక్కుబడిగా శిక్షణ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఐదేళ్లు నిండిన బాలబాలికలు జిల్లాలో 76,252 మంది గుర్తింపు.. ఐదేళ్లు నిండిన బాలబాలికలు జిల్లాలో 76,252 మందిని గుర్తించినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. వారిలో 76,057 మందిని పాఠశాలల్లో చేర్పించినట్లు విద్యాశాఖ అధికారుల చెప్పే లెక్కలు విస్మయం గొలుపుతున్నాయని పలువురు పేర్కొనడం గమనార్హం. బడి బయట బాలలు జిల్లాలో ఇంకా వేల సంఖ్యలోనే ఉంటారని అంచనా. ఏది ఏమైనా విద్యాహక్కు చట్టం అమలు మాత్రం బాలా రిష్టాలు దాటడం లేదనేది విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచే వినిపిస్తున్న మాట.