బడులను బాగు చేద్దాం: కేసీఆర్
విద్యావేత్తలతో సమీక్షించి కొత్త విధానం అమలు చేద్దాం : సీఎం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాల విద్యావిధానాన్ని సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం త్వరలోనే కొత్త విధానాన్ని రూపొందించే కసరత్తు ప్రారంభించనున్నట్టు మంగళవారం ఆయన శాసనసభలో ప్రకటించారు. ‘ప్రేరేపితమో, అయాచితమో తెలియదుగానీ గతంలో పాఠశాల విద్య అంతా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లింది.
ప్రభుత్వంలోని కొందరైతే కావాలనే ప్రైవేట్‌కు అనుకూలంగా వ్యవహరించారు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో నిరుపేదలు కూడా ప్రైవేట్ పాఠశాలల్లోనే పిల్లలను చేరుస్తున్నారు. ఉపాధ్యాయులను రేషనలైజ్ చేద్దామంటే ఉపాధ్యాయ సంఘాలు ఇబ్బందిగా భావిస్తున్నాయి. ఈ పద్ధతి మారాలి. అందుకే త్వరలో విద్యావేత్తలు, అన్ని పార్టీల సమక్షంలో సమీక్షించుకుందాం. ఏదో ఆదరాబాదరాగా కాకుండా పూర్తిస్థాయిలో దాన్ని నిర్వహించి అందరి సలహాల మేరకు ఓ విధానాన్ని నిర్దేశించుకుందాం. దాన్నే అమలు చేసుకుందాం’ అని ముఖ్యమంత్రి తెలిపారు.
అస్తవ్యస్తంగా సర్కార్ బడులు
ప్రభుత్వ పాఠశాలలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, వాటిని వెంటనే సరిదిద్దాలని బీజేఎల్పీ నేత లక్ష్మణ్ చేసిన సూచనకు సీఎం పై విధంగా స్పం దించారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు లాంటి అత్యవసర వసతులను కల్పిస్తే బాలికలు క్రమంతప్పకుండా పాఠశాలలకు వస్తారని, మురికివాడలలోని విద్యార్థుల్లో డ్రాపవుట్స్ ఉండరని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలకు వాచ్‌మ్యాన్, స్వీపర్‌లు ఉండేలా పోస్టులను బడ్జెట్‌లోనే మంజూరు చేయాలని కోరారు.
నిర్బంధ విద్యపై త్వరలో నిర్ణయం..
కేజీ టూ పీజీ నిర్బంధ విద్యపై సభ్యులు తరచూ ప్రశ్నిస్తున్నందున దాని విధివిధానాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీఎం ప్రకటించారు. నిర్బంధ విద్య క్రమంగా ఆచరణలోకి వస్తుందన్నారు. దాన్ని ఒకటో తరగతి నుంచి అమలు చేయాలా, ఐదో తరగతి నుంచి ప్రారంభించాలా అనేది త్వరలో నిర్ణయిస్తామన్నారు.