పాఠశాలకు పట్టం
తెలంగాణలో నియోజకవర్గానికో ‘కేజీ టు పీజీ’ విద్యాక్షేత్రం
15 ఎకరాల విశాల ఆవరణలో స్కూలు, రూ. 54.56 కోట్లతో సకల సదుపాయాలు
ప్రతి పాఠశాలలో వెయ్యి మందికి ప్రవేశాలు
ఐదు వరకు తెలుగులో బోధన, ఆపై ఇంగ్లిష్ మీడియం
వచ్చే ఏడాది 1, 3, 5, 7, 9 తరగతులు ప్రారంభం
తర్వాతి విద్యా సంవత్సరంలో 2, 4, 6, 8, 10 క్లాసులు
2017 నుంచి ఏటా ఒకటో తరగతిలోనే ప్రవేశాలు
ప్రభుత్వ పరిశీలనలో ‘కేజీ టు పీజీ’ ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని భావిస్తున్న ‘కేజీ టు పీజీ’ నిర్బంధ ఉచిత విద్య పథకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనికింద నియోజకవర్గానికో పాఠశాలను ఏర్పాటు చేసి వెయ్యి మంది చొప్పున విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. 15 ఎకరాల విశాల ఆవరణలో హాస్టల్ సదుపాయంతో కూడిన స్కూలును నెలకొల్పేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో, ప్రాథమికోన్నత స్థాయిలో ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధనను ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. రాష్ర్ట సిలబస్‌నే అమలు చేయనున్న ఈ స్కూళ్లలో ఒకటి నుంచి ఐదు వరకు ప్రతి తరగతిలో రెండు సెక్షన్లు, 6 నుంచి పది వరకు ప్రతి తరగతిలో మూడు సెక్షన్లు ఉండాలని, ప్రతి సెక్షన్‌లోనూ 40 మంది విద్యార్థులకు ప్రవేశాలను కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు రాష్ర్ట విద్యా శాఖ సమగ్ర ప్రణాళికను రూపొందించింది. వీటి అమలు సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది.
‘కేజీ టు పీజీ’ ప్రణాళికలోని ప్రధానాంశాలు
వచ్చే ఏడాది 1, 3, 5, 7, 9 తరగతుల్లో, ఆ తర్వాతి సంవత్సరం(2016-17లో) 2, 4, 6, 8, 10 తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 2017-18 నుంచి ఏటా ఒకటో తరగతిలో మాత్రమే అడ్మిషన్లు ఉంటాయి. ఆ ఏడాది ఆరో తరగతిలో అదనంగా 40 మంది కొత్త వారిని మాత్రం తీసుకుంటారు.
కో ఎడ్యుకేషన్ విధానం ఉంటుంది. బాలబాలికలకు ప్రవేశాలు కల్పిస్తారు. వేర్వేరు హాస్టల్ సదుపాయం ఉంటుంది.
హాస్టళ్లలో మూడో తరగతి నుంచి ప్రవేశం కల్పిస్తారు. ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పిస్తారు.
అడ్మిషన్ల విషయంలో డ్రాపవుట్(మధ్యలో బడి మానేసిన) విద్యార్థులకు తొలి ప్రాధాన్యం ఇస్తారు. వారిని గుర్తించి ఈ స్కూళ్లలో చేర్చుతారు.
పాఠశాలల్లో ఆరోగ్యకర వాతావరణం కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు చేపడతారు. సకల మౌలిక సదుపాయాలను కల్పిస్తారు.
అవసరమైనంత మంది కొత్త టీచర్లను నియమిస్తారు. అర్హత కలిగిన పాత టీచర్లకూ సమగ్ర శిక్షణ ఇస్తారు.
నియోజకవర్గాల్లో ఈ స్కూళ్లను ‘సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ’గా గుర్తిస్తారు. నిధుల కొరత లేకుండా చూస్తారు.
హాస్టళ్లలో నాణ్యమైన భోజనం పెడతారు. అర్హత కలిగిన వంటగాళ్లను, హెల్పర్లను నియమిస్తారు. ఏపీ గురుకులాలు, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేసిన వారిని అవసరమైతే ఔట్‌సోర్సింగ్‌పై తీసుకుంటారు.
నిఫుణుల సూచనల మేరకు 5వ తరగతి వరకు మాతృభాషలోనే బోధన ఉంటుంది. ఇంగ్లిష్‌కు ఏర్పడిన ప్రాధాన్యం దృష్ట్యా ఒకటో తరగతి నుంచే దాన్ని ఒక సబ్జెక్టుగా పెడతారు. ప్రాథమిక స్థాయిలో ఆంగ్ల బోధనపై ఎక్కువ దృష్టి పెడతారు.
జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో పాఠశాలలకు అవసరమైన భూసేకరణ జరుగుతుంది. అవసరమైతే ప్రైవేటు స్థలాలను సేకరిస్తారు.
ఒక్కో స్కూల్ నిర్మాణం, నిర్వహణ వ్యయం కింద రూ. 54.56 కోట్లు వెచ్చిస్తారు. ఇందులో స్కూలు భవనానికి రూ. 9.13 కోట్లు, హాస్టల్‌కు రూ. 8 కోట్లు, ఉద్యోగుల క్వార్టర్లకు రూ.6.14 కోట్లు, వేతనాలు, డైట్ చార్జీలు, వసతుల కల్పనకు రూ. 9.28 కోట్లను కేటాయిస్తారు.
ప్రతి స్కూలుకు 34 మంది ఉపాధ్యాయులను కేటాయిస్తారు. ప్రాథమిక స్థాయిలో 10 మంది, ప్రాథమికోన్నత స్థాయిలో 12 మంది, ఉన్నత పాఠశాల స్థాయిలో 12 మంది చొప్పున టీచర్లను నియమిస్తారు.
2016-17లో పదో తరగతి పూర్తి చేసుకునే వారు ఇంటర్మీడియెట్‌కు వెళ్లేలా అనుసంధానం చేస్తారు. అలా డిగ్రీ, పీజీ వరకు బోధన అందించే సమగ్ర క్యాంపస్‌లను అందుబాటులోకి తెస్తారు.