సాక్షి, గుంటూరు: విద్యాహక్కు చట్టం అమల్లో భాగంగా ఆరు నుంచి 14 ఏళ్ల లోపు బాలబాలికలకు తప్పనిసరి విద్యను అందించేందుకు రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. చిన్నారులను బడిలో చేర్పించేందుకు తల్లిదండ్రుల సహకారం కూడా తప్పనిసరి. తల్లిదండ్రులకు బాధ్యతతో పాటు వారిని భాగస్వామ్యం చేసేందుకు రాజీవ్ విద్యా మిషన్ అధికారులు తరగతి నుంచి ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులను ఎంపిక చేసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కన్వీనర్‌గా మేనేజ్‌మెంటు కమిటీలను ఏర్పాటు చేసింది. వీరికి శిక్షణనిచ్చేందుకు ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు. అవగాహన కల్పించేందుకు మెటీరియల్ ముద్రించి ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. అయితేఈ నిధులు అధికభాగం దుర్వినియోగమవుతున్నాయే తప్ప లక్ష్యం నెరవేరడం లేదు. ఇటు రాజీవ్ విద్యామిషన్ అధికారులు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు స్పందన కరువైంది.
జిల్లాలో 3,693 స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులతో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రతి తరగతికి ముగ్గురు పేరెంట్స్‌తో ప్రాథమిక, ప్రాథమికోన్నత, హైస్కూల్‌లలో కలిపి మొత్తం 3,693 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలకు రాజీవ్ విద్యామిషన్ నుంచి ఫండ్ సమకూరుస్తున్నారు. హైస్కూల్ కమిటీకి రూ.17 వేలు, ప్రాథమికోన్నత పాఠశాల కమిటీకి రూ.10 వేలు, ప్రాథమిక పాఠశాలకు రూ.5 వేలు ఇచ్చారు. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలకు శిక్షణ పేరుతో కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. గతేడాది రూ.కోటి ఖర్చు చేశారు. ఈ ఏడాది విద్యాహక్కు చట్టంపై పూర్తి అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులు నిర్వహించారు. అయితే ఈ తరగతుల నిర్వహణకు బిల్లులు సమర్పించనందున ఖర్చు ఎంతో తేలలేదు. హాజరైన విద్యార్ధుల తల్లిదండ్రులకు ఒక్కొక్కరికి రూ.130 వెచ్చించారు. స్కూల్ మేనేజ్‌మెంటు కమిటీల శిక్షణ తూతూ మంత్రంగా జరుగుతుందని విద్యా సంఘాల నేతలు పేర్కొంటున్నారు. మొక్కుబడిగా శిక్షణ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఐదేళ్లు నిండిన బాలబాలికలు
జిల్లాలో 76,252 మంది గుర్తింపు.. ఐదేళ్లు నిండిన బాలబాలికలు జిల్లాలో 76,252 మందిని గుర్తించినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. వారిలో 76,057 మందిని పాఠశాలల్లో చేర్పించినట్లు విద్యాశాఖ అధికారుల చెప్పే లెక్కలు విస్మయం గొలుపుతున్నాయని పలువురు పేర్కొనడం గమనార్హం. బడి బయట బాలలు జిల్లాలో ఇంకా వేల సంఖ్యలోనే ఉంటారని అంచనా. ఏది ఏమైనా విద్యాహక్కు చట్టం అమలు మాత్రం బాలా రిష్టాలు దాటడం లేదనేది విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచే వినిపిస్తున్న మాట.
వైఎస్ భిక్షతోనే రాజకీయాల్లోకి వచ్చా
Published Mon, Dec 16 2013 1:19 AM | Last Updated on Sat, Sep 15 2018 5:49 PM
Advertisement
Advertisement