బడికెళ్లని బాల్యం
Published Tue, Jan 28 2014 12:20 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: బడి ఈడు పిల్లలు పాఠశాలలకు వెళ్ళకుండా ఎక్కడ ఏపనిలో ఉన్నా వారిని బాలకార్మికులుగా పరిగణించాలని నిర్బంధ విద్యాహక్కు చట్టం స్పష్టం చేస్తోంది. ప్రతియేటా జూన్‌లో ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించి, విద్యా పక్షోత్సవాలు, వారోత్సవాల పేరుతో హడావుడి చేస్తుండటం మినహా తల్లిదండ్రులకు ఉపాధి చూపి తద్వారా బాలకార్మికులను పాఠశాలలకు పంపాలనే కనీస బాధ్యతను విస్మరిస్తోంది.
జిల్లాలో ఆరు నుంచి 14 ఏళ్ళలోపు వయసు కలిగిన బడిఈడు బాలలు 2,598 మంది ఉన్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతుండగా, క్షేత్రస్థాయిలో దీనికి రెట్టింపు సంఖ్యలో చిన్నారులు బాల కార్మికులుగా మగ్గుతున్నారని తెలుస్తోంది. గ్రామాల్లో పనులు లేక ఉపాధిని వెతుక్కుంటూ పేద కుటుంబాలు పట్టణాలు, నగరాలకు వలస వెళుతున్న కారణంగా వారి పిల్లలు విద్యకు దూరమవుతున్నారు. మరి కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు మరణించడంతో కుటుంబ బాధ్యతలు భుజానికెత్తుకోవాల్సి రావడం వల్ల చిన్నారులు బడికివెళ్లలేక పోతున్నారు.
ఒక్కో మండలంలో ఒక్కో విధంగా
జిల్లాలో మండలాల వారీగా ఎంఈవోలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సేకరించిన వివరాల ప్రకారం 2,598 మంది బాలలు బడికి దూరంగా మగ్గుతున్నారని తెలుస్తోంది. గత ఏడాది జూన్‌లో పాఠశాలలు తెరిచే సమయానికి జిల్లాలో 2881 మంది బాలలు బడికి దూరంగా ఉన్నట్టు రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) లెక్క తేల్చింది. అనంతరం నిర్వహించిన విద్యా పక్షోత్సవాల్లో వారిలో 2362 మందిని పాఠశాలల్లో చేర్పించామని అధికారులు చెబుతున్నారు.
వీరిలో దాదాపు వెయ్యి మంది బాలికలను కస్తూర్భాగాంధీ విద్యాలయాల్లో చేర్పించగా, మిగిలిన వారిని సమీప ప్రాంతాల్లోని పాఠశాలల్లో చేర్పించారు. అయితే తాజా లెక్కల ప్రకారం బడి ఈడు పిల్లలు 2,598 మంది ఉన్నారు. వీరిలో ఒక్కో మండలంలో ఒక్కో విధంగా ఉన్నారు. ఉదాహరణకు అత్యధికంగా బొల్లాపల్లిలో 154 మంది, చిలకలూరిపేటలో 142, రాజుపాలెంలో 134, నరసరావుపేటలో 132 ఉండగా, అత్యల్పంగా మాచర్లలో ఎనిమిది మంది, వట్టిచెరుకూరులో ఆరుగురు, తుళ్ళూరు, గురజాల, వేమూరులో నలుగురేసి చొప్పున ఉన్నారని ఆర్వీఎం లెక్కలు చెబుతున్నాయి.
అమ్మానాన్మలతో పాటే కూలిపనులకు..
అమ్మానాన్నలిద్ధరూ కూలిపనులకు వెళతున్నారు. వారితో పాటే నేనూ బేల్దారి పనికి వెళుతున్నా. ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్లనే పాఠశాలకు వెళ్ళడం లేదు. చిన్నప్పుడు ఒకటో తరగతి చదివినా ఇంట్లో సరిగా లేక మరలా స్కూల్ మానేశా. ఇప్పుడు మళ్ళీ చదవాలని లేదు. - యు. శ్రీను, గుంటూరు
పనికి వెళుతున్నా..
నాన్న ఆటోడ్రైవర్ అమ్మ ఇం ట్లోనే ఉంటుంది. నాన్న ఒక్క డి వల్ల ఇల్లు గడవదని, నేనూ పని కి వెళుతున్నా. తమ్ముడిని చదువుకోమని హాస్టల్‌కు పంపాం. - టి. ప్రదీప్, గుంటూరు
Advertisement
Advertisement