తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనుల ప్రతిపాదనలను అధికారులు తీరిగ్గా ఇప్పుడు పంపడంతో పనులు
వీరఘట్టం:తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనుల ప్రతిపాదనలను అధికారులు తీరిగ్గా ఇప్పుడు పంపడంతో పనులు ఎప్పటికి జరుగుతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. నాలుగేళ్లుగా ఆయకట్టు రైతులు ఆధునికీకరణ కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో రూ.139 కోట్లతో ప్రతిపాదించిన తోటపల్లి కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణ పనులకు పాలకొండ మండలం నవగాం వద్ద అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా మూడేళ్ల కిందట రూ.7 కోట్లతో పనులు ప్రారంభించారు. అలాగే ఓనిగెడ్డ వద్ద రూ.7 కోట్లతో చెక్‌డ్యామ్ నిర్మాణం చేపట్టారు. మిగిలిన రూ.124 కోట్లతో ఇప్పుడు ప్రతిపాదనలు రూపొందించి ఫైలును రెండు రోజుల క్రితమే ప్రభుత్వానికి పంపించినట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది.
కాగితాలకే పరిమితం
ఆధునికీకరణ పనులకు గతంలో ఆమోదించిన ప్రతిపాదనలే కార్యరూపం దాల్చలేదు. వాటిని పట్టించుకోకుండా అధికారులు కొత్త ప్రతిపాదనలు సిధ్ధం చేశారు. ఎప్పటికప్పుడు చేస్తున్న ప్రతిపాదనలు కాగితాలకు పరిమితమవుతున్నాయే తప్ప పనులు జరగడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. గత నాలుగేళ్లుగా కుడి, ఎడమ కాలువల ద్వారా ఆయకట్టు భూములకు సాగునీరు నామమాత్రంగా అందుతోంది. ఆధునీకరణ ప్రక్రియ తెరపైకి రావడంతో కాలువల నిర్వహణను, చిన్న చిన్న మరమ్మతులను సైతం అధికారులు గాలికొదిలేశారు. దీంతో కాలువల పరిస్థితి దయనీయంగా మారింది. తుప్పలు, పూడికలతో నీరు చివరి ప్రాంతానికి చేరడం గగనమవుతోంది. 32 కి లోమీటర్ల పొడవున్న ఎడమ కాలువ, 20 కిలోమీటర్ల పొడవున్న కుడి కాలువలో రెండు అడుగుల మేర పూడిక పేరుకుపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రతిపాదనలు పంపితే పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు.. ఖరీఫ్‌కు ఎలా నీరి
స్తారని రైతులు ఆందోళనతో ప్రశ్నిస్తున్నారు.