నాగావళి పర్వత శ్రేణులను ఆనుకుని ఒక అందమైన అడివి వుంది. ఆ అడివిలో పెద్ద పెద్ద మర్రి, టేకు, మద్దిలాంటి వృక్షాలు ఉన్నాయి. మామిడి, నేరేడు, జామ, వెలగ లాంటి పండ్ల చెట్లు ఉన్నాయి. పర్వత శ్రేణుల నుంచి వచ్చిన జలపాతాలు సరస్సులుగా, సెలయేర్లుగా ఆ అడివిలో అక్కడక్కడ నిర్మితమై ఎంతో ప్రకృతి శోభను తెచ్చాయి. ఆ అడవికి సంజయుడు అనే మృగరాజు రాజుగా వున్నాడు. సంజయుని పాలనలో అన్ని జంతువులూ ఏ భయం లేకుండా నివసిస్తున్నాయి. కానీ మహారాజుకు సంతానం లేదనే బాధ అందరిలోనూ ఉంది. కొంత కాలానికి రాజుకు మగ సంతానం కలిగింది. మృగరాజు, భార్య సివంగి ఎంతో సంతోషించారు. అడవిలో జంతువులన్నీ పండుగ చేసుకున్నాయి. నామకరణం, పుట్టినరోజులు ఇలా చిన్న మృగరాజుకు జరిపాక, ఇక చిన్ని మృగరాజుకు చదువు నేర్పించాలని తలచాడు సంజయ మృగరాజు. కానీ లేక లేక కలిగిన సంతానం అతి గారం వలన చిన్ని మృగరాజు పెంకిగా తయారయ్యాడు. చిన్ని మృగరాజుకు విద్య నేర్పడానికి అడివిలో తెలివైన ఏనుగు, లేడి, ఓ కుందేలు, నక్క నియమించబడ్డాయి. అవి ఎంతో ఓర్పుగా చిన్ని మృగరాజుకు పాఠాలు చెప్పసాగాయి. అయితే చిన్ని మృగరాజు వింటేగా! ఏనుగు పైకెక్కి కూర్చోడం, నక్కను ఏడిపించడం, కుందేలును కొట్టడం లాంటి పనులు చేస్తూ .. అసలు పాఠాలు వినేవాడు కాదు. దాంతో అవి అన్నీ రాజుని కలిసి చిన్ని రాజుకు పాఠాలు చెప్పడం మావల్ల కాదని చెప్పేసాయి.సంజయ రాజుకు మరలా విచారం పట్టుకుంది. తాను రాజుగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. తన తరువాత తన కొడుకు కూడా అలాగే అవ్వాలని తలచినా, చిట్టి మృగరాజు ఇలా తయారవడం బాధ కలిగించింది.
అప్పుడు ఆ అడివిలో ఉండే ఒక కోతి రాజును కలసి ‘మహారాజా! మీ కుమారుని కోసం మీరు బెంగ పెట్టు కోవద్దు. ఒక ఆరు నెలలు చిన్ని రాజుని నాకు వదలి పెట్టండి. నేను ప్రయోజకుని చేసి మీకు అప్పగించుతాను’ అంది. ఏ పుట్టలో ఏ పాము వుందో .. మిగిలిన జంతువులు కూడా రాజుకు, కోతితో చిన్ని రాజుని పంపండి. అంతగా కాకపోతే అప్పుడే వేరొక మార్గం ఆలోచిద్దాం అన్నాయి. విధిలేని పరిస్థితిలో రాజు, చిన్ని రాజును కోతికి అప్పగించాడు. ‘‘నువ్వా .. నాకు పాఠాలు చెప్పేది’’ అన్నాడు చిన్ని రాజు. ‘‘పాఠలా .. మరేమన్నానా .. నాకే ఏమీ రావు. ఇక మీకు చెప్పేది ఏమున్నది. నేనలా అనక పోతే మిమ్మలి వేరొక ఆడవికి పంపే ఆలోచనలో వున్నారు మహారాజు .. అందుకే ఇలా చెప్పాను. ఈ ఆరు నెలలూ మన మిద్దరం ఆడుతూ పాడుతూ గడిపేద్దాము. తరువాత సంగతి తరువాత’’ అంది కోతి.కోతి మాటలు చిన్ని రాజుకు బాగా నచ్చాయి. రెండూ కలసి అడివి లోకి పోయాయి. చెట్లు ఎక్కాయి. ఉయ్యాలలు ఊగాయి. సరస్సులలో స్నానాలు చేశాయి. చిన్నిరాజుకి కోతి బాగా నచ్చేసింది. ఇలా వారంలో ఆరు రోజులు గడిచాయి. అప్పుడు కోతి ‘‘చిన్ని రాజా మనం అప్పుడే ఆరు రోజులు ఆట పాటలతో కాలం గడిపాము. రేపు మహారాజు ‘మా చిన్ని రాజుకు నీవు ఏం నేర్పావు’ అంటే నేనేమీ చేప్పగలను.నేనేమీ చెప్పలేదు అంటే నా నుండి నిన్ను దూరం చేసి వేరే ఆడవికి పంపుతారు. కనుక ఈ ఒక్క రోజు నేను చెప్పిన పాఠం విని రేపు అందరి ముందు చెప్పేయి దానితో ఈ గండం గడుస్తుంది.తరవాత నుండి మరలా మామూలే .. మన ఆటలు.. పాటలు’’ అంది కోతి. కోతి చెప్పింది కూడా నిజమే అని తలచాడు చిన్ని రాజు. బుద్ధిగా కోతి నేర్పిన పాఠాలు నేర్చుకున్నాడు . పద్యాలు వల్లె వేశాడు. మరుసటి రోజు కోతి , చిన్ని రాజుని తీసుకుని సభకు వెళ్లింది. జంతువులన్నీ కోతి పని అయిపోయింది. ఈ వారం రోజులూ అది చిన్ని రాజుతో ఆడిన ఆటలు పాటలు అన్నీ చూశాయి. పెద్ద పెద్ద గురువులు చెప్పలేనిది తగుదునమ్మా అనుకుంటూ .. నేను పాఠం చెబుతానని తయారయింది అనుకున్నాయి. మహారాజు సంజయుడు చిన్ని రాజుని పక్కన కూర్చో బెట్టుకుని ‘‘చిన్నా .. నీవేమీ నేర్చుకున్నావు మీగురువు నీకేమి నేర్పారు?’’ అని అడిగాడు.
ముందురోజు నేర్చుకున్న పద్యాలను పాడాడు చిన్ని మృగరాజు. ఎవరైనా మీదకు వస్తే ఎలా తప్పించుకోవాలో చేసి చూపాడు. మాటు వేసే వేటాడే పద్ధతులు చూపించాడు. ‘‘శహబాష్..’’ అంటూ చప్పట్లు కొట్టాడు మృగరాజు. కోతికి అనేక బహుమానాలు ఇచ్చాడు. ‘‘మహారాజా! .. ఇది కొంత మాత్రమే. నాకు ఇచ్చిన ఆరు నెలల గడువులో మీ చిన్ని రాజుని మీ అంత వాడిగా చేస్తాను’’ అంది కోతి. మిగిలిన జంతువులు కూడా కోతిని ప్రశంసించాయి. అక్కడ నుండి సెలవు తీసుకుని చిన్ని రాజుని తీసుకుని సెలయేరు దగ్గరకు పోయింది కోతి. ‘‘ చిన్నిరాజా..! ఈ చదువులతో .. విసుగు వచ్చింది. పద కాసేపు అదువుకుందాం అంది. రెండూ కలసి బాగా ఆడుకున్నాయి. వారం తరువాత ‘‘ఈసారి చదువుకు రెండూ రోజులు కేటాయిద్దాము’’ అంది కోతి. మరలా ఆ రెండు రోజులు చదువులో పడిపోయాడు చిన్నిరాజు.మరలా రాజు దగ్గర సభలో ఈసారి రెట్టించిన ఉత్సాహంతో పాఠాలు వినిపించాడు. మహారాజు , అన్నీ జంతువులు చిన్ని రాజుని, కోతిని తెగ పొగిడాయి. చిన్ని రాజుకు చాలా గర్వంగా అనిపించింది. అప్పుడు అంది కోతి ‘‘ చిన్ని రాజా! వారం లో రెండురోజులు చదివితేనే నీ కింత ఆదరణ లబిస్తోంది కదా! నువ్వు వారంలో ఒకరోజు ఆడుకుని మిగిలిన రోజులు చదువుకుంటే ఎంత గొప్పవాడివి అవుతావో ఊహించు’’ అంది. ‘‘అంతే కాదు నీకు మొదట విద్యా నేర్పడానికి వచ్చిన గురువులు చాలా తెలివైన వారు, వారి దగ్గర నేర్చుకుంటే నీకు చదువు ఇంకా బాగా వస్తుంది. పైగా నీవు ఈ అడవికి కాబోయే మహారాజువి.నిన్ను చూసి మిగిలివారు నేర్చు కోవాలి తెలిసిందా’’ అంది. కోతి మాటలతో చిన్ని రాజు జ్ఞానోదయం అయ్యింది. రాజుతో చెప్పి పెద్ద గురువుల దగ్గర విద్య నేర్చుకుంటానని తెలిపింది. ఆరోజు నుండి అందరితో వినయంగా వుంటూ ఆనతి కాలంలోనే అన్ని విద్యలూ నేర్చుకుంది. తనను మంచి మార్గంలో నిలిపిన కోతితో ఎప్పుడూ స్నేహంగా వుంటూ మంచి యువరాజుగా పేరు తెచ్చుకుంది.
- కూచిమంచి నాగేంద్ర
చిన్ని రాజు చదువు
Published Sun, Sep 23 2018 1:15 AM | Last Updated on Sun, Sep 23 2018 1:15 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment