ఉగ్ర నాగావళి
♦ ఒడిశాలో భారీ వర్షాలు ∙ఉగ్రరూపం దాల్చిన నాగావళి
♦ కొట్టుకుపోయిన రైల్వే వంతెన
♦ జలదిగ్బంధంలో విజయనగరం జిల్లాలోని నదీతీర గ్రామాలు
♦ తోటపల్లికి వరద పోటు
♦ 8 గేట్లు ఎత్తివేత
♦ కూనేరు వద్ద జాతీయ
♦ రహదారిపైకి వరద నీరు
♦ ఆంధ్రా–ఒడిశాకు నిలిచిన రాకపోకలు
♦ సమీక్షిస్తున్న అధికార యంత్రాంగం
ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలతో నాగావళి నది ఉగ్రరూపం దాల్చింది. తీర ప్రాంత గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద నీరు తాకిడికి తెరువళ్లి రైల్వే వంతెన కొట్టుకుపోవడం, కూనేరు వద్ద జాతీయ రహదారిపైకి నీరు చేరడంతో ఒడిశా–ఆంధ్రాలకు రైళ్లు, వాహన రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం స్తంభించింది. తోటపల్లికి వరద నీరు పోటెత్తడంతో 8 గేట్లు ఎత్తేశారు. వరి ఆకు, వెద పొలాలు నీట మునిగాయి. నీటి ప్రవాహం గంటగంటకూ పెరుగుతుండడంతో నదీతీర గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
కొమరాడ/జియ్యమ్మవలస/పార్వతీపురం టౌన్/కురుపాం/గరుగుబిల్లి: ఒడిశాలోని రాయగడ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నాగావళికి వరద నీరు పోటెత్తింది. ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. విజయనగరం జిల్లాలోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. జాతీయ రహదారిపైకి నీరు చేరడంతో ఒడిశా–రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఒడిశాలోని ఇంద్రావతి డ్యామ్ గేట్లు కొట్టుకుపోవడంతో వరద నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. రాయగడ నుంచి
తెరువల్లి రైల్వేస్టేషన్‌ల మధ్య ఉన్న వంతెన కొ ట్టుకుపోయింది. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. కొన్ని రైళ్లను దారిమళ్లించారు.
నీట మునిగిన పల్లెలు..
విజయనగరం జిల్లాలోని పలు పల్లెలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఒడిశా సరిహద్దు ప్రాంతమైన కూనేరు వద్ద జాతీయ రహదారిపైకి వరద నీరు చేరింది. దీంతో వాహనరాకపోకలు నిలిచిపోయాయి. కొమరాడ మండలంలోని పూర్ణపాడు, కళ్లికోట, దుగ్గి, గుణానపురం, నిర్వాసిత గ్రామమైన జియ్యమ్మవలస మండలం బాసంగిలోకి వరద నీరు చొరబడింది. కోటిపాం పంచాయతీ గుంప వద్ద ఉన్న శివాలయం నీటమునిగింది. బాసంగి గ్రామంలోని 385 కుటుంబాలకు, 250 మందికి మాత్రమే ఇళ్లపట్టాలు ఇచ్చారని, పల్లెను విడిచిపెట్టే పరిస్థితి లేకపోవడం వల్లే వరదనీటిలో చిక్కుకుపోయామంటూ గ్రామస్తులు గగ్గోలు పెట్టారు. బాసంగికి వచ్చిన తహసీల్దార్ భాస్కరరావు, ఇతర అధికారులను నిలదీశారు. గ్రామస్తులందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తోటపల్లికి వరద పోటు
నాగావళి నదిపై నిర్మించిన తోటపల్లి ప్రాజెక్టుకు వరదనీరు పోటెత్తింది. మధ్యాహ్నం 2 గం టలకు ఇన్‌ఫ్లో 1500 క్యూసెక్కులు కాగా, ఎనిమిదిగేట్లు నుంచి 21,965 క్యూసెక్కుల నీటిని కిందకు విడిచిపెట్టారు. సాయంత్రం 4 గంటలకు ఇన్‌ఫ్లో 22 వేల 500 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 29, 825, సాయంత్రం 5 గంటలకు ఇన్‌ఫ్లో 48,500, అవుట్ ఫ్లో 49,689 క్యూసెక్కులు, రాత్రి 11 గంటలకు ఇన్‌ఫ్లో 1, 35వేల క్యూసెక్కులుకాగా, లక్ష క్యూసెక్కుల నీటిని కిందకు విడిచిపెడుతున్నట్టు గరుగుబిల్లి తహసీల్దార్ రాధాకృష్ణ, ఎంపీడీవో పార్వతి, ప్రాజెక్టు అధికారులు ఎస్.పండు, సత్యంలు తెలిపారు.
అప్రమత్తమైన అధికార యంత్రాంగం
నాగావళిలో వరద నీరు పెరుగుతుండడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పార్వతీపురం ఆర్డీవో సుదర్శన దొర నాగావళి పరీవాహక పాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కూనేరు వద్ద నాగావళి నది ప్రవాహ ఉద్ధృతిని ప్రత్యక్షంగా పరిశీలించారు. వరద ఉద్ధృతి పెరిగితే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీచేశారు. వీఆర్వో, సెక్రటరీలను అప్రమత్తం చేశారు. సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐలు దినకర్, పాపారావు, సిబ్బంది లోతట్టు గ్రామాలకు చేరుకుని ప్రజలను అప్రమత్తం చేశారు. వరద నీటిలో చేపలు వేటాడే వారిని నిలువరించారు.
పార్వతీపురం ఐటీడీఏలో కంట్రోల్‌రూం ఏర్పాటు
పార్వతీపురం టౌన్: నాగావళి నదీ తీర గ్రామా ల ప్రజల కోసం పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో కంట్రోల్ రూంను ఏర్పాటుచేశారు. ప్రమాద సమయంలో ఫోన్: 08963221152 నండర్‌కు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. పూర్ణపాడు, దుగ్గి గ్రామాలు ముంపునకు గురయ్యాయని, ఆయా గ్రామాల ప్రజలకు కంట్రోల్ రూమ్ నుంచి సహాయం అందిస్తామని ఐటీడీఏ వర్గాలు తెలిపాయి.