
సాక్షి, అమరావతి: వంశధార– నాగావళి అనుసంధానం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ రెండు నదులను అనుసంధానం చేసి 42,053 ఎకరాలను సస్యశ్యామలం చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఈ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేసి.. జాతికి అంకితం చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. శ్రీకాకుళం జిల్లాలో బూర్జ మండలం నారాయణపురం వద్ద నాగావళి నదిపై 1959లో ఆనకట్ట నిర్మించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కుడి కాలువ కింద 18,362, ఎడమ కాలువ కింద 18,691 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే నాగావళిలో వరద ప్రవాహం సెప్టెంబరు నాటికే తగ్గుముఖం పడుతుండడం వల్ల ఆయకట్టు పంటలకు చివరలో నీళ్లందక ఎండిపోతున్నాయి. వంశధార వరద జలాల మళ్లింపే సమస్యకు పరిష్కారంగా భావించిన ప్రభుత్వం ఆ దిశగా పనులను వేగవంతం చేసింది.
అనుసంధానం పనులు చకచకా..
► వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 ఫేజ్–2లో భాగంగా వంశధార నదిపై కాట్రగడ్డ వద్ద సైడ్ వియర్ నిర్మించి అక్కడి నుంచి వరద కాలువ ద్వారా సింగిడి, పారాపురం రిజర్వాయర్ల మీదుగా హిరమండలం రిజర్వాయర్‌కు వరద జలాలు తరలించే పనులు శరవేగంగా సాగుతున్నాయి.
► హిరమండలం రిజర్వాయర్ నుంచి 600 క్యూసెక్కుల సామర్థ్యంతో 33.583 కిమీల పొడవున హైలెవల్ కెనాల్ తవ్వి వంశధార జలాలను నారాయణపురం ఆనకట్ట జలవిస్తరణ ప్రాంతంలో నాగావళి నదిలోకి పోయడం ద్వారా రెండు నదులను అనుసంధానం చేసే పనులు చేపట్టారు.
► హైలెవల్ కెనాల్ కింద కొత్తగా ఐదు వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు నారాయణపురం ఆనకట్ట కింద 37,053 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు.
ఈ ఏడాదే ప్రారంభానికి సిద్ధం
► రూ.84.90 కోట్లతో చేపట్టిన ఈ పనుల్లో హైలెవల్ కెనాల్ తవ్వకం 25 కి.మీ.ల పూర్తయ్యాయి. 8.583 కి.మీ.ల పనులు చేపట్టాల్సి ఉంది. 66 నిర్మాణాలకునూ 31 పూర్తికాగా 35 పనులు చేపట్టాలి.
► ఈ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన రూ.50 కోట్లను విడుదలకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది.
► ఈ డిసెంబర్‌లోగా పనులను పూర్తి చేసి.. జాతికి అంకితం చేయాలని సర్కార్ నిర్ణయించింది.