సాక్షి, అమరావతి: వంశధార నదిపై నేరడి బ్యారేజీ నిర్మాణానికి ప్రయత్నిస్తూనే.. ఆ ప్రాజెక్టు ఫలాలను 2,55,510 ఎకరాల ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో ముందస్తుగా అందించడానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నడుం బిగించారు. గొట్టా బ్యారేజీ నుంచి హిరమండలం రిజర్వాయర్‌లోకి నీటిని తరలించే ఎత్తిపోతల పనులకు ఆమోదం తెలిపారు. గొట్టా బ్యారేజి జల విస్తరణ ప్రాంతం నుంచి వంశధార వరద జలాలను రోజుకు 1,400 క్యూసెక్కులు హిరమండలానికి తరలిస్తారు. దీనికి రూ.189 కోట్లు ఖర్చవుతుందని జల వనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. హిరమండలం రిజర్వాయర్‌ను నింపడం ద్వారా ఆయకట్టులో రెండు పంటలకు నీళ్లందిస్తారు. తద్వారా వెనుకబడిన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలు సస్యశ్యామలమవుతాయి.
వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మించి చెరో 57.5 టీఎంసీలు వాడుకొనేలా 1961 జూలై 18న ఏపీ, ఒడిశాల మధ్య ఒప్పందం కుదిరింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా 2005లో వంశధార స్టేజ్–2, ఫేజ్–2 చేపట్టారు. నేరడి బ్యారేజీ నిర్మించి రోజుకు 8 వేల క్యూసెక్కుల నీటిని 19.05 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే హీరమండలం రిజర్వాయర్‌లోకి తరలించే పనులు చేపట్టారు. దీనిద్వారా కొత్తగా 45 వేల ఎకరాలకు నీళ్లందించడంతోపాటు వంశధార స్టేజ్–1 కింద 2,10,510 ఎకరాలను స్థిరీకరిస్తారు. అయితే, నేరడి బ్యారేజీపై ఒడిశా సుప్రీం కోర్టుకు వెళ్లింది. దానిపై న్యాయపోరాటం చేస్తూనే ప్రాజెక్టు ఫలాలను ముందస్తుగా రైతులకు అందించడానికి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టు డిజైన్‌ను మార్చారు.
కాట్రగడ్డ వద్ద వంశధారపై 300 మీటర్ల పొడవున సైడ్ వియర్ నిర్మించి 1,700 క్యూసెక్కుల చొప్పున 8 టీఎంసీలను హిరమండలం రిజర్వాయర్‌లోకి తరలించే పనులు చేపట్టారు. 2009 నాటికే ఈ పనులు సింహభాగం పూర్తయ్యాయి. ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. ఈ క్రమంలోనే వంశధార ట్రిబ్యునల్ తుది నివేదిక ఇచ్చింది. నేరడి బ్యారేజీ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. వంశధార జలాలను సమంగా (57.5 టీఎంసీల చొప్పున) రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. దీన్ని ఒడిశా ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.
పూర్తి ఫలాలు అందించే దిశగా
ట్రిబ్యునల్ తుది నివేదికను అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రిని సీఎం వైఎస్ జగన్ పలుమార్లు కోరారు. ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి గతేడాది నవంబర్ 3న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చలు జరిపారు. ఓ వైపు నేరడి బ్యారేజీ నిర్మాణానికి ప్రయత్నిస్తూనే.. ప్రాజెక్టు పూర్తి ఫలాలను ముందస్తుగా అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
కాట్రగడ్డ సైడ్ వియర్ ద్వారా చేరే 1,700 క్యూసెక్కులకు అదనంగా గొట్టా బ్యారేజీ నుంచి మరో 1,400 క్యూసెక్కుల వరద జలాలను హిరమండలం రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. దీనిద్వారా వంశధారకు వరద ఉన్న రోజుల్లో గొట్టా బ్యారేజీ ద్వారా ఆయకట్టుకు నీటిని అందించి, వరద లేని రోజుల్లో హిరమండలం రిజర్వాయర్ ద్వారా నీరిస్తారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇప్పటికే వంశధార ప్రాజెక్టు కింద రబీ పంటలకు నీళ్లందిస్తున్నారు. హిరమండలం రిజర్వాయర్‌ను నింపడం ద్వారా రెండో పంటకు కూడా పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీళ్లందించనున్నారు.
వంశ‘ధార’ ఎత్తిపోతలకు సీఎం గ్రీన్ సిగ్నల్
Published Sun, May 15 2022 5:28 AM | Last Updated on Sun, May 15 2022 4:04 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment