Vamsadhara River
-
శ్రీకాకుళం: వంశధార నదికి పోటెత్తిన వరద
-
వంశ‘ధార’ ఎత్తిపోతలకు సీఎం గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: వంశధార నదిపై నేరడి బ్యారేజీ నిర్మాణానికి ప్రయత్నిస్తూనే.. ఆ ప్రాజెక్టు ఫలాలను 2,55,510 ఎకరాల ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో ముందస్తుగా అందించడానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుం బిగించారు. గొట్టా బ్యారేజీ నుంచి హిరమండలం రిజర్వాయర్‌లోకి నీటిని తరలించే ఎత్తిపోతల పనులకు ఆమోదం తెలిపారు. గొట్టా బ్యారేజి జల విస్తరణ ప్రాంతం నుంచి వంశధార వరద జలాలను రోజుకు 1,400 క్యూసెక్కులు హిరమండలానికి తరలిస్తారు. దీనికి రూ.189 కోట్లు ఖర్చవుతుందని జల వనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. హిరమండలం రిజర్వాయర్‌ను నింపడం ద్వారా ఆయకట్టులో రెండు పంటలకు నీళ్లందిస్తారు. తద్వారా వెనుకబడిన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలు సస్యశ్యామలమవుతాయి. వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మించి చెరో 57.5 టీఎంసీలు వాడుకొనేలా 1961 జూలై 18న ఏపీ, ఒడిశాల మధ్య ఒప్పందం కుదిరింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా 2005లో వంశధార స్టేజ్–2, ఫేజ్–2 చేపట్టారు. నేరడి బ్యారేజీ నిర్మించి రోజుకు 8 వేల క్యూసెక్కుల నీటిని 19.05 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే హీరమండలం రిజర్వాయర్‌లోకి తరలించే పనులు చేపట్టారు. దీనిద్వారా కొత్తగా 45 వేల ఎకరాలకు నీళ్లందించడంతోపాటు వంశధార స్టేజ్–1 కింద 2,10,510 ఎకరాలను స్థిరీకరిస్తారు. అయితే, నేరడి బ్యారేజీపై ఒడిశా సుప్రీం కోర్టుకు వెళ్లింది. దానిపై న్యాయపోరాటం చేస్తూనే ప్రాజెక్టు ఫలాలను ముందస్తుగా రైతులకు అందించడానికి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టు డిజైన్‌ను మార్చారు. కాట్రగడ్డ వద్ద వంశధారపై 300 మీటర్ల పొడవున సైడ్ వియర్ నిర్మించి 1,700 క్యూసెక్కుల చొప్పున 8 టీఎంసీలను హిరమండలం రిజర్వాయర్‌లోకి తరలించే పనులు చేపట్టారు. 2009 నాటికే ఈ పనులు సింహభాగం పూర్తయ్యాయి. ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. ఈ క్రమంలోనే వంశధార ట్రిబ్యునల్ తుది నివేదిక ఇచ్చింది. నేరడి బ్యారేజీ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. వంశధార జలాలను సమంగా (57.5 టీఎంసీల చొప్పున) రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. దీన్ని ఒడిశా ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. పూర్తి ఫలాలు అందించే దిశగా ట్రిబ్యునల్ తుది నివేదికను అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రిని సీఎం వైఎస్ జగన్ పలుమార్లు కోరారు. ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి గతేడాది నవంబర్ 3న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చలు జరిపారు. ఓ వైపు నేరడి బ్యారేజీ నిర్మాణానికి ప్రయత్నిస్తూనే.. ప్రాజెక్టు పూర్తి ఫలాలను ముందస్తుగా అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కాట్రగడ్డ సైడ్ వియర్ ద్వారా చేరే 1,700 క్యూసెక్కులకు అదనంగా గొట్టా బ్యారేజీ నుంచి మరో 1,400 క్యూసెక్కుల వరద జలాలను హిరమండలం రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. దీనిద్వారా వంశధారకు వరద ఉన్న రోజుల్లో గొట్టా బ్యారేజీ ద్వారా ఆయకట్టుకు నీటిని అందించి, వరద లేని రోజుల్లో హిరమండలం రిజర్వాయర్ ద్వారా నీరిస్తారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇప్పటికే వంశధార ప్రాజెక్టు కింద రబీ పంటలకు నీళ్లందిస్తున్నారు. హిరమండలం రిజర్వాయర్‌ను నింపడం ద్వారా రెండో పంటకు కూడా పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీళ్లందించనున్నారు. -
నదులన్నీ కడలి వైపు ఉరకలు
సాక్షి, అమరావతి: వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో నదులు, వాగులు, వంకలు ఉరకలెత్తుతున్నాయి. కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి, పెన్నా నదులు కడలి వైపు పరుగులు తీస్తున్నాయి. శ్రీశైలంలోకి మంగళవారం సాయంత్రం 6 గంటలకు 1.64 లక్షల క్యూసెక్కుల కృష్ణా జలాలు చేరుతుండటంతో నీటి నిల్వ 168.63 టీఎంసీలకు పెరిగింది. తెలంగాణ సర్కార్ ఎడమ గట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ విడుదల చేస్తున్న నీటిలో 10,480 క్యూసెక్కులు నాగార్జున సాగర్‌లోకి చేరుతుండటంతో నీటి నిల్వ 305.86 టీఎంసీలకు చేరుకుంది. తెలంగాణలో కురిసిన భారీ వర్షాల వల్ల మూసీ ఉరకలెత్తుతుండటం.. దానికి కృష్ణా వరద తోడవడంతో పులిచింతల ప్రాజెక్టులోకి 45,608 క్యూసెక్కులు చేరుతోంది. నీటి నిల్వ 32.25 టీఎంసీలకు చేరుకుంది. సిŠప్ల్ వే గేట్లు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 52,513 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రవాహానికి కట్టలేరు, వైరా, మున్నేరు వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి 1,10,191 క్యూసెక్కులు చేరుతున్నాయి. కృష్ణా డెల్టా కాలువలకు 7,991 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 1,02,200 క్యూసెక్కులను బ్యారేజీ 70 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. గోదా‘వడి’ పెరుగుతోంది గోదావరిలోకి భారీగా వరద చేరుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్దకు 3.50 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. ధవళేశ్వరం బ్యారేజీలోకి 3.32 లక్షల క్యూసెక్కులు వస్తోంది. కాలువలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 3.27 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ఉధృతి వంశధార, నాగావళి పరవళ్లు ఒడిశా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కురిసిన వర్షాల కారణంగా వంశధార, నాగావళిలో వరద ఉధృతి పెరిగింది. గొట్టా బ్యారేజీలోకి వంశధార నుంచి 7,133 క్యూసెక్కులు చేరుతుండగా.. 7వేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. నాగావళి ప్రవాహంతో తోటపల్లి, నారాయణపురం ఆనకట్టల్లో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకుంది. దాంతో నారాయణపురం ఆనకట్ట నుంచి 5 వేల క్యూసెక్కుల నాగావళి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. పెన్నా బేసిన్లో రిజర్వాయర్లు కళకళ పెన్నా నదిలో వరద ఉధృతి పెరిగింది. గండికోట ప్రాజెక్టు ఇప్పటికే నిండిపోయింది. సోమశిల ప్రాజెక్టులోకి 22,792 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 70.40 టీఎంసీలకు చేరుకుంది. మరో 8 టీఎంసీలు చేరితే సోమశిల ప్రాజెక్టు నిండిపోతుంది. కండలేరులో నీటి నిల్వ 53.76 టీఎంసీలకు చేరుకుంది. ఈ ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 15 టీఎంసీలు అవసరం. నాతవరం: తాండవ జలాశయ నీటిమట్టం మంగళవారం ప్రమాద స్థాయికి చేరుకోవడంతో అప్రమత్తమైన ప్రాజెక్ట్ అధికారులు స్పిల్‌వే గేట్ల ద్వారా వరద నీటిని తాండవ నదిలోకి విడుదల చేశారు. ప్రాజెక్ట్ సాధారణ నీటిమట్టం 380 అడుగులు కాగా.. మంగళవారం మధ్యాహ్నానికి 379.2 అడుగులకు చేరింది. ఎగువ నుంచి 2,500 క్యూసెక్కుల వరద నీరు జలాశయంలో చేరుతోంది. రెండు స్పిల్‌వే గేట్ల ద్వారా 1200 క్యూసెక్కులు నదిలోకి విడుదల చేశారు. రైవాడ ప్రమాదస్థాయి నీటి మట్టం 114.25 మీటర్లు కాగా.. ప్రస్తుతం 108.25 మీటర్లకు చేరింది. కోనాం ప్రమాద స్ధాయి నీటిమట్టం 101.24 మీటర్లు కాగా.. ప్రస్తుతం 98.45 మీటర్లు, మేఘాద్రిగెడ్డ ప్రమాదస్థాయి నీటిమట్టం 61 అడుగులు కాగా.. 58 అడుగులకు చేరింది. పెద్దేరు ప్రమాదస్థాయి నీటిమట్టం 137 మీటర్లు కాగా మంగళవారం సాయంత్రానికి 136.60 మీటర్లకు చేరింది. -
నదిలో దిగితేనే దాహం తీరేది..
శ్రీకాకుళం: ఎల్.ఎన్.పేట మండలంలోని 38 గ్రామాల ప్రజల మంచినీటి అవసరాలు తీర్చాల్సిన మెగా రక్షిత పథకం ద్వారా సక్రమంగా నీటి సరఫరా జరగడం లేదు. తరచూ పైపుల లీకేజీలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్య అధికారుల దృష్టిలో ఉన్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ఓసారి వారం రోజులు పాటు 38 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. సమీపంలోని వంశధార తీరంలో చలమలు తవ్వి ఊరిన నీటిని తెచ్చుకొని అవసరాలు తీర్చుకున్నారు. వారి సమస్య కొంత తీరినప్పటికీ దబ్బపాడు గ్రామస్తులకు మాత్రం కష్టాలు తప్పలేదు. మూడు నెలలుగా రక్షిత పథకం నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో గొంతు తడుపుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న బోర్లు పనిచేయకపోవటం, పనిచేసినా వాటినీరు తాగేందుకు, వంట అవసరాలకు పనికిరావు. దీంతో వంశధార నదిలోని చలమల నుంచి సేకరించిన నీటినే వంట అవసరాలకు, తాగేందుకు ఉపయోగిస్తున్నారు. గత నాలుగు రోజులుగా నదిలో నీటి ప్రవాహం పెరిగినప్పటికీ.. తప్పనిసరి పరిస్థితిలో నడుమ లోతు నీటిలో దిగి వెళ్లి ఇసుక దిబ్బలపై చలమగొయ్యిలు తవ్వి నీటిని తెచ్చుకుంటున్నామని మాజీ సర్పంచ్ జమ్మి పద్మావతితో పాటు పలువురు మహిళలు తెలిపారు. ఆర్థికంగా ఉన్నవారు ఆటోలు, ద్విచక్ర వాహనాలపై పక్కనున్న గ్రామాలకు వెళ్లి క్యాన్లతో నీటిని తెచ్చుకుంటున్నారన్నారు. నీటి కష్టాలపై పది రోజుల క్రితం సర్పంచ్ ముద్దాడ మోహినితో పాటు పలువురు యువకులు ఎంపీడీఓకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలానికి పది నెలలుగా ఆర్డబ్ల్యూఎస్ జేఈ లేకపోవటం, ఇన్చార్జి జేఈ ఎవరో కూడా తెలియకపోవటంతో సమస్య పరిష్కారం కాలేదంటున్నారు. రెండు రోజుల్లో పరిష్కరిస్తాం దబ్బపాడు గ్రామస్తులు ఎదుర్కొంటున్న నీటి సమస్యను ఎంపీడీవో ఆర్.కాళీప్రసాదరావు దృష్టికి తీసుకెళ్లాగా రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామన్నారు. ప్రత్యేక అధికారి కె.రామారావు, ఆర్డబ్ల్యూఎస్ జేఈతో కలసి పైపులైన్‌ను పరిశీలించామన్నారు. 800 మీటర్ల పైపు లైన్ పాడవ్వటం, పాత కాంట్రాక్టర్ మారి కొత్త కాంట్రాక్టర్ రావటం, కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం నిధులు విడుదల కాకపోవడం వంటి సమస్యల కారణంగా జాప్యం జరిగిందన్నారు. -
వంశధార ట్రిబ్యునల్ తీర్పు సంతోషకరం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వంశధార జల వివాదాల ట్రిబ్యునల్ తీర్పు సంతోషకరమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ట్రిబ్యునల్ నిర్ణయం ఏపీ, ఒడిశాకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. గెజిట్ విడుదలైన తర్వాత వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. నేరడి బ్యారేజీ శంకుస్థాపనకు ఒడిశా ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తామని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. కాగా వంశధార నదీ జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదానికి ముగింపు పలుకుతూ ఇచ్చిన తుది తీర్పునే వీడబ్ల్యూడీటీ (వంశధార జల వివాదాల ట్రిబ్యునల్) ఖరారు చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 13, 2017న ఇచ్చిన తుది తీర్పుపై అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం–1956 సెక్షన్–5(3) కింద ఒడిశా సర్కార్ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఈ మేరకు సోమవారం వీడబ్ల్యూడీటీ చైర్మన్ జస్టిస్ డాక్టర్ ముకుందకం శర్మ ఉత్తర్వులు జారీ చేస్తూ కేంద్రానికి నివేదించారు. వంశధార ట్రిబ్యునల్ తుది తీర్పును నోటిఫై చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తే.. ఆ తీర్పు అమల్లోకి వస్తుంది. తుది తీర్పును సవాల్ చేస్తూ ఒడిశా సర్కార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం ఆధారంగా కేంద్రం ఆ తీర్పును నోటిఫై చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. చదవండి: వంశధార జలాల వివాదానికి చరమగీతం ఆ ఘటన నా మనసును కలచివేసింది: సీఎం జగన్ -
వంశధార జలాల వివాదానికి చరమగీతం
సాక్షి, అమరావతి: వంశధార నదీ జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదానికి ముగింపు పలుకుతూ ఇచ్చిన తుది తీర్పునే వీడబ్ల్యూడీటీ (వంశధార జల వివాదాల ట్రిబ్యునల్) ఖరారు చేసింది. సెప్టెంబర్ 13, 2017న ఇచ్చిన తుది తీర్పుపై అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం–1956 సెక్షన్–5(3) కింద ఒడిశా సర్కార్ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఈ మేరకు సోమవారం వీడబ్ల్యూడీటీ చైర్మన్ జస్టిస్ డాక్టర్ ముకుందకం శర్మ ఉత్తర్వులు జారీ చేస్తూ కేంద్రానికి నివేదించారు. వంశధార ట్రిబ్యునల్ తుది తీర్పును నోటిఫై చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తే.. ఆ తీర్పు అమల్లోకి వస్తుంది. తుది తీర్పును సవాల్ చేస్తూ ఒడిశా సర్కార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం ఆధారంగా కేంద్రం ఆ తీర్పును నోటిఫై చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఏడున్నరేళ్లపాటు విచారణ.. వంశధార జలాల వివాదాన్ని ఏడున్నరేళ్లపాటు విచారించిన ట్రిబ్యునల్ సెప్టెంబర్ 13, 2017న ఇరు రాష్ట్రాలకు సమన్యాయం చేస్తూ తుది తీర్పు ఇచ్చింది. ఇందులో ప్రధానాంశాలు.. – సెప్టెంబరు 30, 1962న ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు.. వంశధారలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 115 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని అంచనా. ట్రిబ్యునల్ వాటిని చెరి సగం అంటే 57.5 టీఎంసీల చొప్పున పంపిణీ చేసింది. – శ్రీకాకుళం జిల్లాలో నేరడి వద్ద వంశధారపై బ్యారేజీ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ఈ బ్యారేజీ నుంచి నీటిని ఇరు రాష్ట్రాలు వాడుకోవాలని సూచించింది. బ్యారేజీ కుడి వైపు స్లూయిజ్‌ల ద్వారా రోజుకు ఎనిమిది వేల క్యూసెక్కుల చొప్పున తరలించడానికి ఏపీకి అనుమతి ఇచ్చింది. తీర్పు అమలు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన ఆర్నెళ్లలోగా బ్యారేజీ ఎడమ వైపు నుంచి నీటిని వాడుకోవడానికి వీలుగా ఏపీకి ప్రతిపాదనలు పంపాలని ఒడిశాకు సూచించింది. – నేరడి బ్యారేజీ నిర్మాణానికయ్యే వ్యయాన్ని ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో ఏపీ, ఒడిశాలు భరించాలని పేర్కొంది. – నేరడి బ్యారేజీలో ముంపునకు గురయ్యే 106 ఎకరాల భూమిని సేకరించి ఏపీ ప్రభుత్వానికి అప్పగించాలని ఒడిశాను ఆదేశించింది. ఇందుకు పరిహారాన్ని ఒడిశాకు చెల్లించాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. – కాట్రగడ్డ సైడ్‌వియర్ హెడ్ రెగ్యులేటర్‌ను జూన్ 1 నుంచి ఎనిమిది టీఎంసీలు తరలించే వరకు లేదా నవంబర్ 30 వరకు తెరిచి ఉంచాలని పేర్కొంది. – నేరడి బ్యారేజీ పూర్తయ్యాక కాట్రగడ్డ సైడ్‌వియర్‌ను పూర్తిగా తొలగించాలని షరతు విధించింది. – ఈ తీర్పు అమలును పర్యవేక్షించడానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సీఈ అధ్యక్షతన, ఇరు రాష్ట్రాల అధికారులు సభ్యులుగా అంతర్రాష్ట్ర పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. ఒడిశా అభ్యంతరాలను తోసిపుచ్చిన ట్రిబ్యునల్.. ఒడిశా లేవనెత్తిన అభ్యంతరాలపై విచారణ జరిపిన వంశధార ట్రిబ్యునల్ వాటిని తోసిపుచ్చింది. వంశధారలో 115 టీఎంసీల లభ్యత లేదన్న వాదనను కొట్టిపారేసింది. ఎంత నీటి లభ్యత ఉంటే.. అంత నీటిని దామాషా పద్ధతిలో చెరి సగం పంచుకోవాలని ఆదేశించింది. కాట్రగడ్డ సైడ్‌వియర్ నుంచి వాడుకునే జలాలపై పర్యవేక్షణ కమిటీ వేయాలన్న సూచననూ తోసిపుచ్చింది. తీర్పు అమలును పర్యవేక్షించేందుకు అంతర్రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో మరో కొత్త కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. వంశధార జలాల వివాద క్రమం ఇదీ.. – ఫిబ్రవరి, 2006: ఏపీ ప్రభుత్వం చేపట్టిన వంశధార ప్రాజెక్టు ఫేజ్–2, స్టేజ్–2పై అభ్యంతరం తెలుపుతూ కేంద్రానికి ఫిర్యాదు చేసిన ఒడిశా. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం–1956 సెక్షన్–3 ప్రకారం ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి వివాదాన్ని పరిష్కరించాలని ప్రతిపాదన – ఏప్రిల్ 24, 2006: వివాదాన్ని పరిష్కరించేందుకు ఏపీ, ఒడిశా జలవనరుల అధికారులతో కేంద్ర జలవనరుల శాఖ అధికారుల మొదటి సమావేశం.. చర్చలు విఫలం – డిసెంబర్ 5, 6, 2006: ఇరు రాష్ట్రాల అధికారులతో కేంద్ర అధికారుల రెండో దఫా సమావేశం.. చర్చలు విఫలం – మార్చి 2, 2007: ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి ఉన్నత స్థాయి సమావేశం.. చర్చలు విఫలం – ఏప్రిల్ 30, 2007: అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం–1956 ప్రకారం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి.. వంశధార వివాదాన్ని పరిష్కరించాలని సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన ఒడిశా –ఫిబ్రవరి 6, 2009: ఈ వివాదంపై విచారించిన సుప్రీంకోర్టు.. ఆర్నెళ్లలోగా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి, వివాదాన్ని పరిష్కరించాలని కేంద్రానికి ఆదేశం – ఏప్రిల్ 24, 2010: వంశధార జల వివాదాల ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసిన కేంద్రం – డిసెంబర్ 17, 2013: కాట్రగడ్డ సైడ్‌వియర్ నిర్మాణానికి ఏపీకి అనుమతి ఇస్తూ కేంద్రానికి మధ్యంతర నివేదిక ఇచ్చిన వంశధార ట్రిబ్యునల్ – సెప్టెంబర్ 15, 2014: వంశధార ట్రిబ్యునల్ మధ్యంతర నివేదికను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఒడిశా.. కాట్రగడ్డ సైడ్‌వియర్ నిర్మాణ పనులను ఏపీ కొనసాగించవచ్చన్న సుప్రీంకోర్టు – సెప్టెంబర్ 13, 2017: తుది తీర్పు జారీ చేసిన వంశధార ట్రిబ్యునల్ – డిసెంబర్ 12, 2017: తుది తీర్పుపై అభ్యంతరాలను లేవనెత్తిన ఒడిశా సర్కార్ – జూన్ 21, 2021: ఒడిశా అభ్యంతరాలను తోసిపుచ్చుతూ.. తుది తీర్పును ఖరారు చేస్తూ కేంద్రానికి నివేదిక ఇచ్చిన వంశధార ట్రిబ్యునల్ -
నేరడి నిర్మాణానికి సహకరించండి
సాక్షి, అమరావతి: వంశధార నదిపై నేరడి బ్యారేజ్ నిర్మాణానికి సహకరించాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ను కోరారు. ఈ మేరకు ఆయన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు శనివారం లేఖ రాశారు. నేరడి బ్యారేజ్ నిర్మాణం విషయంలో నెలకొన్న సమస్యలను సంప్రదింపుల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. సంప్రదింపులకోసం వచ్చి కలుస్తానని, సమయం కేటాయించాలని ఒడిశా సీఎంను కోరారు. అనేక సంవత్సరాలుగా వివిధ అంశాల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు నమ్మకమైన.. సుహృద్భావ వాతావరణంలో పరస్పర సహకారంతో కలసి పనిచేస్తున్నాయని, అంతేగాక పరస్పర సంప్రదింపుల ద్వారా అనేక అంశాలను పరిష్కరించుకుంటున్నామని జగన్ తన లేఖలో గుర్తు చేశారు. నేరడితో ఏపీతోపాటు ఒడిశాకూ ఉపయోగం.. వంశధార జలవివాదాల ట్రిబ్యునల్ 13–09–2017న ఇచ్చిన తుది తీర్పును సీఎం వైఎస్ జగన్ లేఖలో ప్రస్తావిస్తూ.. వంశధారపై నేరడి బ్యారేజ్ నిర్మాణానికి ఏపీకి ట్రిబ్యునల్ అనుమతించిందని తెలిపారు. నేరడి బ్యారేజ్ నిర్మాణం వల్ల ఏపీతోపాటు ఒడిశా అవసరాలకు ఉపయోగపడుతుందని వివరించారు. నేరడి బ్యారేజ్ ఎడమ వైపున లెఫ్ట్ హెడ్ స్లూయిజ్ నిర్మాణానికి కూడా ట్రిబ్యునల్ అనుమతించిందని, ఇది ఒడిస్సా రాష్ట్రం అవసరాలను తీరుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ బ్యారేజీ నిర్మాణం వల్ల ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. దీనివల్ల కరువు ప్రాంతాలైన ఏపీలోని శ్రీకాకుళం జిల్లాతోపాటు ఒడిశాలోని గజపతి జిల్లాలోని ప్రజల సాగు, తాగు నీటి అవసరాలు తీరతాయని తెలిపారు. ఈ బ్యారేజ్ నిర్మాణం పూర్తి చేయడం కోసం రెండు రాష్ట్రాల రైతులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని జగన్ పేర్కొన్నారు. ఏటా వరద జలాల్లో 75 శాతం అంటే.. సుమారు 80 టీఎంసీలు వృథాగా సముద్రంలోకి పోతోందన్నారు. మానవుని అవసరాలకు నీరు చాలా ప్రధానమైనదని, అలాగే పరిమితంగా ఉండే నీటి వనరులను పరిరక్షించుకోకపోతే భవిష్యత్‌లో నీటికొరతకు అవకాశముందని ఆయన తెలిపారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పరిష్కరించుకుందాం.. ఒడిశా రాష్ట్రం కొన్ని అంశాల్లో స్పష్టత కోసం వంశధార ట్రిబ్యునల్తోపాటు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడాన్ని లేఖలో సీఎం జగన్ ప్రస్తావించారు. ప్రధానంగా సూపర్వైజరీ కమిటీ పనితీరుపై స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారని, అయితే ఆ విషయంపై నేరడి బ్యారేజ్ ఆపరేషన్లోకి వచ్చే ముందుగానే ఇరు రాష్ట్రాలు ఇచ్చుపుచ్చుకునే ధోరణిలో పరిష్కరించుకోవచ్చునని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ తీర్పునకు అనుగుణంగా నేరడి బ్యారేజ్ నిర్మాణానికి ఒడిశా ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. సమస్యలను ఇరు రాష్ట్రాలు పరస్పరం సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జగన్ పునరుద్ఘాటిస్తూ.. ఈ నేపథ్యంలో చర్చల కోసం తగిన సమయం కేటాయించాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ను కోరారు. -
మార్చి నాటికి నాగావళిలోకి వంశధార పరవళ్లు
సాక్షి, అమరావతి: నదుల అనుసంధానం ద్వారా సముద్రంలో కలుస్తున్న వరద జలాలను ఒడిసి పట్టి ఆయకట్టుకు నీళ్లందించే పనులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా రూ.145.34 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ‘వంశధార-నాగావళి’ నదుల అనుసంధానం పనులను మార్చిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. తద్వారా నారాయణపురం ఆనకట్ట కింద 39,179 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు హైలెవల్ కెనాల్ ద్వారా కొత్తగా ఐదు వేల ఎకరాలకు నీళ్లందించి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభివృద్ధికి బాటలు వేయాలని నిర్ణయించింది. ఏటా 100 టీఎంసీలు వృథా గత మూడు దశాబ్దాల గణాంకాలను పరిశీలిస్తే గొట్టా బ్యారేజీ నుంచి ఏటా సగటున వంద టీఎంసీల వంశధార జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. నాగావళి నదిలో వరద ఆలస్యంగా రావడం, నారాయణపురం ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే వంశధార ప్రాజెక్టు స్టేజ్-2.. ఫేజ్-2లో కాట్రగడ్డ సైడ్ వియర్ నుంచి హిరమండలం రిజర్వాయర్‌కు తరలించిన వంశధార నీటిని, ఆ రిజర్వాయర్ మట్టికట్ట వద్ద నుంచి హెచ్చెల్సీ (హైలెవల్ కెనాల్) తవ్వి రోజుకు 600 క్యూసెక్కులను నారాయణపురం ఆనకట్టకు ఎగువన నాగావళి నదిలోకి పోయడం ద్వారా ఆ రెండు నదుల అనుసంధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ► హిరమండలం రిజర్వాయర్ నుంచి తవ్వాల్సిన 33.583 కి.మీ.ల హెచె్చల్సీ పనులకు గాను 25 కి.మీ.ల మేర తవ్వకం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగిలిన 8.583 కి.మీ.ల కాలువ పనులు పూర్తి చేయడానికి 4,87,740 క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వాల్సి ఉండగా.. అధికారులు పనులు వేగవంతం చేశారు. ► హెచ్చెల్సీలో అక్విడెక్టులు, అండర్ టన్నెల్స్ (యూటీ) బ్రిడ్జిలు వంటివి 66 నిర్మాణాలను చేపట్టాలి. ఇందులో ఇప్పటికే 31 నిర్మాణాలను పూర్తి చేశారు. మిగిలిన 35 నిర్మాణాలను పూర్తి చేయాలంటే 49,608 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ పనులు చేయాల్సి ఉండగా ఆ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ► వచ్చే ఖరీఫ్‌లో నారాయణపురం ఆనకట్టకు నీళ్లందించడం ద్వారా రైతులకు నదుల అనుసంధానం ఫలాలను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
నాగావళికి వంశధార
సాక్షి, అమరావతి: వంశధార– నాగావళి అనుసంధానం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ రెండు నదులను అనుసంధానం చేసి 42,053 ఎకరాలను సస్యశ్యామలం చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఈ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేసి.. జాతికి అంకితం చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. శ్రీకాకుళం జిల్లాలో బూర్జ మండలం నారాయణపురం వద్ద నాగావళి నదిపై 1959లో ఆనకట్ట నిర్మించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కుడి కాలువ కింద 18,362, ఎడమ కాలువ కింద 18,691 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే నాగావళిలో వరద ప్రవాహం సెప్టెంబరు నాటికే తగ్గుముఖం పడుతుండడం వల్ల ఆయకట్టు పంటలకు చివరలో నీళ్లందక ఎండిపోతున్నాయి. వంశధార వరద జలాల మళ్లింపే సమస్యకు పరిష్కారంగా భావించిన ప్రభుత్వం ఆ దిశగా పనులను వేగవంతం చేసింది. అనుసంధానం పనులు చకచకా.. ► వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 ఫేజ్–2లో భాగంగా వంశధార నదిపై కాట్రగడ్డ వద్ద సైడ్ వియర్ నిర్మించి అక్కడి నుంచి వరద కాలువ ద్వారా సింగిడి, పారాపురం రిజర్వాయర్ల మీదుగా హిరమండలం రిజర్వాయర్‌కు వరద జలాలు తరలించే పనులు శరవేగంగా సాగుతున్నాయి. ► హిరమండలం రిజర్వాయర్ నుంచి 600 క్యూసెక్కుల సామర్థ్యంతో 33.583 కిమీల పొడవున హైలెవల్ కెనాల్ తవ్వి వంశధార జలాలను నారాయణపురం ఆనకట్ట జలవిస్తరణ ప్రాంతంలో నాగావళి నదిలోకి పోయడం ద్వారా రెండు నదులను అనుసంధానం చేసే పనులు చేపట్టారు. ► హైలెవల్ కెనాల్ కింద కొత్తగా ఐదు వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు నారాయణపురం ఆనకట్ట కింద 37,053 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. ఈ ఏడాదే ప్రారంభానికి సిద్ధం ► రూ.84.90 కోట్లతో చేపట్టిన ఈ పనుల్లో హైలెవల్ కెనాల్ తవ్వకం 25 కి.మీ.ల పూర్తయ్యాయి. 8.583 కి.మీ.ల పనులు చేపట్టాల్సి ఉంది. 66 నిర్మాణాలకునూ 31 పూర్తికాగా 35 పనులు చేపట్టాలి. ► ఈ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన రూ.50 కోట్లను విడుదలకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ► ఈ డిసెంబర్‌లోగా పనులను పూర్తి చేసి.. జాతికి అంకితం చేయాలని సర్కార్ నిర్ణయించింది. -
నాగావళి-వంశాధారకు పెరుగుతున్న వరద ఉధృతి
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలో కురుస్తున్న వర్షాలకు నది పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహాణ శాఖ కమిషనర్ సూచించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ.. వంశధార-నాగావళి నదులకు వరద నీటి ఉధృతి పెరుగుతోందని, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ముందస్తు చర్యగా ప్రత్యేక బృందాలను తరలిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని ప్రభావిత ప్రాంతాలకు ఒక ఎస్డీఆర్ఎఫ్, రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రానున్నాయని పేర్కొన్నారు. గొట్టా బ్యారేజ్, తోటపల్లి వద్ద వరద ప్రభావం తీవ్రరూపం దాల్చడంతో గొట్ట బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో 64,294 క్యూసెక్కులు ఉండగా దగ్గర ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. తోటపల్లి వద్ద ఇన్ ఫ్లో 48,750, అవుట్ ఫ్లో 55,511 క్యూసెక్కులు ఉండగా రెండవ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. -
వంశధారకు వరద ఉధృతి.. 1వ ప్రమాద హెచ్చరిక జారీ
సాక్షి, శ్రీకాకుళం : గతకొద్ది రోజులుగా ఒడిశా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వంశధార నది పొంగి పొరలుతోంది. నీటి మట్టం అంతకంతకు పెరిగిపోతుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అంతేకాకుండా హీర మండలంలోని గొట్టా బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం 60వేల క్యూసెక్కులకు చేరిన వరద నీటి ప్రవాహం మధ్యాహ్నానికి లక్ష క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో వంశధార నది తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. కొత్తూరు మండలంలోని 12, హిర మండలంలోని 9, ఎల్‌ఎన్‌పేట మండలంలోని 6 గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది. -
53 మంది కూలీలు సురక్షితం
సాక్షి, శ్రీకాకుళం: గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నదుల్లో వరద నీరు పోటెత్తుతోంది. ఎగువన కురిసిన భారీ వర్షాలు కారణంగా శ్రీకాకుళం జిల్లా వంశధార నదిలో వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో గొట్టా బ్యారేజ్ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ వరద నీటి ప్రవాహానికి సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం రేవు ఇసుక ర్యాంప్ వద్ద ఇరువై లారీలు చిక్కుకుపోయాయి. లారీలో ఇసుక నింపటానికి వెళ్లిన 53 మంది కూలీలు కూడా వరద నీటిలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ, పోలీసు శాఖ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలకు ప్రారంభించారు. తొలుత 24 మందిని కూలీలను అధికారులు కాపాడారు. అయితే క్రమేణా వరద ఉధృతి పెరగడంతో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆధ్వర్వంలో మిగిలిన వారిని ఒడ్డుకు చేర్చారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ వరదలో చిక్కుకున్న 53 మందిని కాపాడామని, వర్షా కాలంలో నదుల్లో పనిచేసేముందు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. -
మా పొట్ట కొట్టొద్దు
హిరమండలం: వంశధార నిర్వాసితులు మరోమారు అధికారులకు ఎదురెళ్లారు. కడుపు నింపుతున్న పొలాలను తవ్వే పనులు చేయవద్దని హెచ్చరించారు. చేసిన త్యాగాలను మర్చిపోయి కడుపు కొట్టే చర్యలు తీసుకోవద్దని వేడుకున్నారు. నాయకుల పొలాలు వదిలేసి పేదల పంటలను ధ్వంసం చేయడం తగదని సూటిగా చురకలంటించారు. తులగాం రెవెన్యూ పరిధిలో వంశధార రిజర్వాయర్ గట్టు నిర్మాణానికి మట్టి సేకరించేందుకు అధికారులు రెండు రోజులుగా పంట పొలాలను నాశనం చేస్తున్నారు. ఇందులో భాగంగా తులగాం గ్రామ సమీపంలో నాట్లు వేసిన పంట పొలాలను మంగళవారం యం త్రాలతో ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న తులగాం నిర్వాసితులు ఒక్కసారిగా పొలాల వద్దకు వచ్చి తామంతా పేదలమని, పొట్టకూటి కోసం రైతుల నుంచి భూములను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నామన్నారు. పోలీసులు, వంశధార అధికారులు తమ భూముల్లో ఉన్న వరి నాట్లను ధ్వంసం చేయడం అన్యాయమన్నారు. తమ పక్కనే ఉన్న నాయకుల భూముల్లో నాట్లు ఉన్నా వాటిని ఎందుకు పాడు చేయడం లేదంటూ ఆందోళనకు దిగారు. అన్ని భూముల నుంచి క్రమేపీ మట్టిని సేకరిస్తామని అధికారులు నచ్చజెప్పుతూ పక్కనే ఉన్న పలువురి నాయకుల భూముల్లో వరినాట్లు నాశనం చేసి మట్టి తవ్వారు. ఈ విషయాన్ని ఆర్డీఓ, తహసీల్దార్లకు తెలియజేశారు. నిర్వాసితులతో అధికారుల చర్చలు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పాలకొండ ఆర్డీవో రెడ్డి గున్నయ్య, తహసీల్దార్ కాళీప్రసాద్ ఈఈ సీతారాం నాయుడు, సీఐ ప్రకాష్‌లు నిర్వాసిత గ్రామాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం పంట ఉన్న పొలా లను విడిచి పెట్టాలని నాట్లు వేయని ఖాళీగా ఉన్న పొలా ల్లో మట్టి సేకరణ చేసుకోవచ్చునని నిర్వాసితులు తెలి పారు. అలాగే తులగాంకు చెందిన నాయకుడు మాట్లాడుతూ తులగాం రెవెన్యూ పరిధిలో సుమారు 900 ఎకరాల విస్తీర్ణం ఉందని ఇందులో సుమారు 750 ఎకరాలు విస్తీర్ణంలో గట్టు నిర్మాణానికి మట్టి సేకరించారని మిగి లిన గ్రామాల్లో ఒక్క ఎకరా విస్తీర్ణంలో మట్టి సేకరించలేదని ఆ గ్రామాలకు వెళ్లి మట్టి సేకరించుకోవాలని తెలిపారు. దీంతో ఈఈ మాట్లాడుతూ ప్రస్తుతానికి అన్ని గ్రామాల్లో కూడా మట్టి సేకరణ చేస్తామని తెలిపారు. అయితే పంట భూముల్లో మట్టి సేకరిస్తే ఊరుకొనేది లేదని ఖాళీ ప్రదేశాల్లో సేకరించుకోవాలని నిర్వాసితులు తెలపడంతో... నాట్లు వేయవద్దని సూచించినా వేశారని ఖాళీ పొలాలు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని వంశధార అధికారులు అడిగారు. దీనికి నిర్వాసితులు ఆగ్రహం చెంది సమస్యలు పరిష్కరించాకే పనులు చేయాలని తేల్చి చెప్పారు. దీంతో ఆర్డీవో సమస్యలు తెలపాలంటూ నిర్వాసిత నాయకులను అడిగి తెలుసుకున్నారు. మరో నాలుగు రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఖాళీగా ఉన్న భూముల నుంచి మట్టి సేకరించేందుకు తులగాం పరిసరాలకు చేరుకున్నారు. అక్కడ పనులు జరిగేందుకు మరిన్ని యంత్రాలు తే వాలని అందరి భూములను చదును చేయాలని కాం ట్రాక్టర్లను ఆదేశించారు. ఈ విషయం తెలుసుకున్న తులగాం నిర్వాసితులు మరికొందరు మళ్లీ అధికారులను అ డ్డుకున్నారు. ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోసి తమ డి మాండ్లను ఏకరువు పెట్టారు. దీంతో పోలీసులు వారిని నిలువరించేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో కాసేపు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. సాయంత్రం కావడంతో అధికారులు పనులను ఆపి యంత్రాలను తరలించారు. దీంతో నిర్వాసితులు వెనుదిరిగారు. -
నదిలో వీఆర్ఏ మృతదేహం లభ్యం
ఎల్.ఎన్.పేట(శ్రీకాకుళం): రెండు రోజుల క్రితం కనిపించకుండాపోయిన వీఆర్ఏ మృతదేహం లభించింది. శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేట(లక్ష్మీనర్సుపేట) మండలం తురకపేట రెవెన్యూ క్లస్టర్ వీఆర్ఏ సురాన త్రినాథరావు(50) రెండు రోజుల క్రితం విధి నిర్వహణ నిమిత్తమై వెళ్లి వంశధార నదిలో గల్లంతయ్యాడు. మంగళవారం ఉదయం జలుమూరు మండలం నగరికటకం- అచ్యుతాపురం గ్రామాల మధ్య మృతదేహాన్ని గమనించిన స్థానికులు అక్కడ లభించిన ఆధారాల సాయంతో కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని త్రినాథరావు మృతదేహాన్ని గుర్తించారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన మృతిపై తమకు అనుమానాలున్నాయంటూ వారు ఎల్‌ఎన్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
'వంశధార'లో విద్యార్థుల మృతదేహలు లభ్యం
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా హిరామండంలం గొట్టాబ్యారేజిలో నిన్న స్నానానికి దిగి గల్లంతైన ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులలో ఇద్దరి మృతదేహాలను లభ్యమయ్యాయి. కిశోర రాజు, అజయ్ వెంకట కుమార్ మృతదేహలను శుక్రవారం ఉదయం గుర్తించారు. మరో విద్యార్థి అప్పలరెడ్డి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతోంది. గరివిడి అవంతి సెయింట్ థెరిసా ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు శివరాత్రి పర్వదినం సందర్భంగా గురువారం శ్రీముఖలింగంలోని ముఖలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చారు. ఆలయంలో తీవ్ర రద్దీగా ఉండటంతో సమీపంలోని గొట్టా బ్యారేజ్ చూసొద్దామని వెళ్లారు. అక్కడే ఉన్న వంశధార నదిలో నలుగురు విద్యార్థులు స్నానానికి దిగారు. అందులో ముగ్గురు విద్యార్థులు కిశోర రాజు, అజయ్ వెంకట కుమార్, అప్పలరాజు గల్లంతయ్యారు. దాంతో స్థానికులు వెంటనే స్పందించి విద్యార్థులను రక్షించేందుకు ప్రయత్నించగా వారు ప్రవాహంలో కొట్టుకుపోయారు. నిన్నటి నుంచి గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం తెల్లవారుజామున ఇద్దరు మృతదేహలు లభ్యమైనాయి. -
వంశధర నదిలో ముగ్గురు విద్యార్ధుల గల్లంతు
-
'వంశధార' సైడ్ వీయర్ కు ఓకే
శ్రీకాకుళం జిల్లా కాట్రగడ్డ వద్ద ‘అడ్డుగోడ’కు అనుమతి సాక్షి, న్యూఢిల్లీ: వంశధార నదీ జలాల వివాదంలో రాష్ట్రానికి తొలి విజయం దక్కింది. వంశధార రెండోదశ ప్రాజెక్టులో భాగంగా శ్రీకాకుళం జిల్లా కాట్రగడ్డ వద్ద (మనవైపు నదికి) సైడ్ వీయర్ (గేట్లతో కూడిన అడ్డుగోడ) నిర్మాణానికి వంశధార జల వివాదాల ట్రిబ్యునల్ (వీడబ్ల్యూడీటీ) అనుమతి ఇచ్చింది. తమకు నష్టం జరుగుతుందంటూ ఇంతకాలం మోకాలడ్డుతూ వచ్చిన ఒడిశా అభ్యంతరాలు, వాదనలను తాత్కాలికంగా పక్కనపెట్టింది. దీంతో మరో 8 టీఎంసీల నీటిని వాడుకోవడానికి, తద్వారా మరో 50 వేల ఎకరాలు సాగు చేసేందుకు మన రాష్ట్రానికి అవకాశం చిక్కింది. అయితే సైడ్‌వీయర్ విషయంలో మున్ముందు వివాదాలు తలెత్తకుండా, నిర్మాణం మొదలుకుని, దాని పనితీరు, నీటిని వాడుకోవడం వరకు అన్నింటినీ పర్యవేక్షించడానికి ట్రిబ్యునల్ ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), ఆంధ్రప్రదేశ్, ఒడిశాల నుంచి ఒక్కొక్కరు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఇదే సమయంలో కొన్ని షరతులను కూడా విధించింది. కాట్రగడ్డ వద్ద సైడ్‌వీయర్ నిర్మాణానికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒడిశా దాఖలు చేసిన దరఖాస్తును ( ఇంటర్లాక్యుటరీ అప్లికేషన్ ) జస్టిస్ ఎం.కె.శర్మ చైర్మన్‌గా, జస్టిస్ బి.ఎన్.చతుర్వేది, జస్టిస్ గులాం మహమ్మద్ సభ్యులుగా ఉన్న వంశధార ట్రిబ్యునల్ మంగళవారం పరిష్కరించింది. ఈ మేరకు 28 పేజీల మధ్యంతర ఉత్తర్వును ప్రకటించింది. దీంతో సైడ్‌వీయర్ నిర్మాణానికి ఇప్పటివరకూ ఉన్న ప్రతిబంధకాలన్నీ తొలగినట్టయింది. దీంతో మన రాష్ట్ర ఉన్నతాధికారుల్లో, రాష్ట్రం తరఫున వాదించిన న్యాయవాదుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యూరుు. ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే... ఒడిశా దాఖలు చేసిన దరఖాస్తు నేపథ్యంలో ఇరు రాష్ట్రాలు సమర్పించిన పత్రాలు, ఇతరత్రా ఆధారాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, రెండురాష్ట్రాల వాదనలు ఆలకించిన ట్రిబ్యునల్ గత ఆగస్టులో ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. చివరకు మంగళవారం ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ఎం.కె.శర్మ ఉత్తర్వులు వెలువరించారు. ‘సైడ్‌వీయర్ నిర్మాణానికి అనుమతించనట్టయితే... సాగునీరు, ఇతరత్రా అవసరాల కోసం కోరిన పరిమాణం మేరకు జలాలను వినియోగించుకోవడానికి రాష్ట్రాన్ని నిరాకరించినట్టు అవుతుందని, దానివల్ల తాము దారుణంగా నష్టపోతామని, కోలుకోలేనంతగా దెబ్బతింటామనే వాస్తవాన్ని ఆంధ్రప్రదేశ్ స్పష్టంగా చూపగలిగింది. తమ కేసుకు బలమైన ఆధారాలున్నాయని నిరూపించుకోవడంలో ఒడిశా విఫలమైంది. రికార్డుల్లో ఉన్న వాస్తవాలు, పత్రాలు మొగ్గును ఆంధ్రప్రదేశ్‌కే ఇస్తున్నాయి’’ అని ట్రిబ్యునల్ పేర్కొంది. వాస్తవాలను, కేసు నేపథ్యాన్ని సమగ్రంగా పరిశీలించిన మీదట సైడ్‌వీయర్ నిర్మాణాన్ని ప్రతిపాదిత అనుబంధ పనులతో సహా చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్‌కు అనుమతిస్తున్నట్లు ట్రిబ్యునల్ తెలిపింది. ఇవీ షరతులు.. సైడ్‌వీయర్ నిర్మాణం, అనుబంధ పనుల నిమిత్తం ప్రస్తుతమిస్తున్న ఉత్తర్వులు తాత్కాలికమైనవేనని, అవసరమనుకున్న సందర్భంలో తామిచ్చే తదుపరి ఉత్తర్వులకు ఇవి లోబడి ఉంటాయని పేర్కొంది. ట్రిబ్యునల్ మొత్తం పది షరతులను విధించింది. అందులో ముఖ్యమైనవి... సైడ్‌వీయర్ నిర్మాణం, దాని పనితీరు, ట్రిబ్యునల్ ఉత్తర్వు అమలును పర్యవేక్షించడానికి ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేయాలి. ‘జల ప్రవాహ నిర్వహణ, నియంత్రణ పర్యవేక్షక కమిటీ’గా వ్యవహరించే ఈ కమిటీలో ముగ్గురు సభ్యులుంటారు. సీడబ్ల్యూసీ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాల తరఫున మొత్తం ముగ్గురికి ఇందులో స్థానమివ్వాలి. సీడబ్ల్యూసీ ప్రతినిధి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ప్రాజెక్టు ప్రతిపాదనకు కేంద్ర జలసంఘం, జల వనరులు, పర్యావరణ, అటవీ, గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖల అనుమతులు, చట్టపరంగా అవసరమైన ఇతర అనుమతులు పొందడం తప్పనిసరి. సైడ్‌వీయర్ పనితీరునంతటినీ, గేట్ల మూసివేతతో సహా, పర్యవేక్షక కమిటీయే చూస్తుంది. కమిటీయే తన కార్యాలయ ప్రదేశాన్ని ఎంపిక చేసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ కమిటీకి కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తుంది. కార్యాలయ నిర్వహణ, పర్యవేక్షణ కార్యకలాపాలకు అయ్యే ఖర్చులను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే భరిస్తుంది. సైడ్‌వీయర్‌కు ఎగువన ప్రవాహం ఎంత ఉంది, సైడ్‌వీయర్ నుంచి ఎన్ని నీళ్లు వెళ్తున్నాయనే వివరాల రికార్డును కమిటీ నిర్వహిస్తుంది. వంశధార నదిలో సైడ్‌వీయర్‌కు ఎగువన ప్రవాహ జలాలు 4,000 క్యూసెక్కులకు మించి ఉన్నపుడు, దిగువన ప్రవహించే నీళ్లు 4,000 క్యూసెక్కులకు సమానంగా లేక అంతకుమించి ఉన్నపుడే దాని గేట్లను తెరవడానికి కమిటీ అనుమతించాలి. ఏ సంవత్సరంలోనైనా సరే జూన్ నుంచి నవంబర్ వరకు ఉన్న నెలల్లో సైడ్‌వీయర్ ద్వారా పక్కకు వెళ్లే మొత్తం జలాలు ఎట్టి పరిస్థితుల్లోనూ 8 టీఎంసీలకు మించకుండా ఉండేలా కమిటీ చూడాలి. ఈ 8 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటాకు వచ్చే 50 శాతం జలాల్లో భాగమవుతాయి. జూన్ మాసం నుంచి నవంబర్ వరకు సైడ్‌వీయర్ నుంచి పక్కకు వెళ్లే జలాల మొత్తం ఎప్పుడైతే 8 టీఎంసీలకు చేరుకుంటుందో ఆ వెంటనే సైడ్‌వీయర్ గేట్లను మూసివేసేలా, మళ్లీ తదుపరి సంవత్సరం వర్షాకాలం వరకు అవి అదే స్థితిలో ఉండేలా కూడా కమిటీ చూస్తుంది. వంశధార నది నుంచి ప్రవహించే మొత్తం జలాలు దిగువకు పారేందుకు, వాటిని రెండు రాష్ట్రాలు వినియోగించుకునేందుకు వీలుగా డిసెంబర్ 1 నుంచి మే 31 మధ్యకాలంలో సైడ్‌వీయర్ గేట్లు మూసివుంటాయి. ఇక నేరడిపై దృష్టి..! కాట్రగడ్డ సైడ్‌వీయర్ నిర్మాణంపై ఒడిశా దరఖాస్తును పరిష్కరించిన నేపథ్యంలో ఇప్పుడు ట్రిబ్యునల్ నేరడి బ్యారేజీపై దృష్టి పెట్టనుంది. నేరడి వద్ద బ్యారేజీకి సంబంధించిన ప్రధాన కేసు ట్రిబ్యునల్ ఎదుట పెండింగ్‌లో ఉంది. ఈ కేసులో తదుపరి విచారణను జనవరి 22న, ఏప్రిల్ 2న జరుపుతామని ట్రిబ్యునల్ మంగళవారం ప్రకటించింది. ట్రిబ్యునల్ ఉత్తర్వుపై రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజనీర్ ఎం.ఎ.రవూఫ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎల్.వి.రమణమూర్తి, తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ట్రిబ్యునల్‌లో రాష్ట్రం తరఫున వాదించిన న్యాయవాదుల బృందంలో సీనియర్ న్యాయవాదులు సి.ఎస్.వైద్యనాథన్, ఎస్.సత్యనారాయణ ప్రసాద్, ఎ.సత్యప్రసాద్, బాదన భాస్కరరావు, వై.రాజగోపాల్ తదితరులున్నారు. ఇదీ నేపథ్యం... వంశధార నది ఒడిశా-ఆంధ్ర సరిహద్దులో 29 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 82 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. ఒడిశా-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సెప్టెంబర్ 30, 1962న ఈ నదీ జలాలను 50:50 నిష్పత్తిలో పంచుకోవాలనే ఒప్పందం కుదిరింది. వంశధార ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం దీనిని రెండు దశల్లో నిర్మించాలని నిర్ణయించింది. మొదటి దశలో గొట్టా బ్యారేజీ, ఎడమ ప్రధాన కాలువలను నిర్మించి 17.841 టీఎంసీల నదీ జలాలను వినియోగిస్తూ 1.48 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయింది. రెండవ దశలో 16.048 టీఎంసీలు వినియోగించుకుంటూ 1.07 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును ప్రతిపాదించింది. నేరడి బ్యారేజి నిర్మాణానికి 106 ఎకరాల భూమి సేకరణకు ఒడిశా ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంలో ఆలస్యం అయినందున రాష్ట్ర ప్రభుత్వం వంశధార రెండవ దశ నిర్మాణాన్ని రెండు విడతలుగా చేపట్టాలని భావించింది. మొదటి దశలో గొట్టా బ్యారేజీ నుంచి కుడి ప్రధాన కాలువ నిర్మించి 0.62 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు ట్రిబ్యునల్ తీర్పు మేరకు సైడ్‌వీయర్ నిర్మాణం ద్వారా మరో 8 టీఎంసీలను వినియోగించుకోవడానికి వీలు చిక్కింది. రెండవ దశ నిర్మాణంలో భాగంగా నేరడి బ్యారేజీ, ఫ్లడ్‌ఫ్లో కాలువ, హీర రిజర్వాయర్ నిర్మించి 45 వేల ఎకరాలకు సాగులోకి తీసుకురావడంతో పాటు గొట్టా బ్యారేజీ కుడి, ఎడమ ప్రధాన కాలువల ఆయకట్టు స్థిరీక రణ జరుగుతుంది -
రైతుల జీవితాల్లో ఇసుక తుపాను
సరుబుజ్జిలి, న్యూస్‌లైన్: భారీ వర్షాలు, వరదలు విలువైన పంట లనే కాకుండా.. భూముల సారాన్ని కబళించాయి. నదీతీరాల్లో ఉన్న వందలాది ఎకరాల పంట పొలాల్లో వరదలకు కొట్టుకొచ్చిన ఇసుక మేటలు వేసింది. సారవంతమైన భూములను నిర్జీవం చేసింది. వేసిన పంటలు ఎలాగూ పో యాయి. అప్పోసప్పో చేసి మళ్లీ పంట వేద్దామ న్నా ఇసుక మేటలు అడ్డువస్తున్నాయి. ఇసుకను తొలగించి.. భూములను తిరిగి సాగుయోగ్యం గా మలచడం ఇప్పటికిప్పుడే సాధ్యం కాదని రైతులు ఆందోళన చెందుతున్నారు. పైగా దీనికే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందంటున్నారు. ఇటీవలి భారీ వర్షాల కారణంగా వంశధారకు వరద పోటెత్తడంతో తీరంలో ఉన్న పంట పొలాలు ముంపునకు గురైన విషయం తెలిసిందే. ఇప్పుడు నీరు తొలగి.. జరిగిన నష్టం కళ్లకు కడుతోంది. పొలా ల నిండా ఇసుకే కనిపిస్తోంది. కాపుకొచ్చిన వరి, ఇతర వాణిజ్య పంటలు ఇసుక మేటల్లో కూరుకుపోయాయి. సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం సమీపంలోని బెంజరుపేట పొలాల దుస్థితే దీనికి నిదర్శనం. గ్రామానికి చెందిన సుమారు వందమంది రైతులు 600 ఎకరాల్లో వరి, వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. వంశధార తీరాన్ని ఆనుకొని ఉన్న ఈ భూములు వరదలు సంభవించినప్పుడల్లా ముంపునకు గురవుతున్నాయి. ఈ గ్రామంతోపాటు అగ్రహారం నుంచి అలమాజీపేట వరకు సుమారు 1345 ఎకరాల్లో తీర భూములు విస్తరించి ఉన్నాయి. ఇటీవలి వరదల్లో ఈ భూముల్లోని పంటలన్నీ దెబ్బతిన్నాయి. కాగా వరద నీరు జిరాయితీ భూముల మీదుగా ప్రవహించడంతో సుమారు 300 ఎకరాల్లో వరి, మరో 50 ఎకరాల్లో మొక్కజొన్న, బెండ, దొండ తదితర వాణిజ్య పంటలు పూర్తిగా ఇసుకలో కూరుకుపోయాయి. మిగిలిన పొలాల్లోనూ ఎక్కడిక్కడే ఇసుక మేటలు వేయడం వల్ల వరిచేను పనికి రాకుండా పోయింది. పొలాలు నిస్సారమయ్యాయి. మదుపుల కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలి.. ఇసుక తొల గించి తిరిగి పంటలు వేసేం దుకు ఆయ్యే ఖర్చు కు ఎక్కడ తల తాకట్టు పెట్టాలని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది తిండి గింజలు కూడా కరువేనని సాధారణ రైతులే విలపిస్తుం డగా.. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ప్రభుత్వం నుంచి రుణాలు పుట్టే అవకాశం కూడా లేదని వారు వాపోతున్నారు. బెంజరుపేట గ్రామం నదీ గర్భంలో ఉండడం వల్ల ఏటా రైతులు నష్టాలు చవి చూస్తున్నారు. పంటలే కాదు లక్షలాది రూపాయల విలువైన జిరాయితీ భూములు నదీ గర్భంలో కలిసిపోతున్నాయి. తెలికిపెంట, పాతపాడు, పెదవెంకటాపురం తదితర గ్రామాలు సైతం ప్రతి ఏటా నష్టపోతున్నాయి. -
ముంచెత్తిన వంశధార
ఆమదాలవలస టౌన్, న్యూస్‌లైన్: పై-లీన్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు వంశధార నది పొంగి పొర్లింది. సుమారు 50 వేల క్యూసెక్కుల నీరు ప్రవహించడంతో నదీతీర ప్రాంతమైన చెవ్వాకులపేట గ్రామాన్ని చుట్టుముట్టింది. దీంతో ఆందోళనకు గురైన గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే తహశీల్దార్ జి.వీర్రాజు, ఎంపీడీవో పంచాది రాధ గ్రామానికి వెళ్లి 130 మందిని రామచంద్రాపురంలోని పాఠశాల భవనంలోకి తరలించారు. సోమవారం ఉదయం నుంచి భోజన ఏర్పాట్లు చేశారు. సాయంత్రానికి వంశధార ఉగ్రరూపం తగ్గడంతో పాటు చెవ్వాకులపేట గ్రామం చుట్టూ వరదనీరు తగ్గడంతో గ్రామస్తులను ఇళ్లకు పంపించారు. వరద ప్రభావంతో ఆనందపురం, చిట్టివలస, చెవ్వాకులపేట, రామచంద్రపురం తదితర గ్రామాల్లోని సుమారు వంద ఎకరాలు నీట మునిగాయి. ఆమదాలవలస- పురుషోత్తపురం ఆర్అండ్బీ రహదారి చెవ్వాకులపేట సమీపంలో జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. రక్షణ చర్యలు చేపట్టండి వరద ముంపునకు గురైన వారికి పూర్తిస్థాయిలో రక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి అధికారులను ఆదేశించారు. చెవ్వాకులపేట గ్రామాన్ని సోమవారం ఆమె సందర్శించి ప్రజలను పరామర్శించారు. వరద ముప్పు పొంచి వున్న చెవ్వాకులపేట గ్రామాన్ని ఆర్డీవో ఆర్డీఓ గణేష్‌కుమార్, మండల ప్రత్యేకాధికారి వి.జయరాజ్, పశుసంవర్ధక శాఖ జెడీ నాగన్న, సీఐ వీరాకుమార్, ఎస్ఐ మంగరాజు తదితరులు పొన్నాంపేట గ్రామ సర్పంచ్ ఇప్పిలి జయలక్ష్మిని, వరదబాధితులను కలిసి మాట్లాడారు. అనంతరం గ్రామాన్ని సందర్శించారు. బాధితులను ఆదుకుంటాం.. వరద బాధితులను ఆదుకుంటామని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు కిల్లి రామ్మోహన్రావు, బొడ్డేపల్లి మాధురీ, పార్టీ నాయకుడు తమ్మినేని చిరంజీవి నాగ్ తెలిపారు. చెవ్వాకులపేట వరద బాధితులను వారు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెవ్వాకులపేట గ్రామానికి ఏటా వరద ముప్పు తప్పడంలేదన్నారు. గ్రామంలో వరద బాధితుల పునరావాస కేంద్రాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జి.చలపతిరావు, జి.శ్రీనివాసరావు, సైలాడ దాసునాయుడు, నాగు, ఎండా విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. వరద నీటితో ఆందోళన కళింగపట్నం(గార): పై- లీన్ తుపాను ప్రభావంతో ఒడిశాలోని వంశధార నదీపరివాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో వంశధార నదికి నీరు పోటెత్తింది. మడ్డువలస గేట్లు పూర్తిగా ఏత్తేయడంతో సోమవారానికి నీటి ప్రవాహం ఉద్ధృతమైంది. దీంతో కళింగపట్నం పంచాయతీలోని శ్రీకాకుళం- కళింగపట్నం రహదారి మీదుగా వరద నీరు జోరుగా రావడంతో తాన్సాహెచ్పేట, కండ్రపేట, యాతపేట, నగరాలపేట గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. తుపాను ప్రభావంతో ఆటుపోట్లు రావడంతో నదీజలాలు సముద్రంలో కలవలేదు. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వరదనీరు రానురాను ఉద్ధృతంగా ప్రవహించింది. ముందుగా తాన్సాహెబ్పేట, కండ్రపేట గ్రామాలకు వరదనీరు ప్రవహిస్తుండడంతో జాతీయ విపత్తుబృందాలు గ్రామంలోకి వచ్చాయి. ఒక దశలో గ్రామాలు ఖాళీ చేయించాలని అధికారులు నిర్ణయించారు. గ్రామసమీపంలో సుమారు 20 ఎకరాల వరిపంట నాశనమైంది. పలు చోట్ల రహదార్లకు గండ్లుపడ్డాయి. తుపాను పర్యవేక్షణాధికారి, గతంలో శ్రీకాకుళం ఆర్డీవోగా పనిచేసిన నక్కా సత్యనారాయణ కళింగపట్నం వచ్చి వరద పరిస్థితిని పర్యవేక్షించారు. రాత్రి 9 గంటల నుంచి వరదనీరు తగ్గడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గ్రామాల్లో తహశీల్దార్ బి.శాంతి, ఆర్ఐ మురళీధర్ నాయక్‌లు పర్యటించారు.