సరుబుజ్జిలి, న్యూస్‌లైన్: భారీ వర్షాలు, వరదలు విలువైన పంట లనే కాకుండా.. భూముల సారాన్ని కబళించాయి. నదీతీరాల్లో ఉన్న వందలాది ఎకరాల పంట పొలాల్లో వరదలకు కొట్టుకొచ్చిన ఇసుక మేటలు వేసింది. సారవంతమైన భూములను నిర్జీవం చేసింది. వేసిన పంటలు ఎలాగూ పో యాయి. అప్పోసప్పో చేసి మళ్లీ పంట వేద్దామ న్నా ఇసుక మేటలు అడ్డువస్తున్నాయి. ఇసుకను తొలగించి.. భూములను తిరిగి సాగుయోగ్యం గా మలచడం ఇప్పటికిప్పుడే సాధ్యం కాదని రైతులు ఆందోళన చెందుతున్నారు. పైగా దీనికే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందంటున్నారు. ఇటీవలి భారీ వర్షాల కారణంగా వంశధారకు వరద పోటెత్తడంతో తీరంలో ఉన్న పంట పొలాలు ముంపునకు గురైన విషయం తెలిసిందే.
ఇప్పుడు నీరు తొలగి.. జరిగిన నష్టం కళ్లకు కడుతోంది. పొలా ల నిండా ఇసుకే కనిపిస్తోంది. కాపుకొచ్చిన వరి, ఇతర వాణిజ్య పంటలు ఇసుక మేటల్లో కూరుకుపోయాయి. సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం సమీపంలోని బెంజరుపేట పొలాల దుస్థితే దీనికి నిదర్శనం. గ్రామానికి చెందిన సుమారు వందమంది రైతులు 600 ఎకరాల్లో వరి, వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. వంశధార తీరాన్ని ఆనుకొని ఉన్న ఈ భూములు వరదలు సంభవించినప్పుడల్లా ముంపునకు గురవుతున్నాయి. ఈ గ్రామంతోపాటు అగ్రహారం నుంచి అలమాజీపేట వరకు సుమారు 1345 ఎకరాల్లో తీర భూములు విస్తరించి ఉన్నాయి. ఇటీవలి వరదల్లో ఈ భూముల్లోని పంటలన్నీ దెబ్బతిన్నాయి. కాగా వరద నీరు జిరాయితీ భూముల మీదుగా ప్రవహించడంతో సుమారు 300 ఎకరాల్లో వరి, మరో 50 ఎకరాల్లో మొక్కజొన్న, బెండ, దొండ తదితర వాణిజ్య పంటలు పూర్తిగా ఇసుకలో కూరుకుపోయాయి.
మిగిలిన పొలాల్లోనూ ఎక్కడిక్కడే ఇసుక మేటలు వేయడం వల్ల వరిచేను పనికి రాకుండా పోయింది. పొలాలు నిస్సారమయ్యాయి. మదుపుల కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలి.. ఇసుక తొల గించి తిరిగి పంటలు వేసేం దుకు ఆయ్యే ఖర్చు కు ఎక్కడ తల తాకట్టు పెట్టాలని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది తిండి గింజలు కూడా కరువేనని సాధారణ రైతులే విలపిస్తుం డగా.. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ప్రభుత్వం నుంచి రుణాలు పుట్టే అవకాశం కూడా లేదని వారు వాపోతున్నారు. బెంజరుపేట గ్రామం నదీ గర్భంలో ఉండడం వల్ల ఏటా రైతులు నష్టాలు చవి చూస్తున్నారు. పంటలే కాదు లక్షలాది రూపాయల విలువైన జిరాయితీ భూములు నదీ గర్భంలో కలిసిపోతున్నాయి. తెలికిపెంట, పాతపాడు, పెదవెంకటాపురం తదితర గ్రామాలు సైతం ప్రతి ఏటా నష్టపోతున్నాయి.