పోచంపల్లి చెరువు కింద ఉన్న వరి పొలాలను కప్పేసిన గుర్రపుడెక్క
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో వానాకాలం పంటలు వరద ముంపునకు గురయ్యాయి. మొలక దశలో ఉన్న వివిధ పంటలు దెబ్బతిన్నాయి. 10.76లక్షల ఎకరాల్లో నేరుగా నీటి ముంపునకు గురికాగా, మరో 4 లక్షల ఎకరాలు అధిక వర్షాల తాకిడితో మొలక స్థాయిలో ఉన్న పంటలు, వరి నార్లకు నష్టం జరిగింది. ఇలా 16 లక్షలకు పైగా ఎకరాలపై వర్షాల ప్రభావం పడిందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
నాట్లు వేసిన నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ,ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో వరి పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి.ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ సమీప ప్రాంతాల్లో గత 20 రోజుల క్రితం వేసిన వరి నాట్లు నీటమునిగాయి. సూర్యాపేట జిల్లా కిష్టాపురం, మౌగిలాయకోట, శాంతినగర్, లక్కవరం, గోండ్రియాల, కొత్తగూడెం తదితర గ్రామాల్లో కూడా వరి నాట్లు ముంపునకు గురయ్యాయి.
ఖమ్మం జిల్లాలోని జక్కపల్లి, సిద్దెపల్లి, రామచంద్రపురం, పైనంపల్లి, బుద్దారం తదితర గ్రామాల్లో పంటలపై కూడా వరద ప్రభావం పడింది. ఆదిలాబాద్ , ఆసిఫాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలతో పాటు భద్రాద్రి జిల్లా చర్ల, వాజేడు, వెంకటాపురం తదితర ప్రాంతాల్లో పంటలకు తీవ్రంగా నష్టం జరిగింది. గోదావరి నది రెండు వైపులా ఉప్పొంగి కిలోమీటరు నుంచి రెండు కిలోమీటర్ల మేర పంటలను ముంచెత్తుకుంటూ పారింది. అనేక ప్రాంతాల్లో ఒక్క పంట కూడా పనికి వచ్చే పరిస్థితి లేదని క్షేత్రస్థాయి అధికారులు అంటున్నారు.
పత్తిపై అధిక ప్రభావం
ఈ సీజన్లో ఇప్పటివరకు 40.73లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యింది. కాగా వర్షాల ప్రభావం ఎక్కువగా ఈ పంటపైనే పడినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్, మంచిర్యా ల, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పత్తి పంటపై తీవ్ర ప్రభావం పడింది. తాజాగా వేసి న పత్తి విత్తనాలు వర్షాలకు మొలకెత్త కుండానే భూమిలోనే మురిగిపోయాయి. ఇక మొలక స్థాయి లో ఉన్న పత్తి నీటిలో మునిగి దెబ్బతింది. వరినాట్లు కూడా నీట మునిగాయి.
ఇప్పటివరకు 15.63లక్షల ఎకరాల్లో వరినాట్లు పడగా.. వీటిలో 5లక్షలకు పైగా ఎకరాల్లో నీరు చేరిందని అధికా రులు చెబుతున్నారు. వరి నార్లు మొత్తం దెబ్బతిన్నాయని, మళ్లీ నార్లు పోసుకోవాల్సిందేనని రైతు లు అంటున్నారు. ఇక సోయాబీన్ సాగు ఇప్పటివరకు 4.14లక్షల ఎకరాల్లో సాగు చేయగా.. ఆదిలా బాద్ జిల్లాలో ఈ పంటపై ఎక్కువ ప్రభావం పడినట్లు తెలుస్తోంది.
పొలాలను ముంచేసిన గుర్రపుడెక్క
భూదాన్‌పోచంపల్లి: భారీ వర్షాలతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి చెరువు నిండి అలుగుపోస్తోంది. ఈ చెరువులోని గుర్రపు డెక్క కూడా కొట్టుకువచ్చి వరి పొలాలను కమ్మేసింది. దీనితో పోచంపల్లిలో 30ఎకరాలు, పిలాయిపల్లిలో 2ఎకరాల వరికి నష్టం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment