సాక్షి ప్రతినిధి, వరంగల్: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు రాష్ట్రంలోని గోదావరి పరీవాహక ప్రాంత రైతులను నిండా ముంచాయి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో వరిపైర్లు వరదల తీవ్రతకు కొట్టుకుపోవడంతోపాటు పొలాలు కోతకు గురై ఇసుక మేటలు వేశాయి.
చాలాచోట్ల పొలాల్లోనే విద్యుత్ తీగలు, స్తంభాలు పడిపోగా ట్రాన్స్‌ఫార్మర్లు వరదలో మునిగాయి. సుమారు లక్షన్నర ఎకరాల్లో పంటలు దెబ్బతినగా ఇసుక మేటలు తొలగించలేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వరదలకు ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లో 22 మంది గల్లంతవగా ఇంకా ముగ్గురి ఆచూకీ లభించలేదు.
తేలని నష్టపరిహారం లెక్కలు...
వరదల్లో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ. 10 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించినా ఆ ప్రకియ ఇంకా కార్యరూపం దాల్చలేదు. కేంద్ర, రాష్ట్ర బృందాలు ఐదు రోజులపాటు క్షేత్రస్థాయిలో పర్యటించినా అధికారికంగా నష్టాలను తేల్చలేదు. పంట నష్టం 33 శాతంపైన ఉంటేనే వరద నష్టం అంచనా వేస్తామని మండలస్థాయి అధికారులు చెబుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు.
దీంతో నాట్ల దశలో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం వర్తించదన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణవ్యాప్తంగా సుమారు రూ. 2,400 కోట్ల మేర నష్టం ఉంటుందని ప్రాథమిక అంచనా కాగా.. గోదావరి పరీవాహక ప్రాంతాల్లోనే రూ. 1,000 కోట్లపైన నష్టం ఉంటుందని చెబుతున్నారు. ఇంత నష్టం జరిగినా అధికారులు మార్గదర్శకాలతో మల్లగుల్లాలు పడుతుండగా ఏం చేయాలో తెలియక రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.
అయినోళ్ల కోసం కళ్లలో వత్తులు వేసుకొని...
బండ్ల సారయ్య–సారమ్మ... సారయ్య తల్లి రాజమ్మ... ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం బూరుగుపేటకు చెందిన ఈ ముగ్గురిని వరద మింగేసింది. జూలై 27న కురిసిన అతిభారీ వర్షంతో మారేడుగొండ చెరువుకు గండిపడి వరద ప్రవాహానికి సారయ్య ఇల్లు కొట్టుకుపోయింది. ఇంట్లో ఉన్న సారయ్య, సారమ్మ, రాజమ్మ గల్లంతయ్యారు. వారికి కొంతదూరంలో నివసించే సారయ్య కొడుకు, కోడలు ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. వరద తగ్గాక సారయ్య మృతదేహం లభించినప్పటికీ అత్తా కోడళ్లయిన రాజమ్మ, సారమ్మల ఆచూకీ ఇంకా లభించలేదు. దీంతో ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది.
వరదలతో ఆగమయ్యాం..
నాలుగు ఎకరాల్లో ఇసుకమేటలు వేసినా ఇప్పటివరకు ఒక్క అధికారి కూడా మా ముఖం చూడలేదు. వరదలతో ఆగమయ్యాం. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.
– కొక్కిరాల తిరుపతిరావు, రైతు, పరకాల
ఈ ఫొటోలోని యువరైతు పేరు కూతురు భూపాల్‌రెడ్డి. హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన ఈయనకు చలివాగు వంతెన సమీపంలో 2.26 ఎకరాల పొలం ఉంది. ఈసారి సన్నరకం నారు అలికి సాగుకు సిద్ధపడుతున్న సమయంలో చలివాగు ప్రవాహానికి కొట్టుకుపోయి పొలమంతా ఇసుకమేటలు వేసింది. దీంతో రూ. లక్ష నష్టం వాటిల్లిందని ఆవేదన చెందుతున్నాడు.
భూపాలపల్లి జిల్లా మోరంచపల్లికి చెందిన ఈ రైతు పేరు శ్రీపతి తిరుపతి. రెండెకరాల సాగుభూమిలో భారీగా ఇసుక మేటలు వేసింది. ఇసుక మేటను తీయాలంటే కనీసం రూ. 20 వేల ఆదనపు ఖర్చయ్యేలా ఉంది. తన చేతిలో చిల్లిగవ్వ కూడా లేనందున పంట వదిలేయడం తప్ప వేరే మార్గం లేదంటున్నాడు.
ఈయన పేరు చల్ల రవీందర్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్ల గ్రామానికి చెందిన రైతు. మానేరు వరద ఉధృతికి ఆయన మూడెకరాల పొలంలో పూర్తిగా ఇసుక మేటలు వేసింది. ఇప్పటికే పొలం దున్నడానికి రూ.10 వేల వరకు ఖర్చు చేశాడు. ప్రభుత్వం తక్షణమే పంట నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment