
బీఆర్‌ఎస్ నేతలు హైకోర్టును
ఆశ్రయించడంతో.. షరతులతో కూడిన అనుమతులిచ్చిన పోలీసులు
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి పరిధిలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు పోలీసులనుంచి ఎట్టకేలకు అనుమతి లభించింది. ఎల్కతుర్తిలో రజతోత్సవ సభ నిర్వహించడానికి మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు.. మార్చి 28న కాజీపేట ఏసీపీ తిరుమల్‌కు దరఖాస్తు చేశారు. అనుమతి ఇవ్వడంలో ఆలస్యం జరగడంతో సదరు నేతలు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో రజతోత్సవ సభను నిర్వహించేందుకు.. శనివారం వరంగల్ పోలీసులే షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. సభ సందర్బంగా ఎక్కువ మంది గుమిగూడవద్దని, దరఖాస్తులో పేర్కొన్న విధంగా సమయాలకు కట్టుబడి ఉండాల ని సూచించారు. సమావేశానికి హాజరయ్యే వీఐపీలు/ ప్రజలకు భద్రత కల్పించాలని, నిఘా కోసం తగినన్ని సీసీ టీవీ కెమెరాలను అమర్చాలని స్పష్టం చేశారు. పటిష్టమైన బారికేడ్లు, నిటారుగా సైన్ బోర్డులు, పురుషులు/మహిళలకు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు.
ప్రథమ చికిత్స, వైద్య సదుపాయాలు, అగ్నిమాపక భద్రత చర్యల్లో భాగంగా ఫైరింజన్లు, అగ్నిమాపక పరికరాల ఏర్పాటు తప్పనిసరని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీజేలను ఉపయోగించరాదని, వేదిక వద్ద ఒక బాక్స్ రకం స్పీకర్ మాత్రమే ఉండాలని తదితర అనేక షరతులతో అనుమతి ఇచ్చారు. రజతోత్సవ సభకు అనుమతించినందుకు మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.