
నడుములోతు నీళ్లలో నడిచి వెళ్లి బిందెలతో నీరు తెచ్చుకుంటున్న మహిళలు
శ్రీకాకుళం: ఎల్.ఎన్.పేట మండలంలోని 38 గ్రామాల ప్రజల మంచినీటి అవసరాలు తీర్చాల్సిన మెగా రక్షిత పథకం ద్వారా సక్రమంగా నీటి సరఫరా జరగడం లేదు. తరచూ పైపుల లీకేజీలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్య అధికారుల దృష్టిలో ఉన్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ఓసారి వారం రోజులు పాటు 38 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. సమీపంలోని వంశధార తీరంలో చలమలు తవ్వి ఊరిన నీటిని తెచ్చుకొని అవసరాలు తీర్చుకున్నారు. వారి సమస్య కొంత తీరినప్పటికీ దబ్బపాడు గ్రామస్తులకు మాత్రం కష్టాలు తప్పలేదు. మూడు నెలలుగా రక్షిత పథకం నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో గొంతు తడుపుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ఉన్న బోర్లు పనిచేయకపోవటం, పనిచేసినా వాటినీరు తాగేందుకు, వంట అవసరాలకు పనికిరావు. దీంతో వంశధార నదిలోని చలమల నుంచి సేకరించిన నీటినే వంట అవసరాలకు, తాగేందుకు ఉపయోగిస్తున్నారు. గత నాలుగు రోజులుగా నదిలో నీటి ప్రవాహం పెరిగినప్పటికీ.. తప్పనిసరి పరిస్థితిలో నడుమ లోతు నీటిలో దిగి వెళ్లి ఇసుక దిబ్బలపై చలమగొయ్యిలు తవ్వి నీటిని తెచ్చుకుంటున్నామని మాజీ సర్పంచ్ జమ్మి పద్మావతితో పాటు పలువురు మహిళలు తెలిపారు. ఆర్థికంగా ఉన్నవారు ఆటోలు, ద్విచక్ర వాహనాలపై పక్కనున్న గ్రామాలకు వెళ్లి క్యాన్లతో నీటిని తెచ్చుకుంటున్నారన్నారు. నీటి కష్టాలపై పది రోజుల క్రితం సర్పంచ్ ముద్దాడ మోహినితో పాటు పలువురు యువకులు ఎంపీడీఓకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలానికి పది నెలలుగా ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ లేకపోవటం, ఇన్‌చార్జి జేఈ ఎవరో కూడా తెలియకపోవటంతో సమస్య పరిష్కారం కాలేదంటున్నారు.
రెండు రోజుల్లో పరిష్కరిస్తాం
దబ్బపాడు గ్రామస్తులు ఎదుర్కొంటున్న నీటి సమస్యను ఎంపీడీవో ఆర్.కాళీప్రసాదరావు దృష్టికి తీసుకెళ్లాగా రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామన్నారు. ప్రత్యేక అధికారి కె.రామారావు, ఆర్‌డబ్ల్యూఎస్ జేఈతో కలసి పైపులైన్‌ను పరిశీలించామన్నారు. 800 మీటర్ల పైపు లైన్ పాడవ్వటం, పాత కాంట్రాక్టర్ మారి కొత్త కాంట్రాక్టర్ రావటం, కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం నిధులు విడుదల కాకపోవడం వంటి సమస్యల కారణంగా జాప్యం జరిగిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment