Srikakulam Rural
-
ఆక్రమణ కట్టడాలను కూల్చివేతను అడ్డుకున్న టీడీపీ వర్గీయులు..
సాక్షి,ఇచ్ఛాపురం : ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను రక్షించుకోవాలన్న ప్రభుత్వ ఆశయానికి టీడీపీ వర్గీయులు తూట్లు పొడుస్తున్నారు. స్థానిక మహిళలను రెచ్చగొడుతూ అధికారులు, పాలకవర్గాలపైకి ఉసుగొల్పుతున్నారు. ఇటువంటి సంఘటన శనివారం కొఠారీ పంచాయతీలో చోటుచేసుకుంది. కొఠారీ కాలనీ వద్ద సర్వే నంబర్ 133, 135–12లో ప్రభుత్వ స్థలంలో ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ‘మిషన్ ప్రభుత్వ భూమి సంరక్షణ’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఎంఆర్ఐ మద్దిలి కృష్ణమూర్తి, మండల సర్వేయర్ తవిటినాయుడుతో పాటు సర్పంచ్ దుక్క ధనలక్ష్మి, వీఆర్వో, సచివాలయ సర్వేయర్, స్థానికులు కొంతమంది కలసి గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఆక్రమణ కట్టడాల వద్దకు వెళ్లారు. అయితే అప్పటికే టీడీపీ నేతలు రెచ్చగొట్టడంతో స్థానిక మహిళలు కొందరు సంఘటనా స్థలం వద్దకు చేరుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చింపేశారు. చదవండి:Bhola Shankar: చిరుకు సోదరిగా కీర్తి సురేశ్.. రాఖీ వీడియో వైరల్ అక్కడితో ఆగకుండా అధికారులు, సర్పంచ్ ధనలక్ష్మి, ఆమె భర్త ఆనంద్, కుమారుడుపై దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో సర్పంచ్ ధనలక్ష్మి స్వల్ప గాయాలతో బయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో రెవెన్యూ సిబ్బంది అక్కడ నుంచి వెళ్లిపోయారు. దాడికి పాల్పడిన దువ్వు పోతయ్య, దుక్క దీనబందు, సావిత్రి, జయ, దువ్వు జానికమ్మలపై సర్పంచ్ ధనలక్ష్మి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్‌కు ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేయడంతో ఆయన సంఘటనా స్థలానికి చేరుకొని కాలనీ వాసులతో మాట్లాడారు. తహసీల్దార్ దాసరి చిన్న రామారావుకు ఫోన్‌చేసి ఇటువంటి పరిస్థితుల్లో రెవెన్యూ అధికారులు కలుగజేసుకోకూడదంటూ హెచ్చరింపు ధోరణిలో మాట్లాడినట్లు తెలిసింది. చదవండి:లోకేష్ తీరుపై ఏపీ పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం -
నదిలో దిగితేనే దాహం తీరేది..
శ్రీకాకుళం: ఎల్.ఎన్.పేట మండలంలోని 38 గ్రామాల ప్రజల మంచినీటి అవసరాలు తీర్చాల్సిన మెగా రక్షిత పథకం ద్వారా సక్రమంగా నీటి సరఫరా జరగడం లేదు. తరచూ పైపుల లీకేజీలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్య అధికారుల దృష్టిలో ఉన్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ఓసారి వారం రోజులు పాటు 38 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. సమీపంలోని వంశధార తీరంలో చలమలు తవ్వి ఊరిన నీటిని తెచ్చుకొని అవసరాలు తీర్చుకున్నారు. వారి సమస్య కొంత తీరినప్పటికీ దబ్బపాడు గ్రామస్తులకు మాత్రం కష్టాలు తప్పలేదు. మూడు నెలలుగా రక్షిత పథకం నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో గొంతు తడుపుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న బోర్లు పనిచేయకపోవటం, పనిచేసినా వాటినీరు తాగేందుకు, వంట అవసరాలకు పనికిరావు. దీంతో వంశధార నదిలోని చలమల నుంచి సేకరించిన నీటినే వంట అవసరాలకు, తాగేందుకు ఉపయోగిస్తున్నారు. గత నాలుగు రోజులుగా నదిలో నీటి ప్రవాహం పెరిగినప్పటికీ.. తప్పనిసరి పరిస్థితిలో నడుమ లోతు నీటిలో దిగి వెళ్లి ఇసుక దిబ్బలపై చలమగొయ్యిలు తవ్వి నీటిని తెచ్చుకుంటున్నామని మాజీ సర్పంచ్ జమ్మి పద్మావతితో పాటు పలువురు మహిళలు తెలిపారు. ఆర్థికంగా ఉన్నవారు ఆటోలు, ద్విచక్ర వాహనాలపై పక్కనున్న గ్రామాలకు వెళ్లి క్యాన్లతో నీటిని తెచ్చుకుంటున్నారన్నారు. నీటి కష్టాలపై పది రోజుల క్రితం సర్పంచ్ ముద్దాడ మోహినితో పాటు పలువురు యువకులు ఎంపీడీఓకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలానికి పది నెలలుగా ఆర్డబ్ల్యూఎస్ జేఈ లేకపోవటం, ఇన్చార్జి జేఈ ఎవరో కూడా తెలియకపోవటంతో సమస్య పరిష్కారం కాలేదంటున్నారు. రెండు రోజుల్లో పరిష్కరిస్తాం దబ్బపాడు గ్రామస్తులు ఎదుర్కొంటున్న నీటి సమస్యను ఎంపీడీవో ఆర్.కాళీప్రసాదరావు దృష్టికి తీసుకెళ్లాగా రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామన్నారు. ప్రత్యేక అధికారి కె.రామారావు, ఆర్డబ్ల్యూఎస్ జేఈతో కలసి పైపులైన్‌ను పరిశీలించామన్నారు. 800 మీటర్ల పైపు లైన్ పాడవ్వటం, పాత కాంట్రాక్టర్ మారి కొత్త కాంట్రాక్టర్ రావటం, కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం నిధులు విడుదల కాకపోవడం వంటి సమస్యల కారణంగా జాప్యం జరిగిందన్నారు. -
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే కళావతి
సాక్షి,శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఎటువంటి సాయం అందక కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రునికి పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి సాయమందించారు. గురువారం రాత్రి 10 గంటల సమయంలో సీతంపేట మండలం పత్తికగూడ మీదుగా వస్తున్న ఎమ్మెల్యేకు రహదారి పక్కన ప్రమాదానికి గురైన క్షతగాత్రుడు కనిపించాడు. అతడుపాలకొండ మండలం ఓని గ్రామానికి చెందిన కనపాక రాంబాబుగా గుర్తించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్న రాంబాబును ఎమ్మెల్యే తన వాహనంలో వ్యక్తిగత సిబ్బంది ద్వారా బాధితున్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించే ఏర్పాటు చేసి మానవత్వం చాటుకున్నారు. సిబ్బంది దగ్గరుండి చికిత్స చేయించారు. -
విషాదం: పెళ్లి బట్టలు కొనేందుకు వెళ్తూ..
సాక్షి,శ్రీకాకుళం రూరల్: మరికొద్ది రోజుల్లో పెళ్లి భజంత్రీలు మోగాల్సిన ఇంట.. చావు బాజా మోగింది. కుమార్తె వివాహానికి అవసరమైన దుస్తులు, ఇతర సామగ్రి కొనుగోలు చేసేందుకు వెళ్తున్న దంపతుల ద్విచక్ర వాహనాన్ని వ్యాన్ ఢీకొట్టిన ఘటనలో భార్య మృతి చెందగా.. భర్త తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన శ్రీకాకుళం రూరల్ మండలం చల్లపే ట వద్ద బుధవారం చోటు చేసుకుంది. ఈ ఘోరంలో ఆమదాలవలస మండలం కలివరం గ్రామానికి చెందిన బరాటం నాగరత్నం (45) మృతి చెందగా.. ఆమె భర్త మల్లేషు తీవ్రంగా గాయపడ్డారు. రూరల్ పోలీసుల కథనం ప్రకారం..బరాటం మల్లేషు కుమా ర్తె సుప్రియకు ఆగస్టు రెండో తేదీన వివాహం నిశ్చయమైంది. దీంతో దుస్తులు, బంగారం ఇతర సామగ్రిని నరసన్నపేటలో కొనుగోలు చేసేందుకు భార్య నాగరత్నంతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఎఫ్‌సీ గొడౌన్ దాటాక చల్లపేట గ్రామం వద్దకు రాగానే వీరి వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన బొలేర్ వ్యాన్ ఢీకొట్టింది. ద్విచక్ర వాహనా న్ని 50 అడుగుల దూ రం ఈడ్చుకుంటూ వెళ్లిన వ్యాన్ విద్యుత్ స్తంభాన్ని కూడా ఢీకొట్టి ఆగింది. ఈ ఘోరంలో నాగర త్నం ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. భర్త మల్లేషు తీవ్రంగా గాయపడ్డారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో 108 వాహనంలో శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రి కి తరలించారు. నాగరత్నం, మల్లేషు దంపతులకు కుమార్తె, కుమారుడున్నారు. కుమార్తె వివాహానికి ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ప్రమాదం జరగడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నా రు. కలివరం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. రూరల్ ఎస్ఐ రాజేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నాగరత్నం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం రిమ్స్‌కి తరలించారు. వ్యాన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
టోపీ బాబు..వాగ్దానాల డాబు..
అలవికాని హామీలెన్నో ఇచ్చారు.. నెరవేర్చలేక బొక్క బోర్లాపడ్డారు.. చివరకు గెలిపించిన ప్రజలను నట్టేట ముంచారు.. ఐదేళ్ల పాలనలో ఒక్క హామీని కూడా సంపూర్తిగా నెరవేర్చలేదు. పలు ప్రాజెక్టులు అర్ధంతరంగానే ఆగిపోయాయి. ప్రచార ఆర్భాటమే గానీ జిల్లాకు చేసిందేమీ లేదు. వైఎస్సార్ హయాంలో పరుగులు పెట్టిన వంశధార, ఆఫ్‌షోర్ ప్రాజెక్టులు చంద్రబాబు పాలనలో చతికిలపడ్డాయి. భావనపాడు పోర్టు శిలాఫలకానికి సైతం నోచలేదు. ఇలా రైతాంగానికీ, ఇతర వర్గాలకు ఎటువంటి మేలూ జరగకుండానే టీడీపీ ప్రభుత్వ కాలం ముగిసిపోయింది. సాక్షి, శ్రీకాకుళం: ఈ ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ పాలనలో నేతల ప్రధాన హామీలేవీ అమలుగాలేదు. పలు ప్రాజెక్టులు అర్ధంతరంగానే ఆగిపోయాయి. ఐదేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులు ఇచ్చిన హామీలు, తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు జిల్లా పర్యటనల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు దాదాపు నెరవేరకుండాపోయాయి. ఐదేళ్ల పాలన అదిగో ఇదిగో అంటూ ఆర్భాటపు ప్రచారంతోనే గడిచిపోయింది. జిల్లాలకు ఆర్థిక వనరులు సమకూర్చే ప్రధాన హామీలను సైతం పూర్తి చేయలేని దీనపరిస్థితి ఏర్పడింది. దీంతో జిల్లాలో రైతాంగానికీ, ఇతర వర్గాలకు ఎటువంటి మేలూ జరగకుండానే టీడీపీ ప్రభుత్వ కాలం ముగిసిపోయింది. కుంటుపడిన వంశధార ప్రాజెక్టు దాదాపు 19 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో వంశధార స్టేజ్–2 ఫేజ్–2 ప్రాజెక్టుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాంది పలికారు. ఆయన హయాంలోనే ప్రాజెక్టు పనులు, నిర్వాసితులకు పునరావాస ఏర్పాట్లు 60 శాతం పూర్తయ్యాయి. వైఎస్ అకాల మరణంతో ప్రాజెక్టు పనులు కుంటుపడ్డాయి. ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని గత ఎన్నికలలో హామీ ఇచ్చిన చంద్రబాబు, జిల్లా టీడీపీ నాయకులు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి రెండేళ్లు పట్టించుకోలేదు. తర్వాత యూత్ ప్యాకేజీ తీసుకొచ్చి 18 ముంపు గ్రామాల నుంచి తరలించినా వారికి నిర్వాసిత కాలనీల్లో తగిన ఏర్పాట్లు చేయలేదు. ఇప్పుడిప్పుడే అక్కడి నిర్వాసితులు తేరుకుంటున్నారు. మిగిలిన ప్రాజెక్టులను పూర్తి చేయించడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వంశధార స్టేజ్–2 ఫేజ్–2 పనుల్లో ప్యాకేజీ 87 టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థే చేస్తోంది. నది నుంచి వరదకాలువకు నీరు మళ్లించే సైడ్ వియర్, వరద కాలువ, సింగిడి బ్యాలెన్సింగ్ రిజర్వాయరు నిర్మాణ పనులను ఇప్పటికీ ఆ సంస్థ పూర్తి చేయలేకపోయింది. చంద్రబాబు సొంత మనిషైన సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థను అదిలించడానికి, కదిలించడానికి ఇంజనీరింగ్ అధికారులు పెద్దగా సాహసం చేయలేకపోయారు. గత ఏడాదే వంశధార ప్రాజెక్టులో భాగమైన హిరమండలం జలాశయంలో నీరు నింపుతామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీ కూడా నెరవేరని పరిస్థితి ఏర్పడింది. రెండేళ్ల క్రితం హిరమండలంలో బహిరంగసభకు హాజరైన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వంశధార నిర్వాసితులకు అభయమిచ్చిన సంగతి తెలిసిందే. తమ పార్టీ అధికారంలోకి వస్తే నిర్వాసితుల సమస్యలన్నీ పరిష్కరిస్తానని, ప్రాజెక్టు పెండింగ్ పనులు సత్వరమే పూర్తి చేసి రైతాంగానికి పుష్కలంగా సాగునీరు అందుబాటులోకి తెస్తానని హామీ ఇచ్చారు. ఇదే హామీని ‘నవరత్నాల్లో’నూ పునరుద్ఘాటించారంటే దానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థమవుతోంది. కలగా మిగిలిన ‘ఆఫ్‌షోర్’ మహేంద్ర తనయ నది నీటిని సద్వినియోగం చేసుకునేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఆఫ్‌షోర్ ప్రాజెక్టుకూ నాంది పలికారు. దీన్ని కూడా 2018 డిసెంబరు నాటికే పూర్తి చేస్తామని చంద్రబాబుతో పాటు పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ కూడా పలుమార్లు చెప్పుకొచ్చారు. కానీ నేటికీ ఆ ప్రాజెక్టు పనులు సగం కూడా పూర్తికాలేదు. ఈ పరిస్థితి తలెత్తడానికి శివాజీ అల్లుడు యార్లగడ్డ వెంకన్న చౌదరి మితిమీరిన జోక్యం కూడా ప్రధాన కారణమనే విమర్శలు ఉన్నాయి. ఇక వంశధార నది కరకట్టల నిర్మాణ పనులకు తొలి నాలుగున్నరేళ్లు పట్టించుకోకుండా ఎన్నికలు సమీపిస్తున్నాయనగానే ఇటీవల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు శంకుస్థాపన చేసి మమ అనిపించారు. పనులు మాత్రం మొదలవ్వలేదు. వంశధార–నాగావళి నదుల అనుసంధానం చేశామని ఒకవైపు చంద్రబాబు, టీడీపీ నాయకులు ఘనంగా చెప్పుకుంటున్నా ఇక్కడి పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. వంశధార ప్రాజెక్టులోని హిరమండలం జలాశయం నుంచి నారాయణపురం ఆనకట్ట వరకూ నిర్మిస్తున్న హైలెవల్ కెనాల్ (హెచ్ఎల్సీ) పనులు తూతూమంత్రంగానే జరుగుతున్నాయి. అలాగే ఆమదాలవలస, రాజాం నియోజకవర్గ రైతులకు కీలకమైన నారాయణపురం ఆనకట్ట ఆధునికీకరణ పనులు చేపడతామని గత మూడేళ్లుగా ఊరిస్తున్న టీడీపీ నాయకులు చివరకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఇటీవలే మొక్కుబడిగా ముగించిన సంగతి తెలిసిందే. భావనపాడుపై నాన్చుడు ధోరణి టెక్కలి నియోజకవర్గంలోని సంతబొమ్మాళి, పలాస నియోజకవర్గంలోని వజ్రపుకొత్తూరు మండలం సరిహద్దులో భావనపాడు వద్ద పోర్టు నిర్మిస్తామంటూ చంద్రబాబు, టీడీపీ నాయకులు ఇచ్చిన హామీ నేటికీ నీటిమూటగానే మిగిలిపోయింది. ఈ పోర్టును ప్రైవేట్ సంస్థ ఆదానీకి అప్పగిస్తూ గత ఏడాది విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సులో ఎంఓయూ కుదిరింది. అయితే శంకుస్థాపన మాత్రం వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ఇటీవల భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన కార్యక్రమం సమయంలోనే భావనపాడు పోర్టు శిలాఫలాకాన్నీ అక్కడే చంద్రబాబుతో ఆవిష్కరించడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ అదీ ఆఖర్లో ఆగిపోయింది. సుగర్స్ రైతుల నోట్లో చేదు ఆమదాలవలస కోఆపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తామని గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, కూన రవికుమార్ హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేరుస్తామంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్లు హంగామా చేశారు. తీరా అది సాధ్యం కాదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఏడాది ఆమదాలవలసలో జరిగిన ఏరువాక కార్యక్రమంలో తేల్చిచెప్పేశారు. అక్కడ పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. కానీ ఇప్పటివరకూ అదీ కార్యరూపం దాల్చలేదు. సిక్కోలుపై చిన్నచూపు జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం నగరంలో టీడీపీ ప్రభుత్వం చెప్పుకోవడానికి కనీసం ఒక్క ప్రాజెక్టు కూడా లేదు. నగరం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మిస్తామని, సిటీలో మురుగు సమస్య నిర్మూలించేందుకు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని గత ఎన్నికల ప్రచారంలోనే కాదు నగరానికి వచ్చినప్పుడల్లా చంద్రబాబు హామీ ఇస్తూనే వచ్చారు. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. కనీసం నగరం నడిబొడ్డున పశుసంవర్థక శాఖ స్థలంలో నిర్మించిన 30 షాపుల వ్యాపార సముదాయాన్ని కూడా ప్రారంభించలేదు. చేనేత వృత్తిదారులకు ప్రథమ ప్రాధాన్యంతో కేటాయిస్తామని అధికారులు.. కాదు తమవారికే దక్కాలని టీడీపీ నాయకులు పట్టుబట్టడంతో ఆ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. -
ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల సమస్య తీరేదెప్పుడో?
సాక్షి, డెంకాడ(శ్రీకాకుళం): గ్రామస్థాయిలో వైద్య సేవలకు కేంద్రాలుగా ఉండే ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలకు సొంత గూడు కరువైంది. అద్దె కొంపల్లో చాలీ చాలని స్థలంలో కేంద్రాలను నడుపుతున్నారు. కొన్నింటికి సొంత భవనాలు ఉన్నా అవి శిథిలావస్థకు చేరాయి. దీంతో గ్రామీణప్రాంతీయులకు వైద్య సేవలు సక్రమంగా అందడం లేదు. ముఖ్యంగా గర్భిణులు బాలింతలకు వైద్య సేవలు అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గర్భిణులు, బాలింతలకు ప్రతీ వారం వైద్య పరీక్షలు చేసే సమయంలో, చంటి పిల్లలకు వ్యాకిన్ వేసే సమయంలో అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల భవనాలు నిర్మించి చాలా కాలం కావటంతో అవి శిథిల దశకు చేరుకున్నాయి. గ్రామాలు పీహెచ్‌సీలకు దూరంగా ఉంటాయి. దీంతో గ్రామస్థాయిలో రోగులకు వైద్య సేవలు అందించేందుకు ఉండాల్సిన వసతి కూడా కరువైంది. వైద్య సిబ్బందికి కూడా అవస్థలు తప్పటం లేదు. డెంకాడ మండలం అక్కివరం, జొన్నాడ గ్రామాల్లో సబ్సెటర్ సెంటర్లకు సొంత భవనాలు ఉన్నాయి. వీటిలో జొన్నాడలో ఉన్న సబ్‌సెంటర్ భవనం శిథిల దశకు చేరింది. పూసపాటిరేగ మండలంలో ఉన్న రెండు భవనాలు కూడా పాడయ్యాయి. నెల్లిమర్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఉన్నతాధికారులకు నివేదించాం ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలకు సొంత భవనాలు లేనివాటి వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాం. ఆయా సబ్‌సెంటర్ల వారీగా వివరాలు ఇచ్చాం. దీనికి సంబంధించి స్థలం చూపితే మంజూరు చేస్తామంటున్నారు. – డాక్టర్ సత్యవాణి, డెంకాడ పీహెచ్సీ పంచాయతీ భవనంలోనే విధులు జొన్నాడలో సబ్‌సెంటర్ భవనం శిథిల దశకు చేరింది. పంచాయతీ భవనంలోనే వాక్సిన్లు వేస్తున్నారు. పంచాయతీ కార్యాలయంలో సా ధారణ పాలనాపరమైన పనులు ఉంటాయి. దీంతో ప్రజలు వస్తుంటారు. దీంతో గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. – కె.రమణి, జొన్నాడ -
సాగునీటి పంపిణీలో మాటలు తప్ప చేతలు లేవు..!
సాక్షి, తెర్లాం(శ్రీకాకుళం): సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం తోటపల్లి ప్రధాన కుడి కాలువ కింద ఉన్న భూములకు సాగునీరు అందించేందుకు పిల్ల కాలువను మాత్రం ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. పిల్ల కాలువలు మంజూరయ్యాయని, వాటిని తవ్వేందుకు రైతుల నుంచి భూములు సేకరిస్తున్నామని అధికారులు పదేపదే చెప్పడమే మిగులుతుందే తప్ప ఇప్పటివరకు పిల్ల కాలువల ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో నియోజకవర్గంలోని పలు మండలాల్లో వేలాది ఎకరాల భూములు బీడు భూములుగా మారుతున్నాయి’. ఇదీ పరిస్థితి.. నియోజకవర్గంలోని తెర్లాం, బాడంగి, బొబ్బిలి మండలాలను కలుపుతూ తోటపల్లి ప్రధాన కుడికాలువను నిర్మించారు. ఈ కాలువ కింద సుమారు 30 వేల ఎకరాల వరకు మూడు మండలాలకు చెందిన భూములు ఉన్నాయి. వీటిలో తెర్లాం మండలంలోని తోటపల్లి ప్రధాన కుడి కాలువ కింద 10 వేల ఎకరాల భూములు ఉండగా, కేవలం మూడు పిల్ల కాలువల ద్వారా 4 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. మిగిలిన భూములకు చుక్క సాగునీరు కూడా అందడం లేదని పలు గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అంతంతమాత్రంగా పిల్ల కాలువల నిర్మాణం... నియోజకవర్గంలోని బొబ్బిలి, బాడంగి, తెర్లాం మండలాల మీదుగా వెళ్తున్న తోటపల్లి ప్రధాన కుడి కాలువకు సంబంధించి బొబ్బిలి, బాడంగి మండలాలకు సంబంధించి ఇంతవరకు పిల్ల కాలువలను ఏర్పాటు చేయలేదు. తెర్లాం మండలంలో 27 కిలో మీటర్ల పరిధిలో తోటపల్లి ప్రధాన కుడికాలువ ఉండగా కేవలం మూడు పిల్లకాలువలను ఏర్పాటు చేసి, 4వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిస్తున్నారు. తమ పొలాల మీదుగా, గ్రామాల మీదుగా తోటపల్లి ప్రధాన కుడికాలువ ఉన్నా తమకు ఎటువంటి ప్రయోజనం లేకపోతుందని పలు గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాటలు తప్ప చేతల్లేవ్.. తోటపల్లి ప్రధాన కుడి కాలువ కింద ఉన్న భూములకు సాగునీరు అందించేందుకు పిల్ల కాలువలు ఏర్పాటు చేస్తామని సంబంధిత అధికారులు పదేపదే ప్రకటిస్తున్నా, అది కార్యరూపం దాల్చడంలేదు. బొబ్బిలి, తెర్లాం మండలాల్లో కొత్తగా పిల్ల కాలువల ఏర్పాటుకు అవసరమైన భూములు సేకరిస్తున్నామని అధికారులు చెబుతున్నా ఎటువంటి ఫలితం లేదని రైతులు అంటున్నారు. ఇబ్బంది పడుతున్నాం.. తమ గ్రామం మీదుగా తోటపల్లి ప్రధాన కుడికాలువ వెళ్తోంది. మా గ్రామానికి పక్క గ్రామం వరకు పిల్ల కాలువ ద్వారా సాగునీరు అందుతోంది. మా గ్రామానికి చుక్క నీరు కూడా రావడంలేదు. దీంతో తమ భూములన్నీ బీడు భూములుగా మారుతున్నాయి. పిల్ల కాలువల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. –జమ్మల పెంటయ్య, రైతు, సతివాడ, తెర్లాం మండలం. అధికారుల దృష్టికి తీసుకువెళతా.. తోటపల్లి ప్రధాన కుడి కాలువ నుంచి పిల్ల కాలువల ఏర్పాటుకు భూసేకరణ చేయాల్సి ఉంది. తోటపల్లి ఫేజ్–1కు సంబంధించి పిల్ల కాలువలు ఎక్కడెక్కడ ప్రతిపాదనలు చేశారో తెలియదు. ఫేజ్–2కు సంబంధించి పిల్ల కాలువ నిర్మాణ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతా. – దొర, తోటపల్లి ప్రాజెక్టు ఫేజ్–2 ఏఈ, తెర్లాం. -
కాంట్రాక్టర్లకు కాసుల పండుగ.. రైతులకు తప్పని ఇక్కట్లు
సాక్షి, సరుబుజ్జిలి(శ్రీకాకుళం): మండల పరిధిలో సుమారు 4500 హెక్టార్ల సాగు భూమిని కాలువలపై ఆధారపడి సాగు చేస్తున్నారు. అయితే ఈ కాలువ గట్లు సక్రమంగా లేకపోవడంతో ప్రతి ఏటా రైతులకు కష్టాలు తప్పడం లేదు. వంశధార కుడి ప్రధాన కాలువతో పాటు పిల్ల కాలువలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ విషయమై వంశధార అధికారులకు పలు సమావేశాల్లో అందించిన వినతులు బుట్టదాఖలవుతున్నాయి. గత రెండేళ్లకాలంలో వంశధార కాలువలకు నీరు చెట్టు పథకంలో భాగంగా చేపట్టిన పనుల వలన కాంట్రాక్టర్ల జేబులు నిండాయి తప్ప రైతులకు ఎటువంటి ప్రయోజనం చేకూరలేదని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో టీడీపీ నాయకులు తూతూమంత్రంగా పనులు నిర్వహించారని అంటున్నారు. దీంతో ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువ గట్లను పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. -
ప్రభుత్వం పింఛన్ ఇవ్వదు.. మీరే ఆదుకోండి..!
సాక్షి, రామభద్రపురం: ఈ చిత్రంలోని వృద్ధుల పేర్లు నూకమ్మ, సీతయ్య. రామభద్రపురం మండలం గొల్లవీధికి చెందినవారు. ఒక కుమార్తె. ఆమెకు పెళ్లి చేసి పంపించారు. కానీ ప్రస్తుతం ఎలాంటి ఆధారం లేక బతుకుబండి భారంగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన పింఛన్ డబ్బులు కూడా రావడం లేదు. వాస్తవానికి నూకయ్యకు 73, సీతమ్మకు 67 ఏళ్లు ఉంటాయి. కానీ ఆధార్ కార్డు, రేషన్ కార్డుల్లో వయసు తక్కువ పడింది. దీంతో ప్రస్తుతం ఇటీవల తీసుకొచ్చిన 65 ఏళ్లకే పెన్షన్ ప్రకారం ఇద్దరికి పింఛన్ అందడం లేదు. మహానేత వైఎస్సార్ హయాంలో ఇద్దరికి పింఛన్ వచ్చేది. ఇప్పుడు రావడం లేదు. వృద్ధులు కావడంతో పని చేసేందుకు శక్తి లేదు. ఆస్తులు లేవు. కూమార్తెకు పెళ్లి చేసినా అల్లుడు తాగుబోతు కావడంతో ఆమె పరిస్థితి అలాగే ఉంది. మొన్నటి వరకు ప్రభుత్వం అందించే 10 కేజీల బియ్యంతో కాలం గడిపేవారు. కానీ ఇటీవల నూకయ్య ఆరోగ్యం బాగాలేకపోతే రేషన్ కార్డును కుదువ పెట్టేశారు. ఇప్పుడు ఆ బియ్యం కూడా కరువైపోయే. ఈ విషయం మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ కె.అప్పారావుకు తెలిసింది. వెంటనే స్పందించి నెలకు 25 కేజీల చొప్పున బియ్యం అందిస్తున్నాడు. ఇప్పటికైనా దిక్కులేని వారికి దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని ఆయన కోరుతున్నాడు. ఎవరైనా దాతలు ముందుకు వస్తే 91824 35104, 98854 08274 నంబర్లకు సంప్రదించాల్సిందిగా అప్పారావు కోరుతున్నారు. -
మత్స్యకారుల ఆశలపై యుద్ధమేఘాలు...?
ఎచ్చెర్ల క్యాంపస్: జీవనోపాధి కోసం వలస వెళ్లిన మత్స్యకారులు పాకిస్తాన్‌కు బందీలుగా మారారు. వారి విడుదల కేంద్ర హోం, విదేశాంగ శాఖల జోక్యంతోనే సాధ్యం. చెరలో ఉన్న గంగపుత్రుల విడుదలకు ప్రయత్నాలు జరుగుతుండగా.. ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణం వారి కుటుంబ సభ్యుల ఆశలపై నీళ్లు చల్లింది. తమ వారు ఇంత తొందరగా వస్తారో రారోనని వారిలో ఆందోళన తీవ్రమైంది. గుజరాత్ రాష్ట్రం వీరావల్‌లో చేపల వేటకు వెళ్లి పొరపాటున పాకిస్తాన్ జలాల్లో ప్రవేశించిన మత్స్యకారులు చెరశాల పాలయ్యారు. గత ఏడాది నవంబర్ 27న ఈ సంఘటన జరిగింది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని వీరి తప్పు లేదని తెలిపింది. భారత రాయబార కార్యాలయం వీరి విడుదలకు ప్రయత్నిస్తోంది. పరిస్థితి సానుకూలంగా మారింది. తాము క్షేమంగా ఉన్నామని బందీలుగా ఉన్న మత్స్యకారులు రాసిన ఉత్తరాలు ఈ నెల 2న కుటుంబ సభ్యులకు చేరాయి. దీంతో ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. తమ వారి కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో గత కొద్ది రోజులుగా సరిహద్దులో ఏర్పడిన ఉద్రిక్త వాతావరణం ప్రతికూలంగా మారాయి. ఈ నేపథ్యంలో బందీలుగా ఉన్న మత్స్యకార కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పాక్ చెరలో ఉన్న 22 మందిలో మన జిల్లాకు చెందిన వారు 15 మంది ఉన్నారు. వీరిలో శ్రీకాకుళం పట్టణానికి చెందిన వారు ఒకరు కాగా, ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశం, బడివానిపేట, తోటపాలెం పంచాయతీలకు చెందిన వారు 14 మంది ఉన్నారు. ఎలాంటి అవరోధం లేకుండా తమ వారు స్వస్థలాలకు చేరుకోవాలని వారి కుటుంబ సభ్యులు వేయి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదని వేడుకుంటున్నారు. అనుకూల వాతావరణం ఉండేది మత్స్యకారులు పాకిస్తాన్‌కు చిక్కిన సమయంలో అనుకూల వాతావరణం ఉండేది. ఫిబ్రవరి మొదటి, రెండు వారాల్లో విడుదలవుతారనుకున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి సమస్య తీసుకు వెళ్లాం. బందీలుగా ఉన్న వారి నుంచి ఈ నెల 2న ఉత్తరాలు అందాయి. పాకిస్తాన్ భద్రత దళాలు దర్యాప్తు త్వరితగతిన పూర్తిచేస్తే విడుదల సాధ్యమయ్యేది. –మూగి రామారావు,మత్స్యకార యూనియన్ నాయకులు, డి.మత్స్యలేశం -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
ఎచ్చెర్ల క్యాంపస్ : మండలంలోని తమ్మినాయుడుపేట సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. శ్రీకాకుళం రూరల్ మండలం వాకలవలసకు చెందిన బెండు రామారావు(32), చింతాడ సురేష్‌లు ఫ్లోరింగ్ మేస్త్రిలుగా పనిచేస్తున్నారు. పైడి భీమవరంలో పని ముగించుకొని బైకుపై ఇంటికి చేరుకునే క్రమంలో తమ్మినాయుడుపేట సమీపంలో వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న రామారావు అక్కడికక్కడ మృతి చెందాడు. గాయపడిన సురేష్‌ను 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. సకాలంలో చికిత్స అందడంతో ప్రాణాపాయం తప్పింది. మృతుడు రామారావుకు భార్య ధనలక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎచ్చెర్ల ఎస్ఐ వి.సందీప్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నదాత గుండెల్లో మంచు మంటలు
శ్రీకాకుళం రూరల్, న్యూస్‌లైన్: ఖరీఫ్ చివరిలో వరుస దాడులతో అన్నదాతలను అతలాకుతలం చేసిన ప్రకృతి ఇంకా కక్ష తీరినట్లు లేదు. రైతన్నల జీవితాల్లో మంచు మంటలు రేపుతోంది. సెప్టెం బర్ చివరి వారం నుంచి తుపాన్లు, భారీ వర్షాలతో అధిక శాతం ఖరీఫ్ పంటలు నాశనమయ్యాయి. మిగిలిన కొద్దిపాటి ఆహార పంటలతోపాటు కూరుగాయలు, ఇతర ప్రత్యామ్నాయ పంట లను గత కొద్దిరోజులుగా విపరీతంగా కురుస్తున్న మంచు కబళి స్తోంది. వీటికి తోడు జిల్లాలో కొన్ని చోట్ల రబీ సాగు మొదలైంది. ఈ పంటలకు ప్రస్తుతం మంచు, తెగుళ్ల బెడద తీవ్రంగా ఉంది. ఈ ఏడాది రబీ వ్యవసాయానికి మొదట్లో వరద దెబ్బ తగిలింది. దీంతో చాలా వరకు రైతులు నష్టపోయారు. దాని నుంచి తేరుకునే లోగానే మిరప, వంగ, టమాటా, చిక్కుడు, మినుము, పెసర తదితర పంటలకు మంచు, తెగుళ్లు తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా వేలాది ఎకరాల్లో ఉన్న పంట లకు ఇదే సమస్య ఎదురవుతోంది. ఒక్క శ్రీకాకుళం మండలంలోనే సుమారు 500 ఎకరాల్లో మిరపతో పాటు అధిక విస్తీర్ణంలో పెసర, మినుము, వంగ, టమాటా, చిక్కుడు వంటి పంటలు సాగు చేస్తున్నారు. ఇప్పిలి, కళ్ళేపల్లి, కనుగులవానిపేట, బలివాడ, వాకలవలస, బావాజీపేట, రాగోలు, మన్నయ్యపేట తదితర గ్రామాల్లో, పొందూరు, జి.సిగడాం తదితర ప్రాంతాల్లో మిరప సాగులో ఉంది. అదే విధంగా ఎచ్చెర్ల, కోటబొమ్మాళి, కవిటి, గార తదితర మండలాలతోపాటు శ్రీకాకుళం రూరల్ మండలంలోని బావాజీపేట, వాకలవలస, నందగిరిపేట, మన్నయ్యపేట, రాగోలు తదితర గ్రామాల్లో పెద్ద ఎత్తున కూరగాయలు ఆసగు చేస్తున్నారు. అపరాల పంటల విస్తీర్ణం కూడా బాగానే ఉంది. ఈ పంటలకు కీలకమైన ఈ సమయంలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న మంచు వల్ల మొక్కలు ముడసర వేసి ఎదుగుదల కోల్పోతున్నాయి. ఆకుముడత, తెల్లమచ్చ సోకుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట వేసి చాలా రోజులు అవుతున్నా మొక్కలు పెరగడం లేదని, ఎన్ని మందులు కొట్టినా ఫలితం కనిపించడంలేదని ఆవేదన చెందుతున్నారు. గత ఏడాది ఈ సమయానికే మిరప పంట చేతికి అందిందని, మంచు, తెగుళ్ల కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు పూత దశకే రాలేదని అంటున్నారు. ఖరీఫ్‌తో పాటు రబీ కూడా పోయే పరిస్థితి ఉందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మినుము, పెసర, చిక్కుడు పంటల్లో తెల్లదోమ తెగులు విపరీతంగా ఉందని చెబుతున్నారు. -
అగ్ని ప్రమాదాల్లో 21 ఇళ్లు దగ్ధం
శ్రీకాకుళం రూరల్/సంతకవిటి, న్యూస్‌లైన్: జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో సంభవించిన అగ్నిప్రమాదాల్లో 21 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. శ్రీకాకుళం రూరల్ మండలం నైరా పంచాయతీ పరిధి వెంకటాపురంలో బుధవారం రాత్రి జరిగిన సంఘటనలో 7 పురిపాకలు కాలిపోయాయి. సంతకవిటి మండలం అక్కరాపల్లిలో మంగళవారం అర్ధరాత్రి 2 గంటలకు జరిగిన ప్రమాదంలో 8 మిద్దె ఇళ్లు, 6 పురిపాకలు కాలిబూడిదయ్యాయి. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. వివరాలు ఇవీ... శ్రీకా కుళం రూరల్ మండలం నైర పంచాయతీ పరిధి వెం కటాపురంలో బుధవారం రాత్రి 8.30 గంటల సమ యంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో కోనారి కృష్ణ, కోనారి మల్లేసు, కోనారి తవిటమ్మ, కోనారి నారా యుడు, కోనారి శిమ్మయ్య, కోనారి సూర్యనారాయణ, కోనారి రామయ్య ఇళ్లు కాలిబూడిదయ్యాయి. ఆమ దాలవలస అగ్నిమాపక కేంద్రం సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. స్థాని కులు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు బొబ్బాది చంద్రమౌళి, అనిల్‌కుమార్, సర్పంచ్ కర్రి కృష్ణమోహాన్, అరవల రాంప్రతాప్ తదితరులు సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవాలని సర్పంచ్ తదితరులు కోరారు. ఇదిలా ఉండగా సంతకవిటి మండలం అక్కరాపల్లిలో మంగళవారం అర్ధరాత్రి 2 గంటలకు సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 14 ఇళ్లు కాలిబూడిదయ్యాయి. రూ 7 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. బాధితులంతా కట్టుబట్టలతో మిగిలారు. దేవుడి వద్ద పెట్టిన దీపం అంటుకోవడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు. కార్తీక ఏకాదశి కావడంతో అర్ధరాత్రి 12 గంటలకే అక్కరాపల్లిలోని యాదవుల వీధిలో ఉంటున్న పలువురు స్నానాలు చేసి శంకరంపేటలోని సత్యనారాయణస్వామి కోవెలకు వెళ్లారు. వీళ్లల్లో కొందరు ఇళ్లల్లో దేవుడి వద్ద దీపాలు వెలిగించారు. ఆ తర్వాత ఏం జరి గిందో తెలియదుగాని ఒక్కసారిగా మంటలు కనిపించడంతో గ్రామస్తులు అప్రమత్తమై మంటలను అదుపుచేయడానికి ప్రయత్నించారు. అదే సమయంలో గాలులు వీచడంతో వారి ప్రయత్నం ఫలించలేదు. యువకులు అప్రమత్తంగా వ్యవహరించి ఇళ్లల్లో ఉన్న వృద్ధులు, చిన్నారులను బయటకు తీసుకురావడంతో ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదంలో కరగాన గరికయ్య, రాము, తవుడు, రామారావు, గొంటు రాములమ్మ, నరసయ్య, రాములు, సూర్యారావులకు చెందిన మిద్దె ఇళ్లతోపాటు తూలుగు అక్కలనాయుడు, బూర్లె జోగినాయుడు, శాసపు జయమ్మ, రాగోలు రామరావు, కరగాన అప్పలస్వామి, కరగాన రమణలకు చెందిన పురిపాకలు అగ్నికి ఆహుతయ్యాయి. పూజకు వెళ్లిన వారెవరూ సెల్ఫోన్లు తీసుకువెళ్లకపోవడంతో వారికి వెంటనే సమాచారం అందలేదు. తెల్లవారుజామున 3 గంటలకు తిరిగివచ్చినప్పటికి ఇళ్లన్నీ కాలిబూడిదవడాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఈ ప్రమాదంలో గరికయ్యకు చెందిన రూ 50 వేల నగదుతో పాటు రెండున్నర తులాల బంగారం పుస్తెలు తాడు కాలిపోయింది. కరగాన రాముకు చెందిన రూ 30 వేల నగదు, అరతులం బంగారం, తవుడు ఇంట్లో రూ 20 వేల నగదు, రామారావుకు చెందిన రూ 10 వేల నగదు, వెండి వస్తువులు, నరసయ్యకు చెందిన రూ 15 వేల నగదు, అరతులం బంగారం కాలిపోయాయి. సంఘటన స్ధలాన్ని తహశీల్దార్ బి.సూరమ్మతో పాటు ఆర్ఐ ప్రవీణ్‌కుమార్, వీఆర్వో మల్లేశ్వరరావు తదితరులు పరిశీలించారు. ఇదిలా ఉండగా మంత్రి కోండ్రు మురళీమోహన్ పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ 5 వేల ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరుచేయిస్తానని హామీ ఇచ్చారు.