
సాక్షి,ఇచ్ఛాపురం : ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను రక్షించుకోవాలన్న ప్రభుత్వ ఆశయానికి టీడీపీ వర్గీయులు తూట్లు పొడుస్తున్నారు. స్థానిక మహిళలను రెచ్చగొడుతూ అధికారులు, పాలకవర్గాలపైకి ఉసుగొల్పుతున్నారు. ఇటువంటి సంఘటన శనివారం కొఠారీ పంచాయతీలో చోటుచేసుకుంది. కొఠారీ కాలనీ వద్ద సర్వే నంబర్ 133, 135–12లో ప్రభుత్వ స్థలంలో ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ‘మిషన్ ప్రభుత్వ భూమి సంరక్షణ’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఎంఆర్‌ఐ మద్దిలి కృష్ణమూర్తి, మండల సర్వేయర్ తవిటినాయుడుతో పాటు సర్పంచ్ దుక్క ధనలక్ష్మి, వీఆర్వో, సచివాలయ సర్వేయర్, స్థానికులు కొంతమంది కలసి గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఆక్రమణ కట్టడాల వద్దకు వెళ్లారు. అయితే అప్పటికే టీడీపీ నేతలు రెచ్చగొట్టడంతో స్థానిక మహిళలు కొందరు సంఘటనా స్థలం వద్దకు చేరుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చింపేశారు.
చదవండి:Bhola Shankar: చిరుకు సోదరిగా కీర్తి సురేశ్.. రాఖీ వీడియో వైరల్
అక్కడితో ఆగకుండా అధికారులు, సర్పంచ్ ధనలక్ష్మి, ఆమె భర్త ఆనంద్, కుమారుడుపై దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో సర్పంచ్ ధనలక్ష్మి స్వల్ప గాయాలతో బయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో రెవెన్యూ సిబ్బంది అక్కడ నుంచి వెళ్లిపోయారు. దాడికి పాల్పడిన దువ్వు పోతయ్య, దుక్క దీనబందు, సావిత్రి, జయ, దువ్వు జానికమ్మలపై సర్పంచ్ ధనలక్ష్మి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్‌కు ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేయడంతో ఆయన సంఘటనా స్థలానికి చేరుకొని కాలనీ వాసులతో మాట్లాడారు. తహసీల్దార్ దాసరి చిన్న రామారావుకు ఫోన్‌చేసి ఇటువంటి పరిస్థితుల్లో రెవెన్యూ అధికారులు కలుగజేసుకోకూడదంటూ హెచ్చరింపు ధోరణిలో మాట్లాడినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment