శ్రీశైలం ప్రాజెక్టు
సాక్షి, అమరావతి: వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో నదులు, వాగులు, వంకలు ఉరకలెత్తుతున్నాయి. కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి, పెన్నా నదులు కడలి వైపు పరుగులు తీస్తున్నాయి. శ్రీశైలంలోకి మంగళవారం సాయంత్రం 6 గంటలకు 1.64 లక్షల క్యూసెక్కుల కృష్ణా జలాలు చేరుతుండటంతో నీటి నిల్వ 168.63 టీఎంసీలకు పెరిగింది. తెలంగాణ సర్కార్ ఎడమ గట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ విడుదల చేస్తున్న నీటిలో 10,480 క్యూసెక్కులు నాగార్జున సాగర్‌లోకి చేరుతుండటంతో నీటి నిల్వ 305.86 టీఎంసీలకు చేరుకుంది. తెలంగాణలో కురిసిన భారీ వర్షాల వల్ల మూసీ ఉరకలెత్తుతుండటం.. దానికి కృష్ణా వరద తోడవడంతో పులిచింతల ప్రాజెక్టులోకి 45,608 క్యూసెక్కులు చేరుతోంది. నీటి నిల్వ 32.25 టీఎంసీలకు చేరుకుంది. సిŠప్‌ల్ వే గేట్లు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 52,513 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రవాహానికి కట్టలేరు, వైరా, మున్నేరు వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి 1,10,191 క్యూసెక్కులు చేరుతున్నాయి. కృష్ణా డెల్టా కాలువలకు 7,991 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 1,02,200 క్యూసెక్కులను బ్యారేజీ 70 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు.
గోదా‘వడి’ పెరుగుతోంది
గోదావరిలోకి భారీగా వరద చేరుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్దకు 3.50 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. ధవళేశ్వరం బ్యారేజీలోకి 3.32 లక్షల క్యూసెక్కులు వస్తోంది. కాలువలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 3.27 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ఉధృతి
వంశధార, నాగావళి పరవళ్లు
ఒడిశా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కురిసిన వర్షాల కారణంగా వంశధార, నాగావళిలో వరద ఉధృతి పెరిగింది. గొట్టా బ్యారేజీలోకి వంశధార నుంచి 7,133 క్యూసెక్కులు చేరుతుండగా.. 7వేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. నాగావళి ప్రవాహంతో తోటపల్లి, నారాయణపురం ఆనకట్టల్లో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకుంది. దాంతో నారాయణపురం ఆనకట్ట నుంచి 5 వేల క్యూసెక్కుల నాగావళి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి.
పెన్నా బేసిన్‌లో రిజర్వాయర్లు కళకళ
పెన్నా నదిలో వరద ఉధృతి పెరిగింది. గండికోట ప్రాజెక్టు ఇప్పటికే నిండిపోయింది. సోమశిల ప్రాజెక్టులోకి 22,792 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 70.40 టీఎంసీలకు చేరుకుంది. మరో 8 టీఎంసీలు చేరితే సోమశిల ప్రాజెక్టు నిండిపోతుంది. కండలేరులో నీటి నిల్వ 53.76 టీఎంసీలకు చేరుకుంది. ఈ ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 15 టీఎంసీలు అవసరం.
నాతవరం: తాండవ జలాశయ నీటిమట్టం మంగళవారం ప్రమాద స్థాయికి చేరుకోవడంతో అప్రమత్తమైన ప్రాజెక్ట్ అధికారులు స్పిల్‌వే గేట్ల ద్వారా వరద నీటిని తాండవ నదిలోకి విడుదల చేశారు. ప్రాజెక్ట్ సాధారణ నీటిమట్టం 380 అడుగులు కాగా.. మంగళవారం మధ్యాహ్నానికి 379.2 అడుగులకు చేరింది. ఎగువ నుంచి 2,500 క్యూసెక్కుల వరద నీరు జలాశయంలో చేరుతోంది. రెండు స్పిల్‌వే గేట్ల ద్వారా 1200 క్యూసెక్కులు నదిలోకి విడుదల చేశారు. రైవాడ ప్రమాదస్థాయి నీటి మట్టం 114.25 మీటర్లు కాగా.. ప్రస్తుతం 108.25 మీటర్లకు చేరింది. కోనాం ప్రమాద స్ధాయి నీటిమట్టం 101.24 మీటర్లు కాగా.. ప్రస్తుతం 98.45 మీటర్లు, మేఘాద్రిగెడ్డ ప్రమాదస్థాయి నీటిమట్టం 61 అడుగులు కాగా.. 58 అడుగులకు చేరింది. పెద్దేరు ప్రమాదస్థాయి నీటిమట్టం 137 మీటర్లు కాగా మంగళవారం సాయంత్రానికి 136.60 మీటర్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment