'వంశధార' సైడ్ వీయర్ కు ఓకే | vamshadara side weaver ok | Sakshi
Sakshi News home page

'వంశధార' సైడ్ వీయర్ కు ఓకే

Published Wed, Dec 18 2013 4:28 AM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM

'వంశధార'  సైడ్ వీయర్ కు ఓకే

'వంశధార' సైడ్ వీయర్ కు ఓకే

 శ్రీకాకుళం జిల్లా కాట్రగడ్డ వద్ద ‘అడ్డుగోడ’కు అనుమతి
 
 సాక్షి, న్యూఢిల్లీ:  వంశధార నదీ జలాల వివాదంలో రాష్ట్రానికి తొలి విజయం దక్కింది. వంశధార రెండోదశ ప్రాజెక్టులో భాగంగా శ్రీకాకుళం జిల్లా కాట్రగడ్డ వద్ద (మనవైపు నదికి) సైడ్ వీయర్ (గేట్లతో కూడిన అడ్డుగోడ) నిర్మాణానికి వంశధార జల వివాదాల ట్రిబ్యునల్ (వీడబ్ల్యూడీటీ) అనుమతి ఇచ్చింది. తమకు నష్టం జరుగుతుందంటూ ఇంతకాలం మోకాలడ్డుతూ వచ్చిన ఒడిశా అభ్యంతరాలు, వాదనలను తాత్కాలికంగా పక్కనపెట్టింది. దీంతో మరో 8 టీఎంసీల నీటిని వాడుకోవడానికి, తద్వారా మరో 50 వేల ఎకరాలు సాగు చేసేందుకు మన రాష్ట్రానికి అవకాశం చిక్కింది. అయితే సైడ్‌వీయర్ విషయంలో మున్ముందు వివాదాలు తలెత్తకుండా, నిర్మాణం మొదలుకుని, దాని పనితీరు, నీటిని వాడుకోవడం వరకు అన్నింటినీ పర్యవేక్షించడానికి ట్రిబ్యునల్ ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), ఆంధ్రప్రదేశ్, ఒడిశాల నుంచి ఒక్కొక్కరు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఇదే సమయంలో కొన్ని షరతులను కూడా విధించింది. కాట్రగడ్డ వద్ద సైడ్‌వీయర్ నిర్మాణానికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒడిశా దాఖలు చేసిన దరఖాస్తును ( ఇంటర్‌లాక్యుటరీ అప్లికేషన్ ) జస్టిస్ ఎం.కె.శర్మ చైర్మన్‌గా, జస్టిస్ బి.ఎన్.చతుర్వేది, జస్టిస్ గులాం మహమ్మద్ సభ్యులుగా ఉన్న వంశధార ట్రిబ్యునల్ మంగళవారం పరిష్కరించింది. ఈ మేరకు 28 పేజీల మధ్యంతర ఉత్తర్వును ప్రకటించింది. దీంతో సైడ్‌వీయర్ నిర్మాణానికి ఇప్పటివరకూ ఉన్న ప్రతిబంధకాలన్నీ తొలగినట్టయింది. దీంతో మన రాష్ట్ర ఉన్నతాధికారుల్లో, రాష్ట్రం తరఫున వాదించిన న్యాయవాదుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యూరుు.
 
 ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే...
 ఒడిశా దాఖలు చేసిన దరఖాస్తు నేపథ్యంలో ఇరు రాష్ట్రాలు సమర్పించిన పత్రాలు, ఇతరత్రా ఆధారాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, రెండురాష్ట్రాల వాదనలు ఆలకించిన ట్రిబ్యునల్ గత ఆగస్టులో ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. చివరకు మంగళవారం ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ఎం.కె.శర్మ ఉత్తర్వులు వెలువరించారు. ‘సైడ్‌వీయర్ నిర్మాణానికి అనుమతించనట్టయితే... సాగునీరు, ఇతరత్రా అవసరాల కోసం కోరిన పరిమాణం మేరకు జలాలను వినియోగించుకోవడానికి రాష్ట్రాన్ని నిరాకరించినట్టు అవుతుందని, దానివల్ల తాము దారుణంగా నష్టపోతామని, కోలుకోలేనంతగా దెబ్బతింటామనే వాస్తవాన్ని ఆంధ్రప్రదేశ్ స్పష్టంగా చూపగలిగింది. తమ కేసుకు బలమైన ఆధారాలున్నాయని నిరూపించుకోవడంలో ఒడిశా విఫలమైంది. రికార్డుల్లో ఉన్న వాస్తవాలు, పత్రాలు మొగ్గును ఆంధ్రప్రదేశ్‌కే ఇస్తున్నాయి’’ అని ట్రిబ్యునల్ పేర్కొంది. వాస్తవాలను, కేసు నేపథ్యాన్ని సమగ్రంగా పరిశీలించిన మీదట సైడ్‌వీయర్ నిర్మాణాన్ని ప్రతిపాదిత అనుబంధ పనులతో సహా చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్‌కు అనుమతిస్తున్నట్లు ట్రిబ్యునల్ తెలిపింది.
 
 ఇవీ షరతులు..
 సైడ్‌వీయర్ నిర్మాణం, అనుబంధ పనుల నిమిత్తం ప్రస్తుతమిస్తున్న ఉత్తర్వులు తాత్కాలికమైనవేనని, అవసరమనుకున్న సందర్భంలో తామిచ్చే తదుపరి ఉత్తర్వులకు ఇవి లోబడి ఉంటాయని పేర్కొంది. ట్రిబ్యునల్ మొత్తం పది షరతులను విధించింది. అందులో ముఖ్యమైనవి...
  సైడ్‌వీయర్ నిర్మాణం, దాని పనితీరు, ట్రిబ్యునల్ ఉత్తర్వు అమలును పర్యవేక్షించడానికి ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేయాలి. ‘జల ప్రవాహ నిర్వహణ, నియంత్రణ పర్యవేక్షక కమిటీ’గా వ్యవహరించే ఈ కమిటీలో ముగ్గురు సభ్యులుంటారు. సీడబ్ల్యూసీ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాల తరఫున మొత్తం ముగ్గురికి ఇందులో స్థానమివ్వాలి. సీడబ్ల్యూసీ ప్రతినిధి చైర్మన్‌గా వ్యవహరిస్తారు.
 
  ప్రాజెక్టు ప్రతిపాదనకు కేంద్ర జలసంఘం, జల వనరులు, పర్యావరణ, అటవీ, గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖల అనుమతులు, చట్టపరంగా అవసరమైన ఇతర అనుమతులు పొందడం తప్పనిసరి.
  సైడ్‌వీయర్ పనితీరునంతటినీ, గేట్ల మూసివేతతో సహా, పర్యవేక్షక కమిటీయే చూస్తుంది.
  కమిటీయే తన కార్యాలయ ప్రదేశాన్ని ఎంపిక చేసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ కమిటీకి కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తుంది. కార్యాలయ నిర్వహణ, పర్యవేక్షణ కార్యకలాపాలకు అయ్యే ఖర్చులను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే భరిస్తుంది.
 
  సైడ్‌వీయర్‌కు ఎగువన ప్రవాహం ఎంత ఉంది, సైడ్‌వీయర్ నుంచి ఎన్ని నీళ్లు వెళ్తున్నాయనే వివరాల రికార్డును కమిటీ నిర్వహిస్తుంది. వంశధార నదిలో సైడ్‌వీయర్‌కు ఎగువన ప్రవాహ జలాలు 4,000 క్యూసెక్కులకు మించి ఉన్నపుడు, దిగువన ప్రవహించే నీళ్లు 4,000 క్యూసెక్కులకు సమానంగా లేక అంతకుమించి ఉన్నపుడే దాని గేట్లను తెరవడానికి కమిటీ అనుమతించాలి.
 
  ఏ సంవత్సరంలోనైనా సరే జూన్ నుంచి నవంబర్ వరకు ఉన్న నెలల్లో సైడ్‌వీయర్ ద్వారా పక్కకు వెళ్లే మొత్తం జలాలు ఎట్టి పరిస్థితుల్లోనూ 8 టీఎంసీలకు మించకుండా ఉండేలా కమిటీ చూడాలి. ఈ 8 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటాకు వచ్చే 50 శాతం జలాల్లో భాగమవుతాయి.
 
  జూన్ మాసం నుంచి నవంబర్ వరకు సైడ్‌వీయర్ నుంచి పక్కకు వెళ్లే జలాల మొత్తం ఎప్పుడైతే 8 టీఎంసీలకు చేరుకుంటుందో ఆ వెంటనే సైడ్‌వీయర్ గేట్లను మూసివేసేలా, మళ్లీ తదుపరి సంవత్సరం వర్షాకాలం వరకు అవి అదే స్థితిలో ఉండేలా కూడా కమిటీ చూస్తుంది.
 
  వంశధార నది నుంచి ప్రవహించే మొత్తం జలాలు దిగువకు పారేందుకు, వాటిని రెండు రాష్ట్రాలు వినియోగించుకునేందుకు వీలుగా డిసెంబర్ 1 నుంచి మే 31 మధ్యకాలంలో సైడ్‌వీయర్ గేట్లు మూసివుంటాయి.
 ఇక నేరడిపై దృష్టి..!
 
 కాట్రగడ్డ సైడ్‌వీయర్ నిర్మాణంపై ఒడిశా దరఖాస్తును పరిష్కరించిన నేపథ్యంలో ఇప్పుడు ట్రిబ్యునల్ నేరడి బ్యారేజీపై దృష్టి పెట్టనుంది. నేరడి వద్ద బ్యారేజీకి సంబంధించిన ప్రధాన కేసు ట్రిబ్యునల్ ఎదుట పెండింగ్‌లో ఉంది. ఈ కేసులో తదుపరి విచారణను జనవరి 22న, ఏప్రిల్ 2న జరుపుతామని ట్రిబ్యునల్ మంగళవారం ప్రకటించింది. ట్రిబ్యునల్ ఉత్తర్వుపై రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అంతర్‌రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజనీర్ ఎం.ఎ.రవూఫ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎల్.వి.రమణమూర్తి, తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ట్రిబ్యునల్‌లో రాష్ట్రం తరఫున వాదించిన న్యాయవాదుల బృందంలో సీనియర్ న్యాయవాదులు సి.ఎస్.వైద్యనాథన్, ఎస్.సత్యనారాయణ ప్రసాద్, ఎ.సత్యప్రసాద్, బాదన భాస్కరరావు, వై.రాజగోపాల్ తదితరులున్నారు.
 
 ఇదీ నేపథ్యం...
  వంశధార నది ఒడిశా-ఆంధ్ర సరిహద్దులో 29 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 82 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. ఒడిశా-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సెప్టెంబర్ 30, 1962న ఈ నదీ జలాలను 50:50 నిష్పత్తిలో పంచుకోవాలనే ఒప్పందం కుదిరింది. వంశధార ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం దీనిని రెండు దశల్లో నిర్మించాలని నిర్ణయించింది. మొదటి దశలో గొట్టా బ్యారేజీ, ఎడమ ప్రధాన కాలువలను నిర్మించి 17.841 టీఎంసీల నదీ జలాలను వినియోగిస్తూ 1.48 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయింది. రెండవ దశలో 16.048 టీఎంసీలు వినియోగించుకుంటూ 1.07 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును ప్రతిపాదించింది. నేరడి బ్యారేజి నిర్మాణానికి 106 ఎకరాల భూమి సేకరణకు ఒడిశా ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంలో ఆలస్యం అయినందున రాష్ట్ర ప్రభుత్వం వంశధార రెండవ దశ నిర్మాణాన్ని రెండు విడతలుగా చేపట్టాలని భావించింది. మొదటి దశలో గొట్టా బ్యారేజీ నుంచి కుడి ప్రధాన కాలువ నిర్మించి 0.62 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు ట్రిబ్యునల్ తీర్పు మేరకు సైడ్‌వీయర్ నిర్మాణం ద్వారా మరో 8 టీఎంసీలను వినియోగించుకోవడానికి వీలు చిక్కింది. రెండవ దశ నిర్మాణంలో భాగంగా నేరడి బ్యారేజీ, ఫ్లడ్‌ఫ్లో కాలువ, హీర రిజర్వాయర్ నిర్మించి 45 వేల ఎకరాలకు సాగులోకి తీసుకురావడంతో పాటు గొట్టా బ్యారేజీ కుడి, ఎడమ ప్రధాన కాలువల ఆయకట్టు స్థిరీక రణ జరుగుతుంది

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement